మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి
హాజరైన మెదక్,సంగారెడ్డి కలెక్టర్లు, సిద్దిపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్
ఈ నెల 30తో ముగియనున్న ప్రస్తుత పాలసీ
త్వరలో నోటిఫికేషన్ విడుదల
హర్షం వ్యక్తం చేస్తున్న బడుగు, బలహీన వర్గాల ప్రజలు
సిద్దిపేట అర్బన్/ సంగారెడ్డి కలెక్టరేట్/ మెదక్, (నవంబర్ 8): మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలనుసారం గౌడ కులస్తులకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5శాతం చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు దుకాణాలను కేటాయించారు. సిద్దిపేట జిల్లాలో 93, మెదక్ జిల్లాలో 49, సంగారెడ్డిలో 101 వైన్ షాపులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. మిగిలిన వాటికి ఓపెన్ కేటగిరిలో భాగంగా అన్ని వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పారదర్శకత కోసం మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ తీశారు. అయితే, సిద్దిపేట జిల్లాలో ఎస్టీ నోటిఫైడ్ ప్రాంతాలు లేనందున రిజర్వేషన్లు ప్రకటించలేదు. డిసెంబర్ 1, 2021 నుంచి నవంబర్ 30, 2023 కాలానికి కొత్తగా లైసెన్స్‌లను మంజూరు చేయనుండగా, ప్రతి షాప్‌నకు రూ.2 లక్షల నాన్ రీఫండబుల్ రుసుముతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దుకాణాల కేటాయింపు, నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ త్వరలో చేపట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు లాటరీ పద్ధతిన వైన్‌షాపుల రిజర్వేషన్లను అధికారులు కేటాయించారు. మద్యం షాపులు కేటాయించే సమయంలో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో అధికారుల సమక్షంలో ఆయా ప్రక్రియను పూర్తి చేసి వెల్లడించారు. పారదర్శకంగా రిజర్వ్ వైన్ షాపులు కేటాయించే విధంగా మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేశారు. 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు ప్రస్తుతం కేటాయించే షాపుల లైసెన్స్ ఉంటుందని మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హరీశ్, హనుమంతరావు, సిద్దిపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. ప్రతి షాపునకు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుముతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వైన్ షాపుల కేటాయింపు ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ మొదలైన అంశాల షెడ్యూల్‌ను ఆబ్కారీశాఖ కమిషనర్, సంచాలకులు ప్రకటిస్తారని ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు వివరించారు.
సిద్దిపేట జిల్లాలో 93 వైన్ షాపులు..
సిద్దిపేట జిల్లాలో పాత వైన్‌షాపులు 70, కొత్త ప్రతిపాదించిన 23 మొత్తం 93 షాపులకు ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు సిద్దిపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ భాస్కర్‌రెడ్డి తెలిపారు. మొత్తం 93 షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, కమిషనర్ ఆబ్కారీశాఖ ఆదేశాల మేరకు గౌడ కులస్తులకు 16 షాపులు, ఎస్సీలకు 9 షాపులు రిజర్వ్ చేసి సదరు షాపులను లాటరీ ద్వారా కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లాలో ఎస్టీ నోటిఫైడ్ ప్రాంతాలు లేనందున ఎస్టీలకు షాపు రిజర్వేషన్లు కేటాయించలేదన్నారు. జిల్లాలో మిగిలిన 68 షాపులకు అన్నివర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట డీఆర్వో చెన్నయ్య, బీసీ డెవలెప్మెంట్ ఆఫీసర్ సరోజ, ఎస్సీ డెవలెప్మెంట్ ఆఫీసర్ లత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో 49 వైన్స్ షాపులు
నూతన ఆబ్కారీ విధానంలో రిటైల్ మద్యం దుకాణాల ఎంపికను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించినట్లు మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. అధికారుల సమక్షంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీవో సాయిరాం లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను ఎంపిక చేశారు. జిల్లాలో 49 వైన్ షాపులకు గాను ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు 30 శాతం రిజర్వేషన్‌గా 16 దుకాణాలను కేటాయింపుకు రొటేషన్ (సైకిల్ సిస్టం) పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, గౌడలకు వరుసగా లాటరీ తీసి దుకాణాలు కేటాయించినట్టు తెలిపారు. అంతేకాకుండా 33 దుకాణాలను ఓపెన్‌లో కేటాయించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీవో సాయిరాం, అబ్కారీ సూపరింటెండెంట్ రజాక్, డీఎస్డీవో విజయలక్ష్మీ, బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నారాయణరెడ్డి, అబ్కారీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 101 ఏ4 వైన్ షాపులు
ప్రభుత్వ నిబంధనల మేరకు సంగారెడ్డి కలెక్టర్‌లో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో ఎక్సైజ్ అధికారులు రిజర్వేషన్లను ఖరారు చేశారు. మొత్తం 101 షాపులకు గాను 85 షాపులు పాతవి కాగా, 16 కొత్త షాపులు ఉన్నాయి. ఇందులో అందోల్ ఎస్‌హెచ్‌వో పరిధిలో 5 షాపులు ఉండగా, జహీరాబాద్ 2, నారాయణఖేడ్ 2, సంగారెడ్డి 3, పటాన్చెరు పరిధిలో 4, మొత్తం 16 కొత్త షాపులున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో ఉన్న 101 ఏ4 వైన్ షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశామన్నారు. గౌడ కులస్తులకు 9 షాపులు, ఎస్టీలకు 2, ఎస్సీలకు 2 షాపులు రిజర్వ్ చేశామన్నారు. మిగతా 77 షాపులకు అన్నివర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆబ్కారీశాఖ సూపరింటెండెంట్ గాయత్రి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఫిరంగి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కేశూరాం, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి అఖిలేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.