
పూర్తయ్యిన అక్కన్నపేట-ఉప్పులింగాపూర్ రోడ్డు
రోడ్ల మరమ్మతుకు సీఆర్ఎఫ్ కింద రూ.30కోట్ల నిధులు
కల్వకుంట-పులిమామిడి రోడ్డుకు రూ.8 కోట్లు
పైపులతో 60 కల్వర్టుల నిర్మాణం పూర్తి
సింగిల్ రోడ్లను డబుల్‌రోడ్లుగా విస్తరించినరాష్ట్ర ప్రభుత్వం
మూడు మండలాల రైతులు హర్షం
రామాయంపేట, నవంబర్ 8 : మెదక్ జిల్లాలో సింగిల్ రోడ్లను డబుల్‌గా మార్చేందుకు తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నది. ఇప్పటికే ఏ మారు మూల పల్లెలు చూసినా తారురోడ్లే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మేజర్ పంచాయతీ మండలాలను కలిపేందుకు మరో అడుగు ముందు కు వేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.102 కోట్ల నిధులను సీఆర్ఎఫ్ కింద సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం 2018లోనే నిధులను మంజూరు చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు కృషి మూలంగా రామాయంపేట మండలంలోని అక్కన్నపేట నుంచి వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామం వరకు 23 కిలోమీటర్ల మేర రోడ్డును డబుల్‌గా మార్చేందుకు రూ.30 కోట్ల నిధులను మంజూరు చేసింది. గత దశాబ్దాలుగా అక్కన్నపేట గ్రామం నుంచి చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి మీదుగా వెల్దుర్తి మండలంలోని ఉప్పలింగాపూర్ వరకు ఉన్న రోడ్డులో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియని పరిస్థితి. 23 కిలోమీటర్ల మేర సింగిల్ రోడ్డుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. రోడ్డు విస్తరణకు మంత్రి హరీశ్ రావు ముందడుగు వేసిరూ. 30కోట్ల నిధులను మంజూరు చేయించారు. పనులు పూర్తి కావడంతో రైతు లు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మెదక్ జిల్లాలోని మూడు మండలాలను కలిపేందుకు ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కృషిని కొనియాడుతున్నారు. రోడ్డు విస్తరణతో ప్రజా రవాణా వ్యవస్థతో పాటు రామాయంపేటకు, వెల్దుర్తి మండలానికి మరింత దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయి. అంతేగాకుండా నర్సాపూర్ నియోజక వర్గానికి మెదక్ మరింత దగ్గరవడానికి కారణమైంది.
70 కిలోమీటర్ల మేర వ్యత్యాసం
ప్రస్తుతం రామాయంపేట నుంచి నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రానికి వెళ్లాలంటే చేగుంట, తూప్రాన్, శివంపేట మీదుగా వెళితే 70 కిలోమీటర్ల మేర వ్యత్యాసం ఉండేది. ప్రస్తుతం రామాయంపేట మండలం అక్కన్నపేట, వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ రోడ్డు నిర్మాణంతో, రామా యం పేట నుంచి చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి మీదుగా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ నుంచి నర్సాపూర్‌కు కేవలం 54 కిలోమీటర్ల వ్యత్యాసం వస్తుంది. ఈ రోడ్డు నిర్మాణంతో సుమారు 16 కిలో మీటర్ల మేర దూర భారం తగ్గింది. అక్కన్నపేట నుంచి ఉప్పులింగాపూర్ వరకు ప్రజల సౌకర్యార్థ్దం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి పైపులతో కూడిన 60 పెద్ద కల్వర్టులను నిర్మించింది. ఈ రోడ్డే కాకుండా జిల్లాలోని నిజాంపేట మండలం కల్వకుంట క్రాస్ రోడ్డు నుంచి చేగుంట మండలం పులిమామిడి గ్రామం వరకు 8.2 కిలోమీటర్ల రోడ్డుకు మరో రూ.8 కోట్లు కేటాయించి పనులను పూర్తి చేసింది. ఈ రోడ్డులో కల్వర్టులను కూడా పూర్తి చేసింది.
రోడ్డు పనులను పూర్తి చేశాం..
అక్కన్నపేట-ఉప్పులింగాపూర్ 23కిలోమీటర్ల బీటీ డబుల్ రోడ్లకు ప్రభుత్వం రూ.30కోట్ల నిధులను మంజూరు చేసింది.ప్రస్తుతం 20.4 కిలోమీటర్ల డబుల్ రోడ్డు పనులు పూర్తి చేశాం. ఈ రోడ్డు ముఖ్యంగా మూడు మండలాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోడ్డు వెంట 60 కల్వర్టులను నిర్మించాం. జిల్లాలోని నిజాంపేట మండలం కల్వకుంట నుంచి పులిమామిడి వరకు డబుల్ రోడ్డును రూ.8 కోట్లతో ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి చేశాం.
-విజయ సారధి, ఏఈ రామాయంపేట