ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు
ఉత్సాహంగా ఆడిపాడిన ఆడపడుచులు
నమస్తే తెలంగాణ నెట్వర్క్;ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం పల్లెపల్లెనా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పూజ చేసుకుని ప్రధాన కూడళ్ల వద్ద ఆడిపాడారు. పలు పాఠశాలల్లోనూ బతుకమ్మ వేడుకలు జరిగాయి. చిన్నారులు పటాకులు కాల్చుతూ ఆనందంగా గడిపారు. అనంతరం సమీపాల్లోని చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి, వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. –
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి చిహ్నమైన బతుకమ్మ పండుగ భాద్రపద బహుళ అమావాస్యనాడు ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా బుధవారం ఎంగిలిపూవు బతుకమ్మతో వేడుకలు మొదలయ్యాయి. ఈ సంబురాలు తొమ్మిది రోజులపాటు తొమ్మిది పేర్లతో అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ వంటి పాటలతో ఆడపడుచులు సందడి చేయనున్నారు. అయితే ఉత్సవాల్లో తొలి రోజు ప్రారంభమయ్యే ఎంగిలిపూల బతుకమ్మకు ఆ పేరు రావడానికి చరిత్రపరంగా పలు కారణాలున్నాయి.
ఎంగిలిపూల బతుకమ్మగా పేరు రావడానికి కారణాలివే..
బతుకమ్మను పేర్చేటపుడు అందుకు వాడే పూల కాడలను నోటితో కొరకడం.. చేతితో సమానంగా తుంచి వేయడం, కత్తెరతో కత్తిరించడం వంటివి చేసేవారు. ఇలా చేయడం వల్ల ఆ పూలు ఎంగిలిపడ్డట్టుగా భావిస్తారు. పూర్వ కాలంలో మహిళలు బతుకమ్మను పేర్చేందుకు వినియోగించే పూల కాడలను నోటితోనే తుంచినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే పెత్రమాసనాడు ఆడే బతుకమ్మ ఉత్సవాలకు ఎంగిలిపూవు బతుకమ్మగా నామకరణం వచ్చినట్లు భావిస్తున్నారు.
తొలి రోజు బతుకమ్మను పేర్చేందుకు ముందు రోజే పూలను తీసుకుని రావటం.. ఆ పూలతో బతుకమ్మను పేర్చటం వల్ల కూడా ఈ ఉత్సవానికి ఎంగిలి పూవు బతుకమ్మగా పేరొచ్చిందట.
కొన్ని ప్రాంతాల్లో భోజనం చేసిన తరువాతనే బతుకమ్మను పేరుస్తుండటం వల్ల కూడా ఈ తొలి రోజు బతుకమ్మ ఉత్సవానికి ఎంగిలి పూవు బతుకమ్మగా గుర్తింపు వచ్చిందని పూర్వీకులు చెబుతున్నారు.
బతుకమ్మ చరిత్ర
చోళరాజు అయిన ధర్మాంగధుడికి నూరుగురు పుత్రులు. వారంతా యుద్ధంలో మరణిస్తారు. చాలాకాలం తరువాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఒక ఆడపిల్ల పుడుతుంది. లేకలేక పుట్టిన ఆడపిల్లకు ఆ దంపతులు ‘బతుకమ్మ’ అనే నామకరణం చేసి నిండు నూరేండ్లు బతకాలని అంతా ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయే ‘బతుకమ్మ‘గా తరతరాలుగా పూజలందుకుంటున్నదని చరిత్ర చెబుతున్నది.