Varalakshmi Vratam | అష్టలక్ష్మీల్లో వరలక్ష్మీ (Varalakshmi Vratam) దేవికి ప్రత్యేకత స్థానం ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వ మంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్థిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారత దేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయా ల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించిన శ్రీలక్ష్మీని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే.
వరలక్ష్మీ వ్రతం రోజు ఉదయమే లేచి స్నానం చేసి పట్టు వస్ర్తాలు ధరించి జగన్మాత వరలక్ష్మీ దేవి వ్రతాన్ని ఆచరించడం మన సాంప్రదాయం. ఇంటిని మామిడి తోరణాలు, బంతి పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. గుమ్మానికి పసుపు కుంకుమలతో బొట్లు దిద్దాలి. ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజించి, కలశంలోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తర్వాత అథాంగ పూజ చేయాలి. దాని తర్వాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప నైవేద్యాలను తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం, మంత్ర పుష్పం సమర్పించి మంగళ హారతి ఇవ్వాలి. తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. పిండి వంటలు, పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువుకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీగా భావించి వాయనమీయాలి. ఐదుగురు ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి తాంబూలం అందించి ఆశీర్వాదం తీసుకోవాలి.
Also Read..
Varalakshmi Vratam | సకల శుభాలు, అఖండ సౌభాగ్యాలు.. వరాలిచ్చే వరలక్ష్మీవ్రతం
Tirumala | శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
పచ్చని చెట్లు.. స్వర్గానికి మెట్లు