
రూపుమారుతున్న ప్రభుత్వ బడులు
సకల వసతులతో పిల్లలకు చదువులు
పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
కొమురవెల్లి, అక్టోబర్ 6 : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల అభివృద్ధికి పూర్వవిద్యార్థులతో పాటు గ్రామంలోని దాతలు చేయూతనిచ్చారు. ప్రాథమిక పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ మంకాల సతీశ్ ప్రత్యేక కృషి చేశారు. పాఠశాలల్లో సకల వసతులు సమకూరడంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. దీంతో విద్యార్థుల చదువులు విజయవంతంగా కొనసాగుతున్నాయి.
ఒక్క ఆలోచనతో మొదలై…
విద్యార్థులకు సకల వసతులతో కూడిన విద్యను అందిస్తే వారి భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రభు త్వ పాఠశాలలను సంరక్షించుకోవాలనే ఆలోచనతో ‘మన ఊరు మన బడి’ నినాదాన్ని మొదలుపెట్టారు ప్రాథమిక పాఠశాల చైర్మన్ మంకాల సతీశ్. మిత్రులతో పాటు గ్రామంలోని అన్ని కుల సంఘాల పెద్దలను కలిసి తన ఆలోచన వారికి చెప్పాడు. వారి సలహాలు, సూచనలు తీసుకొని ప్రణాళిక ప్రకారం గ్రామంలోని పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించారు. కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా సకల వసతులు కల్పించారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన విద్యార్థుల సంఖ్య…
ఇప్పటివరకు దాతలు అందజేసిన రూ.లక్షా50 వేలతో పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు. పెయింటింగ్, ప్యూరిఫైయర్, ప్రతి తరగతి గదికి ఎల్ఈడీ టీవీ ఏర్పాటు చేశారు. తరగతి గది కిటికీలకు దోమ తెరలు ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పా టు కావడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రాథమిక పాఠశాలలో గతంలో 120 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం 180కి చేరింది. హైస్కూల్లో గతంలో 200 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం 250 మందికి పెరిగింది.
అందరి సహకారంతోనే…
పూర్వ విద్యార్థులు, దాతలు, గ్రామస్తులు, ఉపాధ్యాయుల సహకారంతోనే పాఠశాలలో అన్ని వసతులు కల్పించాం. అందరి సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తాం.పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టిపెడుతాం. ప్రభుత్వ బడులకు పూర్వవైభవం తీసుకురావాలనే ఆలోచన చెప్పగానే సహకరించిన స్నేహితులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-మంకాల సతీశ్, ప్రాథమిక పాఠశాల చైర్మన్, కొమురవెల్లి