రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, జనవరి 31 :రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించింది. పేద విద్యార్థులకు అందని ద్రాక్షలా మారిన ఆంగ్ల మాధ్యమాన్ని సర్కారు బడుల్లో అమలు చేసి బంగారు భవిష్యత్తును అందించాలని సంకల్పించింది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మౌలిక వసతుల కల్పన పనులను సైతం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో విద్యార్థులు లేక మూతపడిన 38 పాఠశాలలను మళ్లీ ప్రారంభించి, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా జీరో ఎన్రోల్మెంట్ (విద్యార్థులు లేని) పాఠశాలలకూ టీచర్లను కేటాయించింది. జిల్లాలో ఇప్పటికే 546 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలవుతుండగా, జీరో పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ విద్య అందనుండడంతో పేద విద్యార్థులకు వరంగా మారనున్నది.
సీఎం కేసీఆర్ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించారు. అయితే కేవలం కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలోనే ఇంగ్లిష్ మీడియం చదువులు అనే పరిస్థితులకు చెక్ పెడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కూడా ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సర్కారు నిర్ణయించింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు పేద విద్యార్థులకు వరంగా మారనుంది. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో చదువుకోలేని పేద విద్యార్థులను పరిగణనలోకి తీసుకొని సీఎం కేసీఆర్ తీసుకున్న ఇంగ్లిష్ మీడియం అమలు నిర్ణయం జిల్లాలోని సబ్బండ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే జిల్లాలో అమలవుతున్న ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో అడ్మిషన్లకు ప్రతి ఏటా క్యూ కడుతుండడం గమనార్హం.
అదేవిధంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు కూడా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రూ.200 కోట్లతో ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. మరోవైపు మన ఊరు- మన బడిలో భాగంగా జిల్లాలోని శివరాంపల్లి, జిల్లెలగూడ, సరూర్నగర్ ప్రభుత్వ పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టారు.
మూతపడ్డ స్కూళ్లు పునఃప్రారంభం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అమల్లోకి రానుంది. దీంతో విద్యార్థులు లేక మూతపడిన స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల కేటాయింపుల్లో జిల్లాలోని ఈ స్కూళ్లకు కూడా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను నియమించారు. ప్రస్తుతం ఈ స్కూళ్లలో విద్యార్థులు లేని దృష్ట్యా సంబంధిత స్కూళ్లకు పక్కనే ఉన్న స్కూళ్లలో మూతపడ్డ స్కూళ్లకు కేటాయించిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
జిల్లాలో 38 జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలున్నాయి. జిల్లావ్యాప్తంగా 1300 ప్రభుత్వ పాఠశాలలుండగా, ఇప్పటికే తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు పలు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అమలవుతున్నది. జిల్లావ్యాప్తంగా 546 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అమలవుతుండగా, వీటిలో 127 సక్సెస్ పాఠశాలలున్నాయి. గత ఐదారేండ్లుగా జిల్లాలో సక్సెస్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంతోపాటు తెలుగు మీడియం కూడా కొనసాగుతూ వస్తున్నది. మిగతా 419 ప్రభుత్వ స్కూళ్లలోనూ గత రెండేండ్లుగా ఇంగ్లిష్ మీడియం అమల్లోకి వచ్చింది. సక్సెస్ స్కూళ్లు మినహా మిగతా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని అమలు చేసేందుకు సంబంధిత పాఠశాలల పేరెంట్స్ కమిటీ, విద్యార్థులు, ఉపాధ్యాయుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియాన్ని అమలుచేసేందుకు అనుమతులిచ్చింది. ప్రైమరీ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుకు జిల్లా విద్యాశాఖ అధికారి, ఉన్నత పాఠశాలలకు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నుంచి అనుమతులు మంజూరవుతున్నాయి.