
గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న అధికారులు
లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
కూసుమంచి/ పాల్వంచ రూరల్/ భద్రాచలం, సెప్టెంబర్ 6: ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. అధికారులు వాటి గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పాలేరు పూర్తి స్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి పూర్తిగా నిండింది. ఆటోమేటిక్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. పాలేరుకు 9,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. పాలేరు రిజర్వాయర్ నీటిమట్టాన్ని, వరద ఉధృతిని, ఆటోమేటిక్ గేట్ల పటిష్టతను ఈఈ సమ్మిరెడ్డి సోమవారం పరిశీలించారు.
కిన్నెరసాని నుంచి 26 వేల క్యూసెక్కులు
కిన్నెరసాని ప్రాజెక్టుకు చెందిన 5 గేట్ల ద్వారా 26 వేల క్యూసెక్కుల నీటిని సోమవారం విడుదల చేశారు. ఇన్ఫ్లో 25 క్యూసెక్కులు ఉండడంతో డ్యామ్సైట్ అధికారుల వెంటనే 5 గేట్లను ఎత్తి 26 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. ఎగువ ప్రాంతాల్లో వరద పరిస్థితిని సమీక్షించి సాయంత్రం రెండు గేట్లను మూసివేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. సోమవారం సాయంత్రం 404.9 అడుగులుగా ఉంది.
పెరుగుతున్న గోదావరి
ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా పెరుగుతోంది. సోమవారం ఉదయం 10 గంటలకు 22.9 అడుగులు ఉన్న గోదావరి సాయంత్రం 6 గంటలకు 26.7 అడుగులకు చేరుకుంది. రాత్రికి మరో రెండు అడుగులు పెరిగే అవకాశం ఉందని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇళ్లల్లోకి వరద నీరు
ఉమ్మడి జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. వాగులు ఉధృతంగా ప్రవహించిన చోట్ల అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రజలు అటువైపుగా ప్రయాణించకుండా చర్యలు తీసుకున్నారు.