విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా తప్పదు..
పదో తేదీలోపు వంద శాతం పూర్తి కావాలి..
వ్యాక్సిన్ వేసుకోకుంటే చర్యలు : విద్యాశాఖ
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 8 : సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బడులు నడుపుకోవాలని విద్యాశాఖ సూచించింది. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బంది వ్యాక్సిన్ వేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల పదో తేదీలోపు వంద శాతం పూర్తికావాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ విద్యాశాఖను ఆదేశించారు. మొదటి, రెండో డోసు, అసలే వేసుకోని వారి వివరాలను అధికారులు సేకరించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ప్రైవేట్ టీచర్లే టీకా వేసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారు.
కొవిడ్-19 కారణంగా మూతబడ్డ పాఠశాలలు 16 నెలల విరామం తర్వాత పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, సిబ్బంది కరోనా నిబంధనలు పాటించాలని విద్యాశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. పాఠశాల ఆవరణ, తరగతి గదులను శానిటైజేషన్ చేయాలని, ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొన్నారు. ఇందులో భాగంగా కలెక్టర్, అదనపు కలెక్టర్‌తోపాటు విద్యాశాఖ అధికారులు నిత్యం పాఠశాలను సందర్శిస్తూ అందరూ టీకాలు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ(శుక్రవారం) లోపు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ విద్యాశాఖకు ఆదేశాలు కూడా జారీ చేశారు. మొదటి, రెండో డోసు టీకాలు వేసుకున్న వారు, అసలుకే వేసుకోని ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలు సిద్ధం చేశారు.
ప్రభుత్వం సై.. ప్రైవేట్ నై..
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 862 ఉన్నాయి. ప్రభుత్వ బడుల్లో 3,183 మంది ఉపాధ్యాయులు ఉండగా.. ఇందులో మొదటి డోసు 1,142 మంది, రెండో డోసు 1,930, అసలే తీసుకోని వారు 239 మంది ఉన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ 434 మంది ఉండగా.. ఇందులో మొదటి డోసు 232, రెండో డోసు 128, వేసుకోనివారు 74 మంది ఉన్నారు. జిల్లాలో 205 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. ఇందులో నాన్ టీచింగ్ స్టాఫ్ 1,044, టీచింగ్ స్టాఫ్ 3,026 మంది ఉన్నారు. నాన్ టీచింగ్‌లో 1,044 మందికి గాను 223 మంది రెండో డోస్, 464 మందికి మొదటి డోస్, 357 మంది టీకా వేసుకోలేదు. టీచింగ్ స్టాఫ్‌లో 3,026 మందికి 740 మంది రెండో డోసు, 1,357 మంది మొదటి డోసు, 929 మంది వేసుకోలేదు. ప్రభుత్వ పాఠశాలతో పోల్చితే ప్రైవేట్ బడుల్లోనే టీకా వేసుకోవడంతో వెనకడుగు వేస్తున్నారు.
టీకా తీసుకోకుంటే చర్యలు
ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈనెల 10 తేదీలోపు అందరూ కచ్చితంగా టీకా తీసుకోవాలి. లేకుంటే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం.