ప్రత్యేక డ్రైవ్‌తో సత్ఫలితాలు..
టీకా కోసం కదులుతున్న ప్రజానీకం
ఇప్పటివరకు 3,89,299 మందికి మొదటి డోస్
1,76,632 మందికి రెండో డోస్ పూర్తి
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి);జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ అధికారులు, ప్రజాప్రతినిధుల కృషితో సత్ఫలితాలనిస్తున్నది. ‘కరోనా టీకాలు మాకొద్దు’ అని మొదట్లో పారిపోయిన జనం నేడు చైతన్యంతో వరుస కట్టి టీకాలు వేయించుకుంటున్నారు. గ్రామాల్లోనే టీకాలు వేస్తుండడం, స్వచ్ఛందంగా ముందుకొస్తుండడంతో వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,89,299 మంది మొదటి డోస్, 1,76,632 మంది రెండో డోస్ వ్యాక్సిన్ పూర్తి చేసుకున్నారు. 122 గ్రామాలు, మున్సిపాలిటీల్లోని 15 వార్డులు వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేసుకుని ఆదర్శంగా నిలిచాయి.
గతంలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రితో పాటు 20 పీహెచ్‌సీలు, 3 సీహెచ్సీల్లోనే వ్యాక్సినేషన్‌ను నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లోనూ టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఏఎన్ఎం, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, మల్టీపర్పస్ కార్మికులు 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి టీకా వేస్తున్నారు. పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యులు, మున్సిపాలిటీల్లో అయితే మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో టీకాపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో కేంద్రాలు ఉండడం, గ్రామాల్లో పొలాల వద్దకే వెళ్లి టీకాలు ఇస్తున్నారు. గ్రామాలు, అనుబంధ ఆవాసాల్లో వంద శాతం టీకాలు పూర్తికాగానే అధికారికంగా ప్రకటించి సంబురాలు చేస్తూ ప్రజలకు అవగాహన కలిగేలా చూస్తున్నారు.
గ్రామాల్లో జోరుగా..
ఇప్పటి వరకు జిల్లాలో 3,89,299 మంది మొదటి డోస్, 1,76,632 మంది రెండో డోస్‌ను పూ ర్తి చేసుకున్నారు. స్పెషల్ డ్రైవ్‌లో వ్యాక్సినేషన్ జోరు మరింత పెరిగింది. సెప్టెంబర్ 16 నుంచి చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 1,49,684 మంది టీకాలు తీసుకోగా అందులో 1,15,954 మంది మొదటి డో స్, 33,730 మంది రెండో డోస్ పూర్తి చేసుకున్నారు.
ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు
జిల్లాలోని పలు గ్రామాలు వ్యాక్సినేషన్లో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 122 గ్రామాల్లో, మరో 15 మున్సిపల్ వార్డుల్లో వంద శాతం లక్ష్యం పూర్తయింది. వేముల కొండ పీహెచ్సీ పరిధిలో అత్యధికంగా 18 గ్రామాలు వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నాయి. బీబీనగర్ పీహెచ్సీ పరిధిలో 2 గ్రామాలు, శారాజీపేటలో 10, తంగెడుపల్లి 8, కొండమడుగు 6, వలిగొండ 2, మోటకొండూరు 4, బొల్లేపల్లి 8, ఆత్మకూరు 8, మోత్కూరు 3, సంస్థాన్ నారాయణపురం 7, రాజపేట 1, బొమ్మలరామారం 2, భూదాన్ పోచంపల్లి 9, యాదగిరిగుట్ట 13, గుండాల 10, వర్కట్‌పల్లి 6, అడ్డగూడూరు 2, మునిపంపుల 5 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 15 వార్డులు వంద శాతం లక్ష్యాన్ని సాధించాయి.
లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి
కొవిడ్ టీకాల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. గ్రామాల వారీగా శిబిరాల ఏర్పాటుతో మంచి స్పందన లభిస్తున్నది. ఇతర శాఖల అధికారుల సమన్వయంతో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం.