మనిషి జీవితంలోని ప్రతి రంగంలో ఇస్లాం మార్గదర్శనం చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఇస్లాం బోధనల్లో ప్రముఖ అంశం ‘మొక్కలు నాటడం’. చెట్లు మనిషికి మేలు చేస్తాయి. భూమికి అందాన్ని కలిగిస్తాయి. మొక్కల ప్రాముఖ్యతను, వాటిని నాటాల్సిన అవసరాన్ని నాలుగు శతాబ్దాల క్రితమే ఇస్లాం చెప్పింది.
‘షజర్’ అనే అరబిక్ పదానికి చెట్టు అని అర్థం. ఈ పదాన్ని ఖురాన్లో 26 సార్లు ఉపయోగించారు. ‘జన్నత్’ (తోట) అనే పదాన్ని 66 సార్లు ఉపయోగించారు. ఖురాన్లో ‘పండ్లు’ అనే పదం కూడా అనేకసార్లు కనిపిస్తుంది. ఇవన్నీ చెట్ల ప్రాముఖ్యతను తెలుపుతున్నాయి. పయగంబర్ హజ్రత్ ముహమ్మద్ జీవితం కూడా చెట్ల ప్రాముఖ్యతను చాటుతుంది. ఆయన ఖుత్బాలు (ప్రసంగాలు) ఇచ్చినప్పుడు ఖర్జూర చెట్టు దగ్గర నిలబడేవారు. హుదైబియా ఒప్పందం చెట్టు కిందే జరిగింది.
కొన్ని హదీసులు (ప్రవక్త బోధనలు) చెట్ల ప్రాముఖ్యతను ఇలా వివరించాయి: ‘ఎవరైనా ఒక మొక్కను నాటి, ఆ మొక్క చెట్టయి.. దాని పండ్లను మనుషులు గానీ, పశు పక్ష్యాదులు గానీ తింటే, అది సదఖా (దానము)గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.’
‘ఉపదేశించిన జ్ఞానం, నీతిమంతులైన సంతానం, ఖురాన్ ప్రతులు, నిర్మించిన మసీదు, నిర్మించిన అతిథి గృహాలు, తవ్వించిన నీటి కాలువలు, నాటిన చెట్లు, చేసిన దానం… ఈ మంచి పనులన్నీ మనిషి చనిపోయాక కూడా ఉపయోగపడతాయి’ (ఇబ్నె మాజా). మొక్కల పెంపకం మానవత్వానికి చిరునామాగా నిలుస్తుంది. మనం నాటే మొక్కల వల్ల ఇతరులకు మేలు కలిగితే, మనం చనిపోయాక కూడా మనకు పుణ్యం లభిస్తుంది. అది ఒక సత్కార్యం. మొక్కలు నాటడం వల్ల భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది. చెట్లు మన ఆరోగ్యానికి కీలకం. కొన్ని ఔషధాలు చెట్ల నుంచి తయారవుతాయి. అందుకే మొక్కలు నాటడాన్ని, చెట్ల సంరక్షణను సేవా కార్యక్రమంగా భావించాలి. ప్రతి వ్యక్తి, సంఘం, సమాజం కలిసి మొక్కలు నాటడంపై దృష్టి పెట్టాలి.
-ముహమ్మద్ ముజాహిద్ ,96406 22076