దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో పార్క్
ఆసియాలో రెండో ఊడల మర్రి, పేదల తిరుపతి మన్యంకొండ..
మూడు ప్రాంతాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్
రూ. 300కే ఏసీ బస్సు పర్యటన
బస్సును ప్రారంభించిన పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ అక్టోబర్10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గతంలో ఎప్పుడైనా ఊహించామా.. పాలమూరులో పర్యాటకం ఈ స్థాయిలో ఉంటుందని.. స్థానికంగా ఏసీ బస్సులో పర్యాటక ప్రదేశాలు తిరిగివస్తామని.. సమైక్య రాష్ట్రంలో పాలమూరు ప్రజలు తాగునీటికి 15రోజులు వేచి చూసే దశనుంచి.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే దశకు చేరుకున్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా జిల్లాలో పర్యాటక సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఏసీ బస్సును ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ వద్ద పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ లాంఛనంగా బస్సును ప్రారంభించారు. బస్సులో మంత్రితోపాటు కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, టూరిజం ఎండీ మనోహర్, పర్యాటకశాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు ప్రయాణించారు.
మూడు పర్యాటక కేంద్రాలను కలుపుతూ..
మన్యంకొండ, పిల్లలమర్రి, కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు ను కలుపుతూ పర్యాటక సర్క్యూట్‌ను ఏర్పాటు చేశారు. సెలవు రోజులు, వారాంతపు సెలవులు, ఆదివారాల్లో ఈ బస్సు నడుపనున్నారు. పర్యాటకుల డిమాండ్‌ను బట్టి నిత్యం నడిపేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. పెద్దలకు రూ.300, పిల్లలకు(5-12 ఏళ్లలోపు) రూ.200 చొప్పున టికెట్ ఉంటుంది. ఈ మొత్తంలోనే మధ్యాహ్న భోజనం, రెండు సార్లు టీ ఇస్తారు. బస్సు ఉదయం 8గంటలకు కలెక్టర్ కార్యాలయం నుంచి బయలుదేరి మన్యంకొండ చేరుకుంటుంది. అక్కడ వీఐపీ దర్శనం చేయిస్తారు. స్వామివారి ప్రసాదం కూడా అందిస్తారు. పక్కనే ఉన్న మిషన్‌భగీరథ వాటర్ గ్రిడ్ చూసుకొని కొండకింద పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని.. పిల్లలమర్రికి చేరుకుంటారు. పిల్లలమర్రిలో సైన్స్ మ్యూజియం, చిల్డ్రన్స్‌పార్క్, ఆర్కియాలజీ మ్యూజి యం, మినీ జూ తదితర ప్రదేశాలను తిలకిస్తారు. మ ధ్యాహ్నం కేసీఆర్ ఎకో అర్బన్‌పార్కుకు చేరుకుంటారు. అక్కడే భోజనానంతరం ఎకో పార్క్ లోని అడ్వెంచర్ పార్కులు, రెయిన్ ఫారెస్ట్, బోటింగ్, బటర్‌ఫ్లై గార్డెన్, అడ్వెంచర్ పార్క్, వాటర్‌ఫాల్స్, కరెన్సీ పార్క్ తదితర ప్రదేశాలను తిలకించేందుకు అవకాశం ఉంది. ఎకోపార్క్ సందర్శన అనంతరం తిరిగి కలెక్టరేట్ వద్ద పర్యాటకులను దించుతారు. టికెట్ల కోసం కలెక్టరేట్లోని పర్యాటకశాఖ కౌంటర్లో సంప్రదించాలి. మరిన్ని వివరాలకు 8125351022కు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు.
పాలమూరు నుంచే ప్రారంభం
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పర్యాటక రంగాన్ని విస్తరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సీఎం ఆదేశాలను ముందుగా పాలమూరు నుంచే అమలు చేస్తున్నామన్నారు. దేశంలోనే అతిపెద్దదైన కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్, ఆసియాలోనే రెండో అతిపెద్ద మర్రిచెట్టు పిల్లలమర్రి, పాలమూరు తిరుపతిగా ఖ్యాతిగాంచిన మన్యంకొండ పర్యటనను పాలమూరువాసులు రూ. 300తో ఏసీ బస్సులో తిరిగే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. కుటుంబసభ్యులతో కలిసి బస్సులో పర్యటించవచ్చన్నారు. త్వరలో ఉమ్మడి జిల్లా పర్యాటక సర్క్యూట్ టూర్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు.
బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న మంత్రి
మహబూబ్‌నగర్, అక్టోబర్ 10: కలెక్టరేట్లోని డీడబ్ల్యూవో శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను సమైక్య పాలకులు కనుమరుగయ్యేలా చేశారని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణ పండుగలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. వేడుకల్లో కలెక్టర్ వెంకట్రావు, డీడబ్ల్యూవో రాజేశ్వరి, సీడీపీవోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
పెంపుడు జంతువుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
మహబూబ్‌నగర్ అక్టోబర్ 10: పెంపుడు జంతువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన డాగ్ షో కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పెంపుడు జంతువులు ఎంతో విశ్వాసంతో ఉంటాయని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. డాగ్ షోలు విజేతలుగా నిలిచిన బాలరాజు, ప్రవీణ్, వికాస్, రచన, అశోక్‌కుమార్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బహుమతులు, జ్ఞాపికలను అందజేశారు. అదేవిధంగా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ డాగ్ షో ఏర్పాటు చేయడంపై ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎఫ్‌వో గంగారెడ్డి, డీఆర్డీవో యాదయ్య, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ, పశసంవర్ధక శాఖ జిల్లా అధికారి మధుసూదన్‌గౌడ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.