
కూసుమంచి, జూలై 4: కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. 2021 సంవత్సరానికి గాను పరిశుభ్రత, నాణ్యమైన సేవలకు గుర్తింపుగా అందించే అవార్డుకు ఎంపికలో భాగంగా కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అత్యధిక మార్కులు వచ్చాయి. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారుల తనిఖీల అనంతం అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు కింద రూ.2 లక్షల నగదును ఆసుపత్రికి అందజేస్తారు. ఆసుపత్రి పరిసరాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, ఆశావర్కర్ల సమావేశాలు, గ్రామాల్లో వైద్య సేవలు వంటి వాటిని నిర్వహించడంలో కూసుమంచి పీహెచ్సీ ముందు ఉంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు చికిత్స, 104 వాహనాల సర్వీసు గ్రామాల్లో వైద్య క్యాంపుల నిర్వహణ వంటి అంశాల్లోనూ ఈ పీహెచ్సీ సిబ్బంది విశేషమైన సేవలను అందించారు. వచ్చిన రోగులు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. తాగునీటి వసతి కల్పించారు. సమయ పాలన వంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్యులు శ్రీనివాస్, ఇవాంజలి, ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల పనితీరును కూడా ప్రామాణికంగా తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
ఎమ్మెల్యే కందాళ శుభాకాంక్షలు
కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాయకల్ప అవార్డుకు ఎంపిక కావటం పట్ల పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ఆసుపత్రి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ బాణోత్ శ్రీనివాస్, జడ్పీటీసీ ఇంటూరి బేబీలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
అవార్డుకు సార్థకత చేకూరుస్తాం..
కాలయల్ప అవార్డుకు కూసుమంచి పీహెచ్సీ ఎంపిక కావటం చాలా సంతోషంగా ఉంది. ఈగ గుర్తింపును కాపాడుకోవడం కోసం మరింతగా సేవ చేస్తాం. ప్రజాప్రతినిధులు, సిబ్బంది సహకారం పూర్తిగా ఉండడంతోనే ఇది సాధ్యమైంది. మా సేవలు మరింతగా మెరుగు పడేలా సమష్టి కృషితో ముందుకెళ్తాం. అవార్డుకు సార్థకత చేకూరుస్తాం. కూసుమంచి పీహెచ్‌సీని మోడల్‌గా తీర్చిదిద్దుతాం.
–డాక్టర్ శ్రీనివాస్, పీహెచ్సీ వైద్యుడు