ఉచితంగా రోగ నిర్ధారణ టెస్ట్‌లు
ఫలితాలిస్తున్న తెలంగాణ డయాగ్నొస్టిక్స్ సెంటర్
ఏరియా దవాఖానలో ఏర్పాటు
మెసేజ్ రూపంలో రిపోర్టు
సేవలను వినియోగించుకున్న 26,472 మంది
ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు
మహబూబాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ) :పైసా ఖర్చు లేకుండా రోగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రైవేట్ ల్యాబ్‌కు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసే రోజులకు కాలం చెల్లిందంటూ ప్రజలు సంబుర పడుతున్నారు. పేదల పాలిట ఈ కేంద్రాలు వర ప్రదాయినిగా నిలుస్తున్నాయని కొనియాడుతున్నారు. ఇదే సంవత్సరంలో మే 17న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో ల్యాబ్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇందులో 26,472 మంది సేవలను వినియోగించుకున్నారు. పనికి రాని టెస్టులు చేస్తూ వేలకు వేలు వసూలు చేసే ప్రైవేట్ ల్యాబ్లకంటే.. పైసా ఖర్చు లేకుండా అన్ని టెస్టులు చేసేలా ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని కొనియాడుతున్నారు.
పైసా ఖర్చు లేకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జిల్లా కేంద్రంలో తెలంగా ణ డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దీంతో ఎంతో మంది పేదలకు ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు చేయాల్సిన బాధ తప్పిం ది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యం, విద్యకు ప్రభుత్వం అధికంగా నిధులు వెచ్చిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇదే సంవత్సరం మే 17న వీటి సేవలు జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 25 పీహెచ్‌సీల నుం చి నమూనాలు సేకరించి జిల్లా కేంద్రానికి తీసుకొస్తారు.
ఐదు రూట్లుగా జిల్లా
రూట్-1: పరిధిలో మహబూబాబాద్, తొర్రూరు, నెల్లికుదురు, ఇనుగుర్తి, కేసముద్రం.
రూట్-2 : మరిపెడ, దంతాలపల్లి, ఉగ్గంపల్లి, కురవి,
రూట్-3 : బయ్యారం, గంధంపల్లి, ముల్కనూరు, గార్ల, డోర్నకల్, బలపాల,
రూట్-4 : కోమటిగూడెం, గంగారం, కొత్తగూడ, గూడూరు (సీహెచ్‌సీ),
రూట్-5 : గూడూరు సీహెచ్‌సీ, అయోధ్యపురం, తీగలవేణి, కంబాలపల్లి, మల్యాల పీహెచ్సీ
ఐదు రూట్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన రక్త, మూత్ర నమూనాలను జిల్లా కేంద్రంలో ఉన్న తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు తీసుకెళ్తారు. ఇందులో మొత్తం 57 రకాల నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు.
ఇప్పటి వరకు 26,472 మందికి లబ్ధి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ ద్వారా మే 17 నుంచి ఇప్పటి వరకు 26,472 మందికి 1,60,851 నిర్ధారణ పరీక్షలు చేశారు. రూట్‌కు ఒక వాహనం చొప్పున కేటాయించారు. ప్రతి రోజూ ఆ రూట్‌కు వెళ్లి రోగులను నుంచి పీహెచ్‌సీల్లో సేకరించిన నమూనాలను తీసుకొస్తారు.
ఒక్క రోజులో రిపోర్టు
వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన నమూనాలు పరీక్షించి 24 గంటల్లో రిపోర్టు ఇస్తారు. రిపోర్ట్‌ను సంబంధిత రోగుల సెల్ నంబర్‌కు మెసేజ్ రూపంలో పంపిస్తారు. హార్డ్ కాపిలను మాత్రం ఏ పీహెచ్సీలో రక్తనమూనాలు ఇచ్చారో అక్కడికి వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. రిపోర్టు తీసుకున్న రోగులు స్థానిక డాక్టర్ కు చూపించి అదే దవాఖానలో మందులు తీసుకుంటున్నారు.
24 గంటల్లో రిపోర్టు ఇస్తున్నం
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 26,472 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహిం చాం. డయాగ్నొస్టిక్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్ప టి వరకు మొత్తం 1,60, 851 రకాలటెస్టులు చేశాం. పీహెచ్‌సీల నుంచి సేకరించిన నమూనాలకు 24 గంటల్లో రిపోర్టు ఇస్తు న్నాం. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
-బయ్య అనురాధ,తెలంగాణ డయాగ్నొస్టిక్ ఇన్చార్జి