మైనర్‌పై లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదై మూడు రోజులు గడిచినప్పటికీ ఇప్పటివరకు పోలీసు శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు బాధిత బాలికకు న్యాయం చేయడాన్ని మరిచి బండి భగీరథ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాధిత బాలికకకు మద్దతుగా నేతలు, ప్రజాప్రతినిధులు పెద ఎత్తున పోలీసుల తీరుకు నిరసనగా ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. పలుచోట్ల బండి సంజయ్, బండి భగీరథ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. -సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ
రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం
చిక్కడపల్లి, మే 11: మైనర్‌కు మద్యం తాగించి లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, రజక వృత్తి దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య, గోర్రెల మేకల పెంపంకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుతల రవీందర్ , డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ మాట్లాడుతూ.. దేశం కోసం.. ధర్మ కోసం అని అంటూ దేశ ప్రజలను బుకాయిస్తున్న మతోన్మాదులు మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. సాయి భగీరథను అరెస్టును చేయకపోతే అన్ని సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు బాల సుబ్బారావు, సోమయ్య, రమేష్, శంకర్, ఇందిర, రజిత, ఆంజనేయులు, రవి, రాజు, భగత్ పాల్గొన్నారు.

Miner
బీఆర్ఎస్ మహిళా నేతల ధర్నా
శేరిలింగంపల్లి, మే 11: బండి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట ధర్నా నిర్వహించి.. అనంతరం కమిషనర్‌ను వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా నేతల ఉమ మాట్లాడుతూ.. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసి 48 గంటలు గడుస్తున్నా నిందితుడిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి తక్షణమే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దర్యాప్తు అధికారిని నియమించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, మమత, రాగం జంగయ్య యాదవ్, దారుగుపల్లి నరేష్, రమేష్ గౌడ్, నరేష్ సింగ్, అజయ్ గౌడ్, మాధవి, సుగుణ పాల్గొన్నారు.
పీపుల్స్‌ప్లాజా వద్ద నిరసన ప్రదర్శన
ఖైరతాబాద్, మే 11: మైనర్‌పై లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని, కేసు నుంచి తప్పించాలని చూస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ స్త్రీ ముక్తి లీగ్, దిశ విద్యార్థి సంఘం, నవ జవాన్ భారత్ సభ సంయక్త ఆ్తధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా లవ్ హైదరాబాద్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. కవితా పఠనం, ప్రజాగీతాలు, కరపత్రాల పంపిణీ, ఉపన్యాసాలతో వినూత్నంగా నిరసన చేపట్టారు. బాధితురాలికి న్యాయం జరిగేంతవరకు తమ పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయా సంఘాల ప్రతినిధులు భార్గవి, గీత, హీనా తదితరులు పాల్గొన్నారు.
బండి సంజయ్‌ను భర్తరఫ్ చేయాలి
కవాడిగూడ, మే 11: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి రాంనగర్ చౌరస్తాలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాధిత బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలన్నారు. పోక్సో కేసు నమోదైన వ్యక్తిని 24 గంటల్లో అరెస్టు చేయాలని.. 48 గంటలు గడచినా నిందితుడిని అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనపై తక్షణమే రేవంత్‌రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠాజయసింహ, నాయకులు.. ముఠా నరేష్, రాకేష్, వల్లాల శ్రీనివాస్‌యాదవ్, దీన్‌దయాల్‌రెడ్డి, పూస గోరఖ్‌నాథ్, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్, శ్రీధర్‌రెడ్డి, నేత శ్రీనివాస్, అస్లాం, గోక నవీన్, మాధవ్, సుధాకర్‌గుప్తా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బీజేపీ-కాంగ్రెస్‌వి కుమ్మక్కు రాజకీయాలు
దుండిగల్, మే11: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు విమర్శించారు. కేంద్రమంత్రి బండిసంజయ్ కుమారుడు భగీరథ్ నిందితుడిగా ఉన్న పోక్సో కేసులో సిట్ ఏర్పాటు కాలయాపనకే అన్నారు. వేగంగా దర్యాప్తు చేయాల్సిన పోక్సో కేసుకు సంబంధించి తెరచాటు రాజకీయాలు తగవన్నారు. బాధితులకు న్యాయం చేయమంటే వ్యవస్థలను సొంత లాభానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. నైతికబాధ్యత వహించి బండిసంజయ్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్పై దౌర్జన్యాలకు పాల్పడే కాంగ్రెస్ ప్రభుత్వం.. బీజేపీతో లోపాయకారి స్నేహం కొనసాగిస్తోందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ రేవంత్‌ది ఫెవికాల్ బంధం
ఉప్పల్, మే 11: మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథను వెంటనే అరెస్టు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. చిలుకానగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్ర హోం శాఖను దగ్గర పెట్టుకున్న రేవంత్‌రెడ్డి కుమ్మక్కై కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం నడుస్తున్నదని లక్ష్మారెడ్డి మండిపడ్డారు. జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామ చేయాలని, సీఎం రేవంత్‌రెడ్డి విషయాన్ని సీరియస్‌గా తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు బన్నాల గీతా ప్రవీణ్‌ముదిరాజ్, ప్రభుదాస్, శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నిష్పాక్షిక విచారణ చేపట్టాలి
బంజారాహిల్స్, మే 11: కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు నమోదై మూడు రోజులు గడిచినా ఇప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దారుణమని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కాలనీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సాధారణ వ్యక్తులపై కేసులు నమోదైతే ఆఘమేఘాల మీద అరెస్ట్‌లు చేసే పోలీసులు కేంద్రమంత్రి కొడుకు నేరానికి పాల్పడితే మాత్రం కాలయాపన చేస్తున్నారన్నారు. బండి భగీరథ్ కేసులో నిష్పాక్షిక విచారణ జరగాలంటే కేంద్రమంత్రి పదవికి బండి రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు నర్సింహ, సారంగపాణి, రావుల విజయ్, అహ్మద్, శశిరాజ్, వెంకీ ముదిరాజ్, శౌరిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
– ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి