లక్నో: హోంవర్క్ చేయకపోవడంతో ఒక విద్యార్థిపై ఉపాధ్యాయుడు తన ప్రతాపం చూపాడు. పదేండ్ల బాలుడిని బెత్తంతో 150 సార్లు కొట్టాడు. కాళ్లు వాయడంతో ఆ విద్యార్థి బాధతో కుంటుతూ ఇంటికి చేరుకున్నాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు అనంతరం ఆ టీచర్ను స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. పోలీసులు కేసు కూడా నమోదుచేశారు. ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కర్నైల్గంజ్కు చెందిన 10ఏండ్ల బాలుడు స్థానిక ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి హోంవర్క్ చేయకపోవడంతో ఇంగ్లిష్ టీచర్ ప్రఖర్ సింగ్ ఆగ్రహించాడు. బాలుడి కాళ్లపై బెత్తంతో పదే పదే కొట్టడం మొదలుపెట్టాడు. కొట్టిన సంగతి ఎవరికీ చెప్పవద్దని, చెబితే ఇంకా కొడతానని బెదిరించాడు. ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి చెప్పారు.