బైబిల్ కథా ఘట్టాల్లో కనాను అనే ప్రాంతానికి చాలా ప్రాధాన్యం ఉంది. అయితే యాకోబు కాలానికి అది భ్రష్టమైపోయింది. అక్కడి ప్రజలు అబద్ధపు దేవుళ్లను ఆరాధించేవారు. ఆలుమగల బంధాలు పటాపంచలయ్యాయి. ఈ నేపథ్యంలో యాకోబు గానీ, అతని సంతానం గానీ కానాను ప్రాంతంలో తిరగడానికే ఇష్టపడేవారు కాదు. అయితే యాకోబు గారాలపట్టి దీనా మాత్రం ఆ ప్రాంత యువతులతో పరిచయం పెంచుకుంది. ఒకరోజు అక్కడి వాళ్లను పలకరించడానికి వెళ్లింది. అక్కడే ఉన్న షెకెము అనే వ్యక్తి దీనాను బలవంతం చేయబోయాడు.
విషయం తెలిసిన దీనా పన్నెండు మంది సోదరులు.. షెకెము ఉన్న పట్టణంపై అకస్మాత్తుగా దాడి చేశారు. షెకెమును, అతని సోదరులను, ఇతర పురుషులందరినీ చంపేశారు. తన కుమారులు అలా చేసినందుకు యాకోబుకు చాలా కోపం వచ్చింది. ఈ కష్టమంతా ఎలా మొదలైంది? దీనా దేవుని నియమాలను పాటించని ప్రజలతో సావాసం చేయడం మూలంగానే ఇదంతా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డాడు. కాబట్టి, మనం స్నేహితులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దుష్టులతో స్నేహం వల్ల కలిగే నష్టాలు పూడ్చుకోలేమని గుర్తెరగాలి.