Varalakshmi Vratam | శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇళ్లూ కలకలలాడుతుంటాయి. ముఖ్యంగా శ్రావణమాసంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని (Varalakshmi Vratam) ఆచరిస్తారు. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని తిథి నక్షత్రాలతో సంబంధం లేకుండా వరలక్ష్మీ వ్రతంగా జరుపుకొంటారు. అత్యంత శక్తిమంతమైన వ్రతాల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటని అంటారు. సకల శుభాలు, అఖండ సౌభాగ్యాలు ప్రసాదించే వరలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాధాన్యత ఉంది. అన్ని మాసాల్లో కన్నా శ్రావణమాసం శివకేశవులతో పాటు లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు మొదటగా లక్ష్మీదేవి అవతరించిందని పురాణాలు పేర్కొంటున్నాయి.
విష్ణుమూర్తిని నారాయణ స్వరూపుడిగా లక్ష్మీదేవిని వరలక్ష్మీగా భావించి వ్రతం ఆచరిస్తే మహిళలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతారు. స్కంద పురాణంలో సైతం శివుడు పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యతను గురించి వివరించారు. వ్రతం ఆచరించి తోటి సుహాసినులకు పసుపు, కుంకుమలు అందజేసి ఆశీస్సులు తీసుకుంటారు. చారుమతి కథను చదువుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. పెండ్లి అయిన ప్రతి మహిళా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని పెద్దలు చెబుతారు.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చారుమతి కథ (charumathi katha)ను భక్తిగా చెప్పుకొంటారు. వరలక్ష్మి కటాక్షాన్ని పొందిన మహిళ పేరు అది. చారుమతి అంటే.. మంచి బుద్ధి కలిగినది, మితభాషి అని అర్థం. వ్రతాలను ఆచరించడానికి అందరూ అర్హులేననీ, సామూహికంగా ప్రార్థిస్తే.. ఎక్కువ ఫలితం ఉంటుందనే సామాజిక స్పృహ కలిగిన మహిళ చారుమతి. కుటుంబ ధర్మాన్ని, గృహిణి బాధ్యతలను ఆమె నిర్వర్తించిన తీరు ఆదర్శవంతం.
లక్ష్మీ కటాక్షంలో స్త్రీ పాత్రే కీలకమని పురాణాలు చెబుతున్నాయి. అత్తమామలను ఆదరించే కోడలున్న ఇంట శ్రీలక్ష్మి కొలువై ఉంటుంది. భర్తను గౌరవిస్తూ అతనికి మంచిని సూచించే భార్య నిజమైన గృహలక్ష్మి. భార్యాభర్తలు కీచులాడుకోని ఇంట్లో వరలక్ష్మి స్థిరంగా ఉంటుందని భాగవతం పేర్కొన్నది. చారుమతి కథను అర్థం చేసుకొని జీవితానికి అన్వయించుకుంటే ఇంటిదీపం ఇల్లాలే అవుతుంది. ఆమెలోని సద్గుణాలు అలవరచుకొంటే వ్రతఫలం పూర్తిగా దక్కుతుంది. చెడుబుద్ధి, దుష్ట సంకల్పం, దుర్గుణాలు లేని స్వచ్ఛమైన మనసు కలిగినవారే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఇంటికి ఇల్లాలే.. వరలక్ష్మి. ఆమెను గౌరవించడం, అర్థం చేసుకోవడం, ఆమె శ్రమలో భాగం పంచుకోవడం భర్త బాధ్యత కూడా.
Also Read..
Tirumala | శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
పచ్చని చెట్లు.. స్వర్గానికి మెట్లు