తిరుమల : తిరుమలలోని (Tirumala) శ్రీవారి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాల తొలిరోజు పవిత్రాల ప్రతిష్టను నిర్వహించారు. ఆగస్టు 6న పవిత్ర సమర్పణ, ఆగస్టు 7న పూర్ణాహుతి ఉంటుందన్నారు. 5న అష్టదళ పాద పద్మారాధన సేవ, ఆగస్టు 7న తిరుప్పావడ సేవతో పాటు ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
20 కంపార్ట్మెంట్లలో భక్తులు..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,928 మంది భక్తులు దర్శించుకోగా 29,297 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.21 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.