యాదగిరిగుట్ట డిపో నుంచి105 అదనపు సర్వీసులు
రేపటి నుంచి ఈ నెల 18 వరకు..
రద్దీకి అనుగుణంగా పెంపు
యాదాద్రి, అకోబర్ 6 : దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు. ఆ మేరకు యాదగిరిగుట్ట డిపో నుంచి 105 స్పెషల్ బస్సులను నడిపించనున్నట్లు మేనేజర్ లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 18 వరకు అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెంది ఎంతో మంది హైదరాబాద్‌తోపాటు, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, గోవా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్నారు. గతేడాది కరోనా కారణంగా చాలా మంది పండుగకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది కరోనా తగుముఖం పట్టడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వేడుకల్లో పాల్పంచుకోవడానికి స్వస్థలాలకు చేరుతున్నారు. ఈ నెల 14వరకు ప్రత్యేక బస్సులు నడిపించేందుకు యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కవగా ఉండే రూట్లపై దృష్టి పెట్టారు. అలాగే పండుగ ముగిసిన తరువాత ఈ నెల 17, 18 తేదీల్లో తిరుగు ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి భువనగిరి మీదుగా తిరుమలగిరి, మోత్కూరు, నల్లగొండ, సూర్యాపేట రూట్లలో రద్దీ ఎక్కువ ఉంటుందని తెలిపారు.
పండుగకు స్పెషల్ బస్సులు
ఈ నెల 8 నుంచి14 వరకు, తిరుగు ప్రయాణంలో 17, 18వ తేదీల్లో ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువస్తాం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తితే 7989225791, 9908992064 ఫోన్ నంబర్లలో సమాచారం అందించాలి.