e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home చింతన కొత్త ఉత్తేజం!

కొత్త ఉత్తేజం!

కొత్త ఉత్తేజం!

ఆత్మ ఉన్నత స్థితిలో ఉన్నపుడు ఉత్సవం జరుగుతుంది, జీవితం రంగులమయం అవుతుంది. ప్రపంచం అనేక రంగులతో నిండి ఉందని మనకు గుర్తుచేసే పండుగ హోలీ. మన చుట్టూ ఉన్న ప్రకృతి లాగానే, మన భావాలు, ఆవేశాలతో కూడా అనేక రంగులు ముడిపడి ఉన్నాయి. కోపం ఎరుపురంగుతో ముడిపడి ఉంది. అసూయ ఆకుపచ్చ రంగుతో, ఉత్సాహం, ఆనందం పసుపు రంగుతో, ప్రేమ గులాబీ రంగుతో, విశాలత్వం నీలి రంగుతో, శాంతి తెలుపుతో, త్యాగం కాషాయ రంగుతో, జ్ఞానం ఊదా రంగుతో ముడిపడి ఉన్నాయి. ప్రతీ వ్యక్తీ అనేక రంగుల ఫౌంటెన్‌ లాంటివారే. ఆ రంగులు ఎప్పటి కప్పుడు మారిపోతూ ఉంటాయి కూడా!

పురాణాలలో హోలీగురించి చాలా ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. హిరణ్య కశ్యపుడనే రాక్షసరాజు ఉండేవాడు. తననే అందరూ పూజించాలని అతడు కోరుకున్నాడు. అయితే అతని కుమారుడైన ప్రహ్లాదుడు, పరమ శత్రువైన నారాయణుని భక్తుడు. కుమారునిపై కోపించిన రాజు, ప్రహ్లాదుని చంపమని తన చెల్లెలు హోలికను ఆదేశించాడు. ఆమెకు అగ్నిని తట్టుకుని నిలిచే గుణం ఉంది. కాబట్టి ఆమె ప్రహ్లాదుని తన ఒడిలో ఉంచుకుని వెళ్లి అగ్నిలో కూర్చుంది. అయితే చిత్రంగా, ఆమే అగ్నికి ఆహుతి అయింది, ప్రహ్లాదుడు ఏ ముప్పూ లేకుండా బయటకు వచ్చాడు.

హిరణ్య కశ్యపుడు స్థూలప్రపంచానికి ప్రతీక. ప్రహ్లాదుడు అమాయకత్వానికి, విశ్వాసానికి, పరమానందానికి చిహ్నం. ఆత్మ అనేది కేవలం భౌతిక విషయాలను మాత్రమే ప్రేమిస్తూ ఉండలేదు. హిరణ్య కశ్యపుడు, లౌకిక ప్రపంచంనుండి మాత్రమే ఆనందమంతా రావాలని కోరుకున్నాడు. అలా జరగలేదు. జీవాత్మ అనేది భౌతికప్రపంచంలో ఒంటరిగా ఎక్కువకాలం బంధింపబడి ఉండలేదు. కాబట్టి అది, ఉన్నతస్థాయి అయిన నారాయణునివైపు సహజంగానే కదిలి వెడుతుంది.

పూర్వంనుండి ఉన్న (కర్మల) భారాన్ని హోలిక సూచిస్తుంది. అది ప్రహ్లాదుడి అమాయకత్వాన్ని కాల్చేయడానికి ప్రయత్నించింది. అయితే, నారాయణ భక్తి ప్రగాఢంగా నాటుకుని ఉన్న ప్రహ్లాదుడు పూర్వజన్మ వాసనలను (సంస్కారాలను) అన్నిటినీ కాల్చివేయగలిగాడు. గతాన్ని కాల్చివేయటం ద్వారా నువ్వు సరికొత్త ఆరంభానికి సిద్ధమౌతావు. నీ భావనలు అగ్నిలాగే నిన్ను దహించివేస్తూ ఉంటాయి. అవే భావనలు రంగుల ఫౌంటెన్‌ లా ఉంటే, అవి నీ జీవితానికి ఉత్తేజాన్ని అందిస్తాయి.

హోలీ పండుగలాగే జీవితం రంగులమయంగా ఉండాలి తప్ప, నిస్సారంగా ఉండకూడదు. ప్రతీరంగునూ స్పష్టంగా చూడగలిగితే (జీవితం) వర్ణమయంగా ఉంటుంది. అన్నిరంగులూ కలగలిసిపోతే నలుపురంగు కనిపిస్తుంది. అదేవిధంగా జీవితంలో మనం అనేక పాత్రలు పోషిస్తూ ఉంటాము. ప్రతీ పాత్రా, దానికి కావలసిన భావావేశాలు స్పష్టంగా తెలిసి ఉండాలి. భావావేశాల విషయంలో తికమకకు గురైతే సమస్యలు వస్తాయి. నువ్వు తండ్రివైతే, తండ్రి పాత్రనే పోషించాలి. నీ ఆఫీసులో కూర్చుని తండ్రిపాత్రను పోషించకూడదు. జీవితంలో నీ పాత్రలను కలగాపులగం చేస్తే, నువ్వు తప్పులుచేయడం మొదలౌతుంది. జీవితంలో నువ్వు ఏ పాత్ర పోషిస్తున్నావో, నీ ధ్యాసను సంపూర్ణంగా దానిపైనే పెట్టు.

జీవితంలో నువ్వు అనుభవించే ఆనందమంతా నీ ఆత్మలోతులనుండి వచ్చినదే నువ్వు పట్టుకున్నవాటిని అన్నిటినీ వదిలేసి, ఆ ఆకాశంలో స్థిరంగా కూర్చున్నపుడు కలిగేది. దానికే ధ్యానం అని పేరు. ధ్యానం అనేది ఒక పని కాదు. అది, ఏమీ చేయకుండా ఉండగలిగే కళ! ధ్యానంలో పొందే విశ్రాంతి చాలా గాఢమైన నిద్రలో పొందే దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ధ్యానంలో నువ్వు కోరికలన్నిటినీ దాటిపోతావు. ఇది మెదడును ఎంతో చల్లగా చేస్తుంది, ఇంకా చెప్పాలంటే నీ వాహనాన్ని లేదా యంత్రాన్ని ఓవరాలింగ్‌ లేదా సర్వీసింగ్‌ చేసినట్లుగా, శరీరం-
మనసుల జంటను పరిశుభ్రం చేస్తుంది.

ఉత్సవం జరుపుకోవడం అనేది ఆత్మ సహజగుణం. నిశ్శబ్దంనుండి వచ్చే ఉత్సవం అసలైన ఉత్సవం. ఉత్సవానికి పవిత్రత అనేది కలిస్తే అది సంపూర్ణం అవుతుంది. కేవలం శరీరం, మనసు మాత్రమే కాదు, ఆత్మకూడా ఉత్సవం జరుపుకొంటుంది. ఉత్సవం జరుపుకొనే స్థితిలో ఉన్నపుడు బుద్ధి చాలాసార్లు దైవాన్ని మరచిపోతూ ఉంటుంది. మనచుట్టూ అంతటా ఉన్న దేవుని అస్తిత్వాన్ని, దివ్యప్రకాశాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ ప్రపంచమంతా దేనితో నడుస్తోందో, దానిని అనుభవంలోకి తెచ్చుకోవాలనే కోరిక మనలో ఉండాలి. ప్రార్థనలద్వారా దీనిని అనుభవించడానికి నీవు అందులో పూర్తిగా పాలుపంచుకోవాలి. బుద్ధి వేరే ఎక్కడో పనిచేస్తుంటే, అది ప్రార్థన కాదు. కాబట్టి, సద్బుద్ధితో సాధన సాగించండి.

కొత్త ఉత్తేజం!
గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌

ఇవి కూడా చ‌ద‌వండి..

సకలం నీవే!

సర్వ జనాకర్షణకు …

రంగుల హర్షం!

దామోదరుని దర్శన భాగ్యం!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొత్త ఉత్తేజం!

ట్రెండింగ్‌

Advertisement