ముంబై: దశాబ్దం తర్వాత సొంత ఇలాఖాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్ తమ జైత్రయాత్ర మొదలుపెట్టింది. ముచ్చటగా మూడోసారి టైటిల్ గెలువాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా..తమ తొలి మ్యాచ్‌లో ఆకట్టుకుంది. శనివారం జరిగిన గ్రూపు-ఏ పోరులో భారత్ 29 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించింది. తద్వారా పొట్టి ఫార్మాట్లో అప్రతిహత విజయాల జోరు కొనసాగిస్తున్నది. తొలుత కెప్టెన్ సూర్యకుమార్‌యాదవ్(49 బంతుల్లో 84 నాటౌట్, 10ఫోర్లు, 4సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 161/9 స్కోరు చేసింది. తిలక్‌వర్మ(25), ఇషాన్‌కిషన్(20) ఫర్వాలేదనిపించగా, అభిషేక్‌శర్మ(0), శివమ్‌దూబే(0), రింకూసింగ్(6), హార్దిక్‌పాండ్యా(5) ఘోరంగా విఫలమయ్యారు.
షాడ్లె వాన్ షల్విక్(4/25) ధాటికి 77 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకున్న జట్టును సూర్యకుమార్ ఒంటిచేత్తో సాధికారిక స్కోరు అందించాడు. టెయిలెండర్లతో కలిసి జట్టుకు విలువైన పరుగులు సాధించిపెట్టాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అమెరికా 20 ఓవర్లలో 132/8 స్కోరుకు పరిమితమైంది. గాయంతో దూరమైన హర్షిత్రానా స్థానంలో జట్టులోకి వచ్చిన సిరాజ్(3/29) ధాటికి యూఎస్ఏ బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. తన దేశవాళీ ఫామ్‌ను కొనసాగిస్తూ సిరాజ్ వికెట్ల వేట కొనసాగించాడు. శుభమ్(37), సంజయ్(37), మిలింద్(34) ఆకట్టుకోగా, మిగతావారు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. సాధికారిక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకమైన సూర్యకుమార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈనెల 12న ఢిల్లీలో నమీబియాతో భారత్ తలపడనుంది.
టాస్ గెలిచిన అమెరికా కెప్టెన్ మోనాంక్పటేల్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయాన్ని బలపరుస్తూ అమెరికా బౌలర్లు టీమ్ఇండియాను ఆదిలోనే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. సూపర్‌ఫామ్‌మీదున్న హార్డ్‌హిట్టర్ అభిషేక్‌శర్మ తాను ఎదుర్కొన్న తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి అలీఖాన్ బౌలింగ్‌లో సంజయ్ క్యాచ్‌తో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో తిలక్‌వర్మ, ఇషాన్‌కిషన్ జట్టును గాడిలోపడేసే ప్రయత్నం చేశారు. వీరిద్దరు దూకుడు తగ్గకుండా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును గాడిలోపడేశారు. అయితే షెల్విక్ ఒకే ఓవర్లో ఇషాన్‌కిషన్, తిలక్‌తో పాటు దూబేను ఔట్ చేసి భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు.

ప్రమోషన్లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన రింకూసింగ్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేపోయాడు. మెహిసిన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన రింకూ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దీంతో 70 పరుగులకే బ్యాటర్లంతా పెవిలియన్ చేరారు. ఈ స్థితిలో అక్షర్‌పటేల్(14) జతగా సూర్యకుమార్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తనదైన శైలిలో షాట్లు ఆడుతూ కీలక పరుగులు జతచేశాడు. ఈ క్రమంలో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న సూర్య..నెత్రవాల్కర్ ఆఖరి ఓవర్లో విశ్వరూపం చూపెట్టాడు. ఆఫ్‌సైడ్ బంతులను వికెట్ల మీదుగా ఆడుతూ 4,6, 6,4తో దుమ్మురేపడంతో టీమ్ఇండియా స్కోరు 160 మార్క్ అందుకుంది.
జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న సిరాజ్ తన విలువను చాటుకున్నాడు. చివరి నిమిషంలో బుమ్రా కూడా దూరం కావడంతో సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఇదే అవకాశంగా మలుచుకుంటూ మూడు వికెట్లతో సిరాజ్ జట్టు విజయంలో కీలకమయ్యాడు. ఓపెనర్ అండ్రియస్ గౌస్(6)ను బోల్తా కొట్టించిన ఈ హైదరాబాదీ..సాయితేజ(2), శుభమ్‌ను ఔట్ చేసి ఆకట్టుకున్నాడు. సిరాజ్ జతగా అర్ష్‌దీప్, అక్షర్ వికెట్లు తీయడంతో అమెరికా లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. మిడిలార్డర్లో మిలింద్, సంజయ్, శుభమ్ రాణించినా మిగతావాళ్ల వైఫల్యం గెలుపు అవకాశాలను దెబ్బతీసింది.
భారత్: 20 ఓవర్లలో 161/9(సూర్యకుమార్ 84 నాటౌట్, తిలక్ 25, షెల్విక్ 4/25, హర్మీత్ 2/26), అమెరికా: 20 ఓవర్లలో 132/8(శుభమ్ 37, సంజయ్ 37, సిరాజ్ 3/29, అర్ష్‌దీప్ 2/18)