e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home చింతన దామోదరుని దర్శన భాగ్యం!

దామోదరుని దర్శన భాగ్యం!

దామోదరుని దర్శన భాగ్యం!

శ్రీశుక యోగీంద్ర ఉవాచ- పరీక్షిన్నరేంద్రా! ఉత్తమ గుణ ధౌరేయుడైన మైత్రేయ మహర్షి విగత కల్మషుడు భాగవత వరేణ్యుడైన విదురునికి ఇలా వివరించాడు-

బ్రహ్మదేవుని కాయ (దేహ) చ్ఛాయ నుండి కర్దమ ప్రజాపతి జన్మించాడు. కర్దముడు మూర్తిమంతమైన దమము- అనగా బహిరింద్రియ నిగ్రహానికి సంకేతం. జలస్నానము స్నానమే కాదు, ‘స స్నాతో యో దమ స్నాతః’- దమ స్నానమే వాస్తవ స్నానమని, అట్టి స్నానం చేసిన వాడే బాహ్యాభ్యంతర శుచిమంతుడని శాస్త్రవాక్యం.

దేవహూతి స్వాయంభువ మను పుత్రిక. లోకోత్తర సౌందర్యవతి. శీలవతి. గుణవతి కూడా. దుర్వాస మహర్షి పృథ (కుంతి)కి ఉపదేశించిన ‘దేవతా ఆహ్వాన విద్య’యే దేవహూతి. పిలిచిన దైవము పలికే విద్య. దేవహూతి మహా మహిమా సంపన్నురాలు. సరోజాక్షు (విష్ణు)ని సలహా పాటిస్తూ, స్వాయంభువ మనువు- శతరూపా దంపతుల ప్రార్థనను మన్నించి కర్దముడు దేవహూతిని సహధర్మచారిణిగా స్వీకరించాడు.

భవాని భవు (శివు)ని భజించునట్లు దేవహూతి, పతి అయిన కర్దమ ప్రజాపతిని సేవించసాగింది. శుచిమంతురాలు. గృహకార్య దక్షురాలు, పతిని అనుసరించునది, సదామధుర భాషిణి అయిన గృహిణియే లక్ష్మి. వైకుంఠలక్ష్మి లక్ష్మి కాదని నీతిశాస్త్రం. ఆ దంపతులు భగవద్విభూతి రూపమైన పరమ పవిత్ర దాంపత్య సుఖం అనుభవించారు. కర్దమ మహర్షి తనను తాను తొమ్మండుగురుగా విభజించుకొని భార్యయందు నవవిధాలుగా వీర్యం నిలిపాడు. రతియందు పతికి ఉన్న అనాసక్తి వలన ఆయన సతికి తొమ్మండుగురూ ఆడపిల్లలే కలిగారు. ఆధ్యాత్మికంగా నవపుత్రికలు నవధా-నవవిధ భక్తికి (శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం) సంకేతం.

‘భక్త్యా ఏవతు భగవద్‌ జ్ఞానం’- భక్తి ఉంటేనే గదా భగవంతుని ఆవిర్భావం! బ్రహ్మదేవుని ఆదేశానుసారం కర్దముడు తన కుమార్తెలైన- కళను మరీచి మహర్షికి, అనసూయను అత్రి మహర్షికి, శ్రద్ధను అంగిరసునకు, హవిర్భువును పులస్త్యునకు, గతిని పులహునకు, క్రియను క్రతువునకు, ఖ్యాతిని భృగువుకు, అరుంధతిని వశిష్ఠునకు, శాంతిని అధ్వర్యునకు ఇచ్చి వివాహం చేశాడు. సనాతన వైదిక ధర్మానికి ఈ మహర్షులు మూలస్తంభాలు!
అనంతరం దేవహూతి, కర్దమ దంపతులకు ఇచ్చిన ఆనతి ప్రకారం ఆదిదేవుడు, జమ్మిచెట్టు తొర్రలోనుంచి అగ్ని ఆవిర్భవించినట్లు దేవహూతి గర్భాన ‘కపిలుడు’ అను పేర పుత్త్రుడుగా ప్రాదుర్భవించాడు. కపిలుడు జన్మ సన్యాసి. విధి పూర్వక కర్మాధికార స్వీకరణ లేనప్పుడు కర్మ త్యాగ ప్రసక్తి కూడా పొసగదు కదా! కపిలుడు ఆత్మ ధర్మ రక్షణకై అవతరించిన జ్ఞానావతారం. స్వపక్ష పోషణుడు- తన పక్షం వారిని పెంచి పోషించువాడు, భక్త మాన వర్ధనుడు- తన భక్తుల పరువు, ప్రతిష్ఠ, పదవి ఇనుమడింప చేయువాడు. కపిలుడు ఆవిర్భవించగానే కర్దముడు తన సమయం (షరతు) అనుసరిస్తూ స్వామి అనుజ్ఞతో సన్యసించి ఆయనకు ప్రదక్షిణం చేసి అరణ్యానికి వెళ్లి భక్తియోగంతో భగవత్పదవిని అందుకొన్నాడు.

దేవహూతి పుత్త్ర రూపంలో ప్రకాశిస్తున్న పరమాత్మని ప్రార్థించింది-
‘ఓ నిష్కలంకా! నిరంజనా! నిర్వికారా! నా మోహమనే గాఢమైన అంధకారాన్ని నశింప చేయడానికి నీకన్నా సమర్థులెవరన్నా? నీవు జన్మ సంసార బంధాలనే తీగలను తెగ నరికే కొడవలి వంటివాడవు. బుధ సత్తముడవు- జ్ఞానులలో ఉత్తముడవు. సర్వులకు శరణు వేడ తగిన వాడవు. ధర్మమును నిస్తరించు- విస్తరించువాడవు. సకల లోకాలకు శుభాలు కలిగించువాడవు. శాశ్వతమైన అపవర్గ- మోక్ష సంపదకు అధినాయకుడవు. ఓ తపోనిధీ! నిన్ను శరణు వేడుతున్నా. నన్ను కరుణతో కాపాడు.’

దేహంపై అహంకారం, దేహానికి బయటివానిపై మమకారం- ఇదే మోహం! ‘ముహ్‌ వైచిత్యే’- మోహమనగా విచిత్తత, చిత్త వైపరీత్యం, విపరీత బుద్ధి. దృశ్య ప్రపంచం, దేహం, మనసు- ఈ మూడడుగులు దాట గలిగితేనే త్రివిక్రమ- వామన- దామోదరుని దర్శన భాగ్యం! (సశేషం)

ఉ.‘ భూరి మదీయ మోహ తమముం బెడ బాప సమర్థు లన్యు లె
వ్వారలు నీవకాక? నిరవద్య! నిరంజన! నిర్వికార! సం
సార లతా లవిత్ర! బుధ సత్తమ! సర్వ శరణ్య! ధర్మ వి
స్తారక! సర్వలోక శుభదాయక! నిత్య విభూతి నాయకా!

దామోదరుని దర్శన భాగ్యం!

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

ఇవి కూడా చ‌ద‌వండి..

సకలం నీవే!

సర్వ జనాకర్షణకు …

రంగుల హర్షం!

కొత్త ఉత్తేజం!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దామోదరుని దర్శన భాగ్యం!

ట్రెండింగ్‌

Advertisement