Bathukamma | తెలంగాణ ప్రజల సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. దసరా శరన్నవరాత్రుల సమయంలోనే ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు వైభవంగా జరుపుకుంటారు. అయితే శరన్నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలవుతాయి. కానీ బతుకమ్మ ఉత్సవాలు మాత్రం భాద్రపద అమావస్య నుంచి ప్రారంభమవుతాయి. దీని వెనుక ఒక కారణం ఉంది. అదేంటో తెలుసుకుందామా..
బతుకమ్మ పండుగ అనేది జానపదులు ఉల్లాసంగా నిర్వహించుకునే పెద్ద ఉత్సవం. ఈ పండుగ పుట్టుక వెనుక వేర్వేరు కథనాలు వాడుకలో ఉన్నాయి.
ప్రాచీన కాలంలో నవాబులు, పెత్తందార్ల అఘాయిత్యాలకు బలైపోయిన అమాయక గ్రామీణ ఆడపడుచుల మరణాలకు కన్నీళ్లు రాలుస్తూ వారిని పితృదేవతలకు సమానంగా ఆరాధిస్తుంటారనేది ఒక కథనం. ఆ అమావాస్య రోజునే పితరులతోపాటు ఆ అబలలను స్మరించుకునే సంస్కృతిలో భాగంగా అదే రోజు బతుకమ్మ పండుగను మొదలుపెట్టడం సంప్రదాయమైంది. వారిని పార్వతీ అమ్మవారికి ప్రతీకలుగా భావిస్తూ పెత్తర అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు వేడుక నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు రకరకాల పూలను పేర్చి, బతుకమ్మను తీర్చి శక్తిని ఆవాహన చేసి ఆటపాటలతో అర్చించడం ఆచారంగా మారింది.
బతుకమ్మ వెనుక చారిత్రక నేపథ్యమూ ప్రచారంలో ఉంది. ప్రాచీన కాలంలో చాళుక్యులకు రాజధానిగా విలసిల్లింది మన వేములవాడే. ఈ చాళుక్యులను జయించిన చోళులు తమ ఆరాధ్య దైవమైన బృహదీశ్వరుణ్ని తంజావూరుకు తరలించుకు పోయి బృహదీశ్వరీ దేవి వియోగ దుఃఖానికి కారణమయ్యారు. ఆ బాధను తలచుకొని జానపదులు అమావాస్య రోజున అమ్మవారిని పూవుల రూపంలో పేర్చి అశ్రు తర్పణం విడిచి తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడటం సంప్రదాయంగా మారింది. వేములవాడలో పూజలందుకుంటున్న రాజేశ్వరుడే బృహదీశ్వరుడనీ, రాజరాజేశ్వరి బృహదీశ్వరి అనీ.. జానపదుల మాటలలో బతుకమ్మగా మారిందని ఒక కథనం. అందుకే బతుకమ్మ పండుగకూ, శరన్నవరాత్రులకూ ఈ వైవిధ్యం ఏర్పడింది.
దక్షిణ కాశీగా సుప్రసిద్ధమైన వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి దేవాలయం ఎనిమిదో శతాబ్దంలో నిర్మితమైంది. ఈ దేవాలయాన్ని లేంబాలవాటిక అని, భాస్కర క్షేత్రమని, హరిహర క్షేత్రమనీ అంటారు. ఈ దేవాలయంలో పార్వతి, రాజరాజేశ్వరీ సమేతుడైన శివుడు మహాలింగ రూపంలో దర్శనమిస్తారు. ఈ దేవాలయం గురించి భవిష్య పురాణంలోనూ ప్రస్తావన ఉంది. అర్జునుడి మనుమడైన నరేంద్రుడు అనుకోకుండా ఓ ముని చావుకు కారణం అవుతాడు.
ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. ఈ దేవాలయాన్ని వేములవాడ చాళుక్య రాజు విక్రమాదిత్య యుద్ధమల్లుని మనుమడు మొదటి నరసింహుడు నిర్మించాడు. ఇతనికి రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ పేరుతోనే రాజరాజేశ్వర దేవాలయం అనే పేరు వచ్చింది. తమిళనాడును పరిపాలించే రాజరాజచోళుడి తండ్రి రెండవ పరాంతక సుందర చోళుడు రాష్ట్రకూటుల నుంచి తనను కాపాడమని పరమేశ్వరుడిని వేడుకుంటాడు.
ఆ భక్తితోనే తన కుమారుడికి రాజరాజు అని నామకరణం చేస్తాడు. రాజరాజు కూడా రాజరాజేశ్వరుడి భక్తుడే. అంతలోనే, రాజరాజచోళుడి కొడుకు రాజేంద్ర చోళుడు ఈ ప్రాంతంపై దాడి చేసి.. రాజరాజేశ్వర ఆలయంలోని విగ్రహాన్ని పెకలించి తీసుకెళ్లి తన తండ్రికి కానుకగా ఇస్తాడు. ఆ స్వామిని ప్రతిష్ఠించడం కోసమే రాజరాజు తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడని అంటారు. దేవాలయ నిర్మాణానికి చాళుక్యుల నుంచి కప్పంగా వసూలు చేసిన సొమ్మునే వినియోగించాడు.
ఆ తర్వాత చాళుక్యులు రాజరాజేశ్వర ఆలయంలో పునఃప్రతిష్ఠించిన మూర్తికి, బృహదీశ్వరాలయంలోని శివలింగానికి అనేక పోలికలు కనిపిస్తాయి. ఆ సంఘటనతో కల్యాణి చాళుక్యులు, రాజ్య ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. శివుడికి (బృహదీశ్వరుడు) దూరమైన ఒంటరి పార్వతిని (బృహదీశ్వరమ్మను) వారు చూడలేకపోయారు. పసుపుతో గౌరమ్మను చేసి, తొమ్మిదిరోజులు పువ్వులతో బతుకమ్మను పేర్చి, శివుడు లేని పార్వతి గురించి పాటలు పాడుతూ, పూజించి శివుడి దగ్గరికి వెళ్లిరమ్మంటూ నీళ్లలో వదులుతారు. అదే అనంతర కాలంలో తెలంగాణ ప్రజల బతుకమ్మ ఆచారంగా మారిందని ఓ విశ్లేషణ.