న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: సోషల్ మీడియా వ్యసనం, రీల్ మేకింగ్‌పై వ్యామోహం ప్రాణాంతకంగా ఎలా మారతాయో రుజువు చేసే దురదృష్టకర ఘటన ఇది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బందా జిల్లాలో ఓ 27 ఏండ్ల మహిళ రీల్స్ చిత్రీకరించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. రీల్ కోసం నాటకీయంగా మొదలైన సన్నివేశం చివరకు విషాదంగా ముగిసింది.
మోహిని అనే మహిళ తన ఇంట్లో రీల్ చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ఉరి వేసుకుంటున్న దృశ్యాన్ని సృష్టించాలనుకుంది. తన మెడకు ఉరి తగిలించుకుని ఓ స్టూల్ మీద నిలుచుని తన మొబైల్ ఫోన్లో ఈ నటనను చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే త్రుటిలో పరిస్థితి విషాదంగా మారింది.
స్టూలు మీద నుంచి ఆమె కాలు ఎలా జారిందో తెలియదు. కాని ఆమె మెడలో ఉరి తాడు బిగుసుకుని క్షణాలలో ప్రాణం కోల్పోయింది. నాలుగేండ్ల మోహిని కుమార్తె తల్లి ఉన్న గదిలోకి ప్రవేశించినపుడు ఈ దృశ్యం కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తల్లిని ఆ స్థితిలో చూసి కూతురు భయంతో కేకలు పెట్టగా ఇరుగు పొరుగు వారు పరుగున అక్కడకు చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారు నిశ్చేష్టులయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మోహిని మృతదేహాన్ని కిందకు దింపి శవ పరీక్షకు పంపారు. ప్రాథమికంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.