
వికారాబాద్, ఆగస్టు 6, (నమస్తే తెలంగాణ): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌సార్ అని కలెక్టర్ పౌసుమిబసు అన్నారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జయశంకర్‌సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పౌసుమిబసు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం నీళ్లు, నిధులు, నియామకాల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు అని కొనియడారు. సార్ ఆశయాలకు అనుగుణంగా కొత్త జిల్లాల్లో అధికారులు, సిబ్బంది, ప్రతిఒక్కరూ బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా విద్యాధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో డీఈవో రేణుకాదేవి పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో..
ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.జానకీరెడ్డి అన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉద్యోగులు ఉష, చెన్నారెడ్డి, నందకుమార్, అనంత్‌రావు, ప్రేమయ్య, కవిత, తైఫా, గౌతమ్, రాహుల్, వెంకటయ్య, రాజు, అమర్, యాదయ్య, సువర్ణ పాల్గొన్నారు.
రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో..
షాద్‌నగర్, ఆగస్టు 6 : తెలంగాణ విద్యావంతులు ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి కలెక్టర్ అమయ్‌కుమార్, జిల్లా ఉన్నత అధికారులు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమలో ఆయన పోషించిన పాత్రను ఈ సందర్భంగా కొనియాడారు. విద్యార్థి దశ నుంచే తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఉద్యమించిన ఆదర్శమూర్తి ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తిరుపతిరావు, ప్రతీక్‌జైన్, ఇతర ఉన్నత అధికారులు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.