రోడ్డెక్కిన విద్యాసంస్థల వాహనాలు
రవాణా సౌకర్యాలపై తల్లిదండ్రుల్లో అనుమానాలు
ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరంటున్న అధికారులు
అనుభవం ఉన్న డ్రైవర్లకే డ్రైవింగ్ తప్పనిసరి
రోడ్డుపై భద్రతే.. జీవిత భద్రత : జిల్లా రవాణా శాఖాధికారి
మంచిర్యాల, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మూసిన పాఠశాలల తలుపులు 16 నెలల విరామం తర్వాత తెరుచుకున్నాయి. దీంతో ఆయా విద్యాసంస్థల బస్సులు రోడ్డెక్కాయి. ఇంతవరకు బాగానే ఉన్నా, ఇన్ని రోజులు ఓ మూలకే పరిమితమైన బస్సుల ఫిట్నెస్లతోపాటు అనుభవజ్ఞులైన డ్రైవర్లేనా.. అని తల్లిదండ్రుల్లో సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. కచ్చితంగా ఈనెలాఖరుకల్లా పూర్తి చేసుకోవడంతో పాటు రోడ్డు భద్రతా నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన తప్పనిసరని సూచించారు.
జిల్లాలో 208 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపు 52 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. 25 జూనియర్, 22 డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. జూనియర్లో 12 వేలు, డిగ్రీ కాలేజీలో 6 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో దాదాపు 443 పాఠశాల, కళాశాలల బస్సులు ఉన్నాయి. వీటితో పాటు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు కూడా విద్యార్థులను పాఠశాలలకు, ఇంటికి చేరవేస్తుంటాయి. ఈ నేపథ్యంలో పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని బస్సుల ఫిట్‌నెస్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ప్రతి విద్యాసంస్థ కృషి చేయా లి. ఆయా యాజమాన్యాలు, రహదారి భద్రతపై, ప్రత్యేకించి త మ వాహనాల భద్రతపై అవగాహన కలిగి ఉండాలి.ముందుగా ఆయా వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. ఇందుకు గడువు ఈ నెలాఖరు వరకు ఉంది. ఇందుకోసం ముందుగా విద్యాసంస్థలు తమ వాహనాలకు మరమ్మతులు చేయించుకొని సర్టిఫికెట్ పొందాలి. ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందకుండా వాహనాలు నడుపుతున్న విద్యాసంస్థల గుర్తింపు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రద్దు చేస్తారు. బస్సుల్లో భద్రతా చర్యలు, కొవిడ్ నిబంధనల జాగ్రత్తలపై దృష్టిసారించాల్సి ఉంది.
వాహనాలపై అవగాహన అవసరం..
పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్నెస్, జాగ్రత్తలపై పిల్లల తల్లిదండ్రులకు, పేరెంట్స్ కమిటీకి కూడా అవగాహన అవసర మని జిల్లా రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు
పాఠశాల/ కళాశాల పేరు, ఫోన్ నంబర్ సహా పూర్తి చిరు నామా బస్సు ఎడమవైపున, వెనుకభాగంలో స్పష్టంగా కనిపించేలా రాయించాలి. విద్యాసంస్థ బస్సు డ్రైవర్‌గా నియమితుడైన వ్యక్తి వయస్సు 60 ఏండ్లు దాటరాదు.
పాఠశాల/కళాశాల యాజమాన్యం, తమ ప్రతి బస్సు డైవర్ ఆరోగ్య పట్టిక (హెల్త్ కార్డు)ను నిర్వహించాలి. రక్తపోటు (బీపీ), షుగర్, కంటి చూపు వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను, ప్రతి మూడు నెలలకోసారి తమ సొంత ఖర్చుపై యాజమాన్యమే చేయించాలి. సదరు రికార్డులను జాగ్రత్త పరచాలి. బస్సు డ్రైవర్‌ను నియమించే ముందు విద్యాసంస్థ యాజమాన్యం సదరు డ్రైవర్ లైసెన్సు, మొదలైన పేర్లలో నిజానిజాలను తెలుసుకోవాలి. ఇందుకు సంబంధిత ఆర్టీఏ ఆఫీసును సంప్రదించాలి.
అదే క్యాటగిరీ వాహనాన్ని (బస్సును) కనీసం ఐదేళ్లు నడిపిన అనుభవం గల డ్రైవర్లను మాత్రమే విద్యాసంస్థ యాజమాన్యం నియమించాలి. ఫిర్యాదుల (కంప్లయింట్) బుక్‌ను ప్రతి వాహనంలో అందుబా టులో ఉంచాలి. అందులో నమోదు చేసిన ఫిర్యాదులు పరిశీలించాలి. వాటి పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు అనుగుణంగా ప్రతి నెలకోసారి ప్రిన్సిపాల్ ఆ బుక్‌ను తనిఖీ చేయాలి. ప్రతి వాహనం(బస్సు)లో ఒక అత్యవసర ద్వారం ఉండాలి. దానిపై స్పష్టంగా కనిపించేలా ‘అత్యవసర ద్వారం’ అని రాయించాలి. ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, పరికరాలతో కూడిన పెట్టెను అందుబాటులో ఉంచాలి. వారానికి ఒకసారి ప్రిన్సిపాల్ లేదా సంబంధిత అధికారి, ఈ ‘ఫస్ట్ ఎయిడ్ బాక్స్’ను తనిఖీ చేయాలి. నెలకొకసారి పేరెంట్స్ కమిటీ తనిఖీ చేయాలి. దీని కోసం ఒక ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించాలి. యాజమాన్యం బస్సుల పార్కింగ్ కోసం పాఠశాల/కళాశాల ఆవరణలోనే స్థలం కేటాయించాలి. విద్యార్థుల రక్షణ కోసం వారు పాఠశాల/కళాశాల ఆవరణలోనే బస్సు నుంచి దిగడం కానీ, ఎక్కడం కానీ చేసేటట్లు ప్రేరేపించాలి. ప్రతి విద్యా సంస్థ బస్సు కనీసం ఒక అటెండర్‌ను కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సు అటెండర్‌ను వాహనం నడపడానికి అనుమతించ కూడదు. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల పట్టిక సదరు బస్సులో తప్పకుండా ఉండాలి. విద్యార్థుల పేర్లు, తరగతులు, ఇంటి చిరునామాలు, వారు దిగాల్సిన స్థలం వివరాలు ఆ లిస్టులో ఉండాలి. విద్యార్థి పేరుకు అతను/ ఆమె దిగవలసిన/ఎక్కవలసిన స్థలం పేరు సూచించాలి. బస్సు బయలుదేరు స్థలం, మధ్యలో ఆగే స్థలాలు, బస్సు రూట్‌ను తెలుపుతూ ప్రిన్సిపాల్‌తో జతపరిచిన రూట్ ప్లాన్ కూడా సదరు లిస్టులో ఉండాలి. l బస్సు డ్రైవర్, విద్యార్థు లు ఎక్కడం, దిగడం సరిగ్గా స్పష్టంగా గమనించేందుకు కుంభాకార అద్దాలు అమర్చాలి. బస్సులో ఒక పెద్ద పారదర్శక కుంభాకార అద్దం (మిర్రర్) కూడా అమర్చాలి. దీంతో డ్రైవర్‌కు బస్సు లోపలి భాగం స్పష్టంగా కనబడుతుంది. బస్సు ఇంజిన్ కంపార్ట్మెంట్లో ఒక అగ్నిమాపకయంత్రం, పొడి అందుబాటులో ఉంచాలి. బస్సులో సీట్ల కింద బ్యాగులు ఉంచుకునేందుకు అరల ఏర్పాటు ఉండాలి. బస్సులో తగినంత దూరంలో అక్కడక్కడ నిలువు స్తంభాలు, కప్పులను, బస్సు నేలభా గాన్ని కలుపుతూ ఏర్పాటు చేయాలి. ఈ స్తంభాలు కాని, బస్సు నేల భాగం కాని జారకుండా ఉండే మెటీరియల్ (లోహం)తో ఉండాలి.
వాహనానికి నాలుగువైపులా పైభాగం మూలల్లో (రూఫ్‌పై కాదు) బయటి వైపు గాఢ పసుపు పచ్చని రంగు గల ఫ్లాషింగ్ లైట్లు అమర్చాలి. బస్సులో నుంచి విద్యార్థులు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు ఈ లైట్లను వెలిగించాల్సి ఉంటుంది. సదరు బస్సు పాఠశాల/ కళాశాల కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపేందుకు వీలుగా ముందుకు భాగంలో పైన సుమారు 400ఎంఎం/ 400 ఎంఎం సైజు బోర్డు, సరిగా అమర్చాలి. ఆ బోర్డు మీద 250 ఎంఎంలకు తగ్గని ఎత్తులో ఇద్దరు పాఠశాల విద్యార్థుల (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) చిత్రం నల్ల రంగులో వేయాలి ఆ చిత్రం కింద స్కూల్ బస్ లేదా కళాశాల బస్సు అని నల్ల రంగులో కనీసం 100 ఎంఎం సైజు అక్షరాల్లో రాయించాలి. అక్షరాల గాఢత సైజు కనీసం 11 ఎంఎం ఉండాలి. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జారీ చేసిన విద్యాసంస్థ బస్సు పర్మిట్ దానిపై రాసిన బస్ జీవితకాలం (వ్యవధి), తేదీ ముగిసిన నాటి నుంచే సమాప్తమైనట్లు భావించాలి. l ప్రతి విద్యాసంస్థ డ్రైవర్ సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్/మే నెలలో జేటీసీ/డీటీసీ/ఆర్టీవో ద్వారా నిర్వహించే ఒక్కరోజు రిఫ్రెషర్స్ ట్రైనింగ్ కోర్సులో పాల్గొనాల్సి ఉంటుంది. సదరు తేదీన సంబంధిత అధికారులతో డ్రైవర్‌కు జారీ చేసిన సర్టిఫికెట్ ఏడాది వరకు చెల్లుబాటులో ఉంటుంది.
సైడ్ కిటికీలకు మధ్యలో 31కు మించని దూరంలో అడ్డంగా మూడు లోహపు కడ్డీలు అమర్చాలి.
ఏ విద్యాసంస్థ బస్సు కూడా పరిమిత సీటింగ్ కెపాసిటీ (సామర్థ్యం) కన్నా ఎక్కువ మంది విద్యార్థులను తీసుకెళ్లరాదు.
బస్సు ఫుట్ బోర్డుపై మొదటి మెట్టు భూమి నుంచి 325 ఎంఎం ఎత్తును మించవద్దు. అన్ని మెట్లు కూడా జారకుండా ఉండే లోహంతో అమర్చి ఉండాలి.
విద్యార్థులు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు బస్సు అటెండర్ బస్సు బయట దగ్గరగా నిలబడి, విద్యార్థులు బస్సు నుంచి సురక్షితంగా దిగేలా, ఎక్కేలా చూడాలి.
పది, ఆపై తరగతుల విద్యార్థుల బస్సుల విషయంలో వర్తించేవి..
డ్రైవర్ నియామకంపై పేరెంట్స్ కమిటీకి తప్పకుండా తెలపాలి. l బస్సుకు సంబంధించిన బయటి పరికరాలు, విండ్ స్క్రీన్, వైఫర్స్, లైటింగ్స్, మొదలైన వాటి మెకానికల్ కండీషన్, పనితీరును తెలుసుకునేందుకు నెలకోసారి ప్రిన్సిపాల్, పేరెంట్స్ కమిటీ బస్సును తనిఖీ చేయాలి. ఆ సమాచారాన్ని దాని కోసమే నిర్వహించే ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలి. l ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పేర్కొన్న విధంగా విద్యాసంస్థ బస్సు డ్రైవర్, అటెండర్ వారికిచ్చిన యూనిఫామ్‌ను విధిగా ధరించాలి.
విద్యాసంస్థ బస్సుల తలుపులు సురక్షిత లాకింగ్ సిస్టమ్‌తో అమర్చి ఉండాలి. l ప్రతి విద్యా సంస్థ తాను కలిగి ఉన్న ప్రతి 10 బస్సులకు అదనంగా (స్పేర్) కనీసం ఒక బస్సును అదనంగా కలిగి ఉండాలి.
రవాణా, పోలీస్, విద్యాశాఖ సౌజన్యంతో విద్యార్థులకు ఏడాదికి ఒక రోజు రహదారి భద్రతపై తరగతులు నిర్వహించాలి.
బస్సులో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకునేందుకు వీలుగా బస్సు ముందరి మెట్లకు సమాంతరంగా రైలింగ్ ఏర్పాటు చేయాలి.
యాజమాన్యం, పేరెంట్స్ కమిటీ సమన్వయంతో బస్సు బయలుదేరు స్థలం నుంచి గమ్య స్థానం వరకు ప్రతి రోజూ వంతుల వారీగా ఒక టీచర్, ఒక పేరెంట్ బస్సులో ప్రయాణించేలా చూడాలి. వారు బస్సు ముందరి భాగంలో కూర్చొని విద్యార్థుల సంరక్షణ చూడాలి.
నిబంధనలు పాటించాలి..
సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష బోధన పునఃప్రారంభ మైంది. విద్యార్థుల రవాణా కోసం బస్సులు బయలు దేరనున్నాయి. పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ను పరీక్షించుకోవాలి. ఈ నెల 30 వరకు గడువు ఉంది. బస్సులను రోజూ తప్పకుండా శానిటైజ్ చేయాలి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బస్సులు నడపాలి. నిబంధనలు పాటించని వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
-ఎల్.కిష్టయ్య, జిల్లా రవాణా శాఖాధికారి, మంచిర్యాల