కత్తి చేసిన గాయం కాలంతో మానుతుందేమో గానీ, మాటలు చేసే గాయాలు ఎప్పటికీ మానవు అంటారు మన పెద్దలు. సంభాషణ, భావ వ్యక్తీకరణ మనిషికి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం. ఇతరులతో మాట్లాడే ముందు మన మాటలు సందర్భోచితమా, కాదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అవునని సమాధానం వస్తేనే సంభాషణ మొదలు పెట్టాలి. అనవసర మాటల వల్ల పాపాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. అవసరమైన మంచి విషయాలైనా సందర్భానుసారంగానే మాట్లాడాలి. మేధావులు, మూర్ఖులతో వాదించకూడదు. నోటి దురుసుతనం ఉన్నవారు అవమానాల పాలవుతారు. ఒక వ్యక్తి హృదయం సరి కానంత వరకు అతడి విశ్వాసం సవ్యంగా ఉండదు. అతడి నోరు మంచిది కానంత వరకు అతడి హృదయం పవిత్రం కాదని ప్రవక్త బోధించారు. కాబట్టి సరైన మాటలే మాట్లాడాలి. లేదంటే మౌనంగా ఉండటమే ఉత్తమం.
మనుషులు మధురంగా మాట్లాడాలని ఇస్లాం బోధిస్తుంది. మన భావాలు.. వినేవారి హృదయంలో నాటుకొనేలా ఉత్తమరీతిలో మాట్లాడాలి. ఉత్తమ సంభాషణ శత్రువులను సైతం ప్రభావితం చేస్తుంది. మృదు భాషణం అల్లాహ్ ప్రీతిని పొందే మార్గంగా అభివర్ణిస్తారు. నిరాధార, వినాశకర, అనవసర విషయాలు మాట్లాడకుండా నోటిని రక్షించుకోవాలని ఇస్లాం తన అనుయాయులను ఆదేశించింది. నిత్యం వాదోపవాదాలకు దిగే వ్యక్తిని దైవం మన్నించడు. ‘మీ చూపుల్లో, మాటల్లో వినమత్ర చూపండి. ఇతరుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలకరించండి’ అన్న దైవప్రవక్త(స) ప్రవచనం మనందరికీ శిరోధార్యం. ప్రజలను సహృదయంతో పలకరించాలి అని చెబుతుంది ఖురాన్. ‘మర్యాదగా పలకాలి, మృదువుగా సమాధానమివ్వాలి, అసత్యాలు పలకరాదు, రుజువాక్కును పలకాలి’ ఈ సూక్తులన్నీ దివ్యఖురాన్ సుభాషితాలు. విశ్వాసులు ఖురాన్ ఆదేశించిన సూత్రాలను ఆచరిస్తారు. అల్లాహ్ ప్రీతిని పొందుతారు.