వరి సాగు తగ్గించాలని అధికారుల సూచన
ఇతర పంటలపై రైతులకు అవగాహన
కల్పించే దిశగా అడుగులు
వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం
70,554 ఎకరాల్లో వరి సాగు
యాసంగిలో 15,477 ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యేలా చర్యలు
పప్పుదినుసులు, కూరగాయల సాగు పెంచేందుకుసన్నద్ధం
పరిగి, అక్టోబర్6: కేంద్ర ప్రభుత్వం దొడ్డు రకం బియ్యాన్ని కొనమని చెప్పిన నేపథ్యంలో రాష్ట్రం లో యాసంగి సీజన్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. వికారాబాద్ జిల్లాలోనూ వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి ఇతర ఆరుతడి పంటలు, కూరగాయలను సాగు చేయాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచించడంతోపాటు.. సదస్సులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో గత యాసంగిలో లక్షా20వేల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలను సాగు చేశారు. అందులో 70,554 ఎకరాల్లో వరిని, శనగలు 20వేల ఎకరాల్లో, జొన్నలు 10వేల ఎకరాల్లో సాగు చేశారు. కేంద్రం సూచనల మేరకు ఈసారి యాసంగిలో వరి సాగును కనీసం 15వేల ఎకరాలకు పైగా తగ్గించి ప్రత్యామ్నాయ పంటల సాగును పెం చేలా వ్యవసాయాధికారులు రైతులను సన్నద్ధం చేస్తున్నారు. ఇతర పంటలతోపాటు కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా వరి సాగును తగ్గించాలన్నది అధికారుల ఆలోచన. జిల్లాలో 1,179 చెరువులు, ఒక మధ్య తరహా ప్రాజెక్టు ఉండగా వాటి కింద 88,497 ఎకరాల ఆయకట్టు ఉన్నది. జిల్లాలోని చెరువులు నీటితో నిండి అలుగులుపోశాయి. జిల్లాలో సుమారు 55 వేల పైచిలుకు వ్యవసాయ బోర్లు ఉన్నాయి. చెరువుల కింద నీరు పారుతుండటంతో వరికి ప్రత్యామ్నా యంగా ఇతర పంటలు వేయడం ఇబ్బందికరం. బోర్ల కింద వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా పప్పుదినుసులు, ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఆరుతడి పంటలతోపాటు..
ఈ యాసంగి సీజన్లో ప్రత్యామ్నాయ పంటలను 15,477 ఎకరాల్లో రైతులు సాగు చేసేలా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇందులో వేరుశనగ 3,056 ఎకరాలు, పొద్దు తిరుగుడు 25 ఎకరాలు, శనగ 1,912 ఎకరాలు, నువ్వులు 1,053 ఎకరాలు, మినుములు 193 ఎకరాలు, పెసర 825 ఎకరాలు, జొన్న 2,912 ఎకరాలు, కూరగాయలు 2,595 ఎకరాలు, ఇతర పంటలు 2,905 ఎకరాల్లో సాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పం టలుగా ఆరుతడి పంటలతోపాటు కూరగాయలు, పండ్లతోటల సాగు పెంచాలని నిర్ణయించారు. వికారాబాద్ జిల్లా హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో కూరగాయల సాగు విస్తీ ర్ణం పెంచడం ద్వారా వారికి మార్కెటింగ్ సౌకర్యం కూడా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అదనంగా 10 వేల ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. జిల్లాలో 1,800 ఎకరా ల్లో పండ్లతోటలు ఉండగా అదనంగా 3 వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
గ్రామాలవారీగా ..
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సా గు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నా రు. జిల్లా పరిధిలో 97 క్లస్టర్లు ఉన్నాయి. ఆయా క్లస్టర్ పరిధుల్లోని గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేరుశనగ, పెసర, జొన్న, శనగ, నువ్వు లు, కూరగాయలు ఎంత మేరకు సాగు చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన
యాసంగిలో వికారాబాద్ జిల్లా పరిధిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేశాం. యాసంగిలో 70వేల ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశాలుండగా, సుమారు 15వేలకు పైగా ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించడం జరిగింది. గ్రామాలవారీగా ఏ ప్రత్యామ్నాయ పంటను సాగు చేయాలన్నది సూచించడంతోపాటు అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు సైతం అందుబాటులో ఉంచుతున్నాం
-గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి, వికారాబాద్ జిల్లా
ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు
ఉత్సాహంగా ఆడిపాడిన ఆడపడుచులు
నమస్తే తెలంగాణ నెట్వర్క్;ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం పల్లెపల్లెనా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పూజ చేసుకుని ప్రధాన కూడళ్ల వద్ద ఆడిపాడారు. పలు పాఠశాలల్లోనూ బతుకమ్మ వేడుకలు జరిగాయి. చిన్నారులు పటాకులు కాల్చుతూ ఆనందంగా గడిపారు. అనంతరం సమీపాల్లోని చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి, వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. –
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి చిహ్నమైన బతుకమ్మ పండుగ భాద్రపద బహుళ అమావాస్యనాడు ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా బుధవారం ఎంగిలిపూవు బతుకమ్మతో వేడుకలు మొదలయ్యాయి. ఈ సంబురాలు తొమ్మిది రోజులపాటు తొమ్మిది పేర్లతో అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ వంటి పాటలతో ఆడపడుచులు సందడి చేయనున్నారు. అయితే ఉత్సవాల్లో తొలి రోజు ప్రారంభమయ్యే ఎంగిలిపూల బతుకమ్మకు ఆ పేరు రావడానికి చరిత్రపరంగా పలు కారణాలున్నాయి.
ఎంగిలిపూల బతుకమ్మగా పేరు రావడానికి కారణాలివే..
బతుకమ్మను పేర్చేటపుడు అందుకు వాడే పూల కాడలను నోటితో కొరకడం.. చేతితో సమానంగా తుంచి వేయడం, కత్తెరతో కత్తిరించడం వంటివి చేసేవారు. ఇలా చేయడం వల్ల ఆ పూలు ఎంగిలిపడ్డట్టుగా భావిస్తారు. పూర్వ కాలంలో మహిళలు బతుకమ్మను పేర్చేందుకు వినియోగించే పూల కాడలను నోటితోనే తుంచినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే పెత్రమాసనాడు ఆడే బతుకమ్మ ఉత్సవాలకు ఎంగిలిపూవు బతుకమ్మగా నామకరణం వచ్చినట్లు భావిస్తున్నారు.
తొలి రోజు బతుకమ్మను పేర్చేందుకు ముందు రోజే పూలను తీసుకుని రావటం.. ఆ పూలతో బతుకమ్మను పేర్చటం వల్ల కూడా ఈ ఉత్సవానికి ఎంగిలి పూవు బతుకమ్మగా పేరొచ్చిందట.
కొన్ని ప్రాంతాల్లో భోజనం చేసిన తరువాతనే బతుకమ్మను పేరుస్తుండటం వల్ల కూడా ఈ తొలి రోజు బతుకమ్మ ఉత్సవానికి ఎంగిలి పూవు బతుకమ్మగా గుర్తింపు వచ్చిందని పూర్వీకులు చెబుతున్నారు.
బతుకమ్మ చరిత్ర
చోళరాజు అయిన ధర్మాంగధుడికి నూరుగురు పుత్రులు. వారంతా యుద్ధంలో మరణిస్తారు. చాలాకాలం తరువాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఒక ఆడపిల్ల పుడుతుంది. లేకలేక పుట్టిన ఆడపిల్లకు ఆ దంపతులు ‘బతుకమ్మ’ అనే నామకరణం చేసి నిండు నూరేండ్లు బతకాలని అంతా ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయే ‘బతుకమ్మ‘గా తరతరాలుగా పూజలందుకుంటున్నదని చరిత్ర చెబుతున్నది.