e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News Vivekananda jayanti | వివేకానందుడు మ‌న‌కు నేర్పిన నీతి ఏంటంటే..

Vivekananda jayanti | వివేకానందుడు మ‌న‌కు నేర్పిన నీతి ఏంటంటే..

Vivekananda jayanti | ప్రాక్‌ ప్రాభవాన్ని పశ్చిమాన ఉదయింపజేసిన జ్ఞానజ్యోతి వివేకానందుడు. తన మాతృభూమి మహోన్నతిని లోకానికి చాటిచెప్పిన ధీరుడు ఆయన. ‘మేలుకో!’ అని భారత యువతను వెన్నుతట్టిన గంభీర స్వరం ఆయనది. ఆ మాటలు.. నేటికీ, ఏనాటికీ స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి. వివేకవాణిలో మమేకమైతే.. ప్రతి మనిషికీ తన కర్తవ్యం బోధపడుతుంది. చిరు సమస్యలకూ వికలమయ్యే మనసుకు పెను సవాళ్లను సైతం ఎదుర్కొనే శక్తి వస్తుంది.

Vivekananda jayanti |
Vivekananda jayanti

‘యోధులారా! మీరు ఉత్కృష్టమైన ఫలితాన్ని సాధించడానికి జన్మించారని మరచిపోవద్దు. లక్ష్యాన్ని చేరే మార్గంలో వినిపించే చిన్నచిన్న అరుపులకు భీతి చెందొద్దు. పెద్దపెద్ద ఉరుములను కూడా లెక్క చేయవద్దు. స్థిరంగా, ధైర్యంగా నిలబడి కృషి చేయండి’ ఇది వివేకానందుడి బోధ. ఇందులోని ప్రతి అక్షరం విల్లు వదిలి దూసుకుపోయే శరంలాంటిదే. మిన్ను విరిగినా లక్ష్యంపై కన్ను చెదరొద్దు అని హెచ్చరించేదే! ఆయన యథాలాపంగా చెప్పిన మాటలు కావివి. ఒక యోగి అంతరంగ తరంగాల్లో నుంచి విశ్వాంతరాళాల్లోకి ఎగసిన కర్తవ్య వాక్యాలు. తాను స్వయంగా అనుభవించిన విషయాలనే బోధించి, ఘనీభవించిన భారత జాతిని ఉద్ధరించాడు వివేకానందుడు.

- Advertisement -

“నేను సముద్రాన్ని ఆపోశన పడతాను. నేను సంకల్పిస్తే కొండల్నే పిండి చేస్తాను’ అంటారు కార్యశూరులు. ‘అలాంటి శక్తి, సంకల్పాలతో అవిశ్రాంతంగా శ్రమించినప్పుడే గమ్యాన్ని చేరగలం” అన్నాడు వివేకానంద. అంతులేని సముద్రాన్ని కూడా అలవోకగా దాటగలననే మనోధైర్యం మనిషికి ఉండాలి. అలుపెరగని పోరాటం మామూలు మనిషిని సైతం యోధుడిగా నిలబెడుతుంది. ఒకసారి వివేకానందుడు కన్యాకుమారి వెళ్తాడు. ఎదురుగా భీకరంగా ఘోషించే సముద్రం. మధ్యలో సాకారంగా కనిపిస్తున్న అద్భుత శిల. ఒక్క ఉదుటున సముద్రంలోకి లంఘిస్తాడు. రెండు కిలోమీటర్లు ఈదుతూ శిలను చేరుకుంటాడు. ఆ కఠిన శిలపై కఠోర ధ్యానానికి పూనుకుంటాడు. మూడు రోజులు నిర్విరామ ధ్యానం. అందులోనే ఏదో అన్వేషణ! దీన భారతాన్ని ధీర భారతంగా మార్చాలనే అన్వేషణ. ఆకలి కడుపులకు కావలసింది మత శోధనలు కాదు, కర్తవ్య బోధనలు అని నిర్ణయించుకుంటాడు. ఆ ఆంతరంగిక అన్వేషణ ఫలితం దివ్య భారతావని ఆవిష్కరణ. కర్మభూమి ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పడం వెనుక ఉద్దేశమూ ఇదే.

‘ఎంతవరకు ఆత్మశక్తి, దైవ భావం భారతదేశానికి ఆధారభూతంగా ఉంటాయో, ఎంతవరకు భారతీయులు ఆధ్యాత్మికతను, దైవదృష్టిని విడనాడకుండా ఉంటారో, అంతవరకు భారతదేశం ఛేదింపడానికి వీలుకాని అమరస్వరూపమై విలసిల్లుతుంది’ అని ఉద్ఘాటించాడు వివేకానంద. ఎంతటి మహావృక్షం వేళ్లయినా నేలలోనే కదా ఉంటాయి! భారతదేశానికి మూల ప్రాతిపదిక ఆధ్యాత్మికత, దైవ చింతన. ఈ రెండిటినీ ఆచరించే వ్యక్తి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాడు. ఈ విశాల భావనలను విషంగా భ్రమిస్తే, తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న అజ్ఞానిగా మిగిలిపోతాడు. ఎంత ఎత్తుకు చేరినా తటాలున కింద పడిపోతాడు. వివేకానందుడు ఆధ్యాత్మికత పవిత్రతను తెలియజేశాడే కానీ, ఛాందసవాదాలను ఎన్నడూ సమర్థించలేదు. అస్పృశ్యతను నిర్ద్వంద్వంగా ఖండించాడు. పాశ్చాత్య భౌతిక నాగరికతవైపు ఆకర్షితులై, ఆ మార్గాన్ని అనుసరిస్తే ఆధ్యాత్మిక పునాదిపై నిర్మించిన మన జాతీయ సౌధం కూలిపోతుందని హెచ్చరించాడు.

ఆధ్యాత్మిక చైతన్యంతోపాటు మానవత్వమూ మహోన్నతమైనదని చాటిచెప్పాడు వివేకానందుడు. ‘ఓ జగజ్జననీ పార్వతీ! నాకు మానవత్వాన్ని, ధైర్యాన్ని అనుగ్రహించు’ అని వాటి ప్రాధాన్యాన్ని తెలియజెప్పాడు. దుర్బలత్వాన్ని తన నుంచి తొలగించాల్సిందిగా అమ్మవారిని వేడుకున్నాడు. మానవత్వానికి ప్రతీకగా తనను మార్చాల్సిందిగా కోరుకున్నాడు. ఈ జాతికి కావాల్సిన లక్షణాలను తనకు ఆపాదించుకొని తానే స్వయంగా కోరాడు. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, దానిలోపల వజ్రాయుధంతో తయారైన మనస్సు, పౌరుషం, క్షాత్రవీర్యం, బ్రహ్మతేజస్సు కలిగిన యువత నాకు కావాల’ంటూ యువతరానికి సందేశాన్ని ఇచ్చాడు. ‘మన వేదమంత్రాలలో ఉండే అమోఘ శక్తి వల్ల యువతను మేల్కొల్పుతాను. లేవండి! మేల్కొనండి!’ అని యువ భారతానికి దిశా నిర్దేశం చేశాడు. వివేకానందుడి సందేశం అందిపుచ్చుకుందాం. ఉక్కు సంకల్పంతో చెక్కు చెదరని ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుందాం. ఆధ్యాత్మిక చైతన్యాన్ని, మానవత్వ పరిమళాల్ని సమ్మిళితం చేసి కొత్త చరిత్రను సృష్టిద్దాం.

– ఆదరాసుపల్లి శశిధర్‌, 94911 04664

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

swami vivekananda quotes | కోరికలను పూర్తిగా పరిత్యజించండి..

Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతిక‌రం.. పాల‌తోనా? పెరుగుతోనా?

కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిద‌ర్శ‌నం

అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement