
మెదక్, ఆగస్టు 7 : సూక్ష్మ ఆహార శుద్ధీకరణ పరిశ్రమల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) కింద గరిష్టంగా రూ.10 లక్షల వరకు 35శాతం రాయితీ ఇస్తున్నదని, ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాలో పీఎంఎఫ్ఎంఈ అమలుపై ఏర్పా టు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పథకం కింద వ్యక్తిగత పరిశ్రమలు, రైతు తయారీ, సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలకు మాత్రమే ఈ రాయితీ లభిస్తుందన్నారు. ప్రస్తుతం వ్యాపారంలో కొనసాగుతున్న అన్ని సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలు మాత్రమే అర్హులన్నారు. వ్యక్తిగత పరిశ్రమకైతే 18 ఏండ్లు పైబడిన 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు. ఆహార శుద్ధి రంగంలో ఉన్న స్వయం సహాయక సంఘం సభ్యులు ఉపకరణాల కొనుగోలు కోసం రూ.40 వేల మూలధన రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో సెర్ప్ ద్వారా 441 ఆహార శుద్ధి యూనిట్లు ఉన్నట్టు గుర్తించామన్నారు. పథకం మార్గదర్శకాలకనుగుణంగా జిల్లా రిసోర్స్ పర్సన్లు క్షేత్రస్థాయిలో యూనిట్లను పరిశీలించి, అర్హులైన 20 యూనిట్లను గుర్తించాయన్నారు. 20 యూనిట్లకు రూ.32 లక్షల 67వేల ఆర్థిక సహాయాన్ని వివిధ బ్యాంకుల ద్వారా అందించడానికి జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, రాష్ట్ర ఆహార శుద్ధి సంస్థ యాంకర్ పర్సన్ ప్రభంజన్, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాం నాయక్, ఉద్యాన సహాయ సంచాలకుడు నర్సయ్య, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి, పంచాయతీరాజ్ ఈఈ రాంచంద్రారెడ్డి, డీపీవో తరుణ్‌కుమార్, డీఈవో రమేశ్ కుమార్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు.
రూర్బన్ పథకం కింద చేపట్టే పనులను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతు వేదికలు, వైకుంఠధామాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. శనివారం కలెక్టరేట్లో రూర్బన్ పథకం కింద చేపట్టిన వివిధ పనులపై సమీక్షించారు. పనులు నత్తనడకన సాగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. చేసిన పనులకు వారం రోజుల్లో డబ్బులు చెల్లించాలన్నారు. ప్రారంభించని పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే బీటెక్ చేసిన వీఆర్వో సేవలను ఉపయోగించుకోవాలని పంచాయతీరాజ్ ఈఈకి సూచించారు. స్వయం సహాయ సంఘాలు ఉత్పత్తి చేస్తున్న జ్యూట్ బ్యాగులకు ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాలశీతలీకరణ కేంద్రం పనులు వేగవంతం చేయాలని విజయ డైయిరీ అధికారులకు సూచించారు.