ఓటర్ల నమోదు, జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల
జిల్లాలో మొదలైన కసరత్తు
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు ఓటు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్అవకాశం కల్పించింది. అదే సమయంలో ఓటరు జాబితా సవరణకూ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ మేరకు జిల్లాలో ఓటరు జాబితా ప్రక్షాళన ప్రారంభమైంది. సంబంధిత అధికారులు ముసాయిదా జాబితాను సిద్ధం చేస్తున్నారు. మరణించిన, గ్రామాల నుంచి శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు తొలగిస్తున్నారు. పొరపాట్లను సరిదిద్దనున్నారు. అందుకోసం మండలాల వారీగా బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల బూత్ స్థాయిల్లో ప్రక్షాళన ప్రక్రియ ప్రారంభమైంది. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. జాబితాలో అనర్హులుంటే వారి పేర్లను తొలగిస్తున్నారు. నవంబర్ 1న ముసాయిబా జాబితా వెల్లడించనున్నారు. నెల రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించి, వచ్చే ఏడాది జనవరి 5న తుది జాబితా ప్రకటించనున్నారు.
ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారికి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఓటరు జాబితాను పరిశీలించి వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే బీఎల్ఓ, తాసీల్దార్, ఆర్డీఓకు ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఎన్నికల సంఘం వెబ్సైట్లో నేరుగా తరఖాస్తు చేయవచ్చు.
గరుడ యాప్‌తో..
ప్రతి సంవత్సరం ఓటరు జాబితా సవరణ చేపడుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగడం లేదు. డబుల్ ఓట్లు, మరణించిన వారికీ ఓటుహక్కు, ఉన్న ఓట్లు గల్లంతు, ఒకే కుటుంబానికి చెందిన వారి ఓట్లు వేర్వేరు ప్రాంతాల్లో ఉండడం వంటి పొరపాట్లు ఉంటున్నాయి. వీటి నుంచి ప్రక్షాళనకు ఈసారి ప్రత్యేకంగా ‘గరుడ’ యాప్‌కు రూపొందించారు. ఓటరు కార్డు, ఎపిక్ నంబర్ పోయిన వారు వీటిని తిరిగి పొందేందుకు ఈ యాప్ ద్వారా అవకాశం కల్పించారు. బీఎల్ఓలు ఇంటింటి సర్వే చేపట్టి ఓటరు సవరణ చేపట్టాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రం వివరాలను గరుడ యాప్‌లో నమోదు చేస్తారు. కొత్త యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాలను జియోట్యాగింగ్ చేయడం వల్ల గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొబైల్ ఫోన్లోనే పోలింగ్ కేంద్రాలను తెలుసుకునే వీలుంటుంది. ఈ యాప్‌లో వివరాల నమోదుకు బూత్ స్థాయి అధికారులకు బుక్లెట్లు పంపిణీ చేశారు. మండలాల వారీగా బీఎల్ఓలకు శిక్షణ కూడా ఇస్తున్నారు.