కొరిటికల్లో ప్రారంభమైన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు
ఖానాపూర్లో నల్లపోచమ్మ అమ్మవారి విగ్రహం..
మామడ, ఆగస్టు 9 : నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటికల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు సొమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దేవతామూర్తుల విగ్రహాలను గ్రామంలోని ప్రధాన వీధులగుండా ఊరేగించారు. అనంతరం భగవత్ ప్రార్థన, గణపతిపూజ, యాగశాల ప్రవేశం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహ ఊరేగింపు కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేంకటేశ్వర స్వామి మాలధారణ స్వీకరించిన భక్తులు ఉరేగింపు సందర్భంగా నృత్యాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పాట్కూరి భోజవ్వ, ఎంపీటీసీ అందె సౌజన్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు అక్కనపెల్లి గంగాధర్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో అమ్మవారి విగ్రహం..
ఖానాపూర్ టౌన్, ఆగస్టు 9: ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీ రెంకోనివాగు సమీపంలో నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. పట్టణంలోని మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా గంగనీళ్లను తీసుకొచ్చి ముత్యాల పోచమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి జలాభిషేకం చేశారు. అనంతరం ముత్యాల పోచమ్మ ఆలయం నుంచి ఆలయ కమిటీ, ఖానాపూర్ భక్త బృందం అధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగిస్తూ డప్పు వాయిద్యాలతో గాంధీనగర్ నల్ల పోచమ్మ ఆలయానికి తీసుకొచ్చా రు. వేద పండితుల ఆధ్వర్యంలో మహా గణధిపతి పూజ, రక్షా బంధనం, యాగశాల ప్రవేశం, నవగ్రహ పూజ, అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. కార్యక్రమాల్లో టీజీవో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజ్మీ రా శ్యాంనాయక్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, నాయకులు కల్వకుంట్ల నారాయణ, బీసీ రాజన్న, బక్కశెట్టి లక్ష్మణ్, సిరిపురం నాగరాజు, కరిపే శ్రీనివాస్, కావలి సంతో ష్, కొండాడి నాగేందర్రావు, తదితరులు పాల్గొన్నారు.