ఆలయాల్లో ధ్వజ స్తంభం ఎందుకు ఏర్పాటు చేశారు..?
ఆలయ నిర్మాణంలో ధ్వజ స్తంభం అనివార్యమైన ఒక భాగం. ఆలయం సాధకుని దివ్య దేహానికి ప్రతీక. దేహమే దేవాలయమని పెద్దలు చెప్పారు. దేహానికి వెన్నెముక లాంటిదే ఆలయానికి ధ్వజస్తంభం. ఆగమ సంప్రదాయం ప్రకారం దైవ శక్తి ఐదు రూపాలలో ఐదు చోట్ల ఉంటుంది. మూలవిరాట్టులో, ఉత్సవమూర్తిలో, పాదుకలలో, అర్చకునిలో, ధ్వజస్తంభంలో ఉంటుందని ఆగమ శాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఆలయానికి ధ్వజ స్తంభం ఉండి తీరాలి.
దూరం నుంచి వచ్చే భక్తులకు ఆలయం ఎక్కడ ఉన్నదో సూచిస్తుంది ధ్వజస్తంభం. అంతేకాదు. భక్తులు గుడికి చేరేసరికి.. వేళదాటి ఆలయ ద్వారం మూతపడితే.. దిగులుపడే అవసరం లేకుండా ధ్వజస్తంభ దర్శనంతో దైవదర్శనం పొందినట్లే. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు ఆలయాలలో ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు.
– శ్రీ