Ganesh Chaturthi | వినాయక చవితి పండుగంటే చిన్నా, పెద్దా అందరికీ ఆనందమే. పాలవెల్లి అలంకారం ఒక ముచ్చట. కరిరాజముఖుడి పూజకు పత్రాలు సేకరించడం మరో క్రతువు. కుడుములు, ఉండ్రాళ్లు, పానకం, వడపప్పు ఇలా ఎన్ని నైవేద్యాలో.. అన్ని ప్రసాదాలు! గణపతి పండుగకు సందడే సందడి! మండపాల అలంకరణలో వాడంతా కోలాహలం. వినాయకుడి ఊరేగింపులో ఊరంతా ఉత్సవం. నేత్రపర్వంగా సాగే చవితి సంబురంలో ఆధ్యాత్మిక విశేషాలు మాత్రమే కాదు మరెన్నో సామాజిక, వ్యక్తిత్వ వికాస విషయాలు దాగి ఉన్నాయి.
వినాయకుడి పెద్దతల విశాల దృక్పథాన్ని సూచిస్తుంది. ఆటంకాలు, సమస్యలు ఎదురైనప్పుడు సంకుచితంగా ఆలోచించకుండా, సమస్యకు కారణమైన అన్ని అంశాలను సమీక్షించి, ఆలోచించి, విశ్లేషించాలనే సందేశాన్ని ఏనుగుతల అందిస్తుంది. సమస్యను కేవలం మన దృష్టితో, మనవైపు నుంచే చూడకూడదు. మనస్థానంలో అవతలి వ్యక్తి లేదా అవతలి వ్యక్తి స్థానంలో మనం ఉంటే ఎలా ఆలోచిస్తామనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, తర్కించుకుని, ఆలోచించాలి. అప్పుడే ఒక నిర్ణయానికి రావాలి. సామాజిక, సంస్థాగత, కుటుంబ, వ్యక్తిగత సమస్యలన్నిటికీ ఈ తరహా ఆలోచన తప్పనిసరి. విశాల దృక్పథమే విజయాలకు నాంది అనే సందేశాన్ని వినాయకుడి ఏనుగు తల (పెద్ద తల) మనకు అందిస్తుంది.
వినాయకుడి వెడల్పయిన చెవులు ఎక్కువగా వినే అలవాటు చేసుకోవాలని చెబుతాయి. మనకు నచ్చిన మాటలే వినడమనే లక్షణం సాధారణంగా ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. అలాకాకుండా, మనకు నచ్చినా, నచ్చకపోయినా అవతలి వ్యక్తి చెప్పే విషయాన్ని శాంతంగా, సహనంగా, సానుకూల ధోరణితో వినాలనే సందేశాన్ని శూర్పకర్ణుడి చెవులు అందిస్తాయి. అవతలి వ్యక్తి చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినడం మానవసంబంధాల బలోపేతానికి తొలిమెట్టుగా పనిచేస్తుంది. ప్రధానంగా, ఆటంకాలు ఎదురైన సందర్భంలో కనిపించిన ప్రతివ్యక్తీ ఏవేవో సలహాలు చెబుతారు. వీటన్నిటిని సహనంతో వినాలి. అంతిమంగా, మన వివేచనతో ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలి. ‘వినదగునెవ్వరు చెప్పిన/ వినినంతనె వేగపడక వివరింప దగున్’ అంటూ సుమతీ శతకం చెప్పిన నీతి కూడా ఇదే.
భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు, ఇతర ఆపదల్ని ముందుగానే పసిగట్టి, దానికి పరిష్కార మార్గాలను ఆలోచించుకోవడం, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధపడటం వివేకవంతుల లక్షణం. వ్యక్తిగతంగానే కాదు.. సంస్థాగతంగానూ ఈ లక్షణం చాలా అవసరం. ఆపద వచ్చాక ఆలోచించడం వల్ల ప్రయోజనం సిద్ధించదు. మనం ఇప్పటికే సమస్యల్లో ఉన్నప్పటికీ, ఈ సమస్య నివారణ కోసం మనం తీసుకోబోయే చర్యల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులేమైనా ఉన్నాయేమో కూడా పరిశీలించుకోవాలి. వినాయకుడి పొడవైన నాసిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.
వినాయకుడికి ఉండే నాలుగు చేతులు… మనం చేసే పనికన్నా రెట్టింపు కష్టపడాలనే సందేశాన్ని ఇస్తాయి. చేయాల్సిన పని నుంచి తప్పించుకోవడం సాధారణంగా మనుషుల్లో కనిపించే ప్రవర్తన. కానీ, ఇది ఆహ్వానించదగింది కాదు. అలాగే, ఏదైనా ఇబ్బంది కలిగితే, దానిని సాకుగా చూపించి, పని ఎగ్గొట్టే వ్యక్తులు ఉంటారు. వీరందరికి వినాయకుడి నాలుగు చేతులు గొప్ప స్ఫూర్తిని అందిస్తాయి. ఆటంకాల్ని అధిగమించడానికి ఇప్పుడు చేసే పనికన్నా రెట్టింపు పనిచేయాలి. అసలు, ఇప్పుడే రెట్టింపు కష్టపడితే ఆటంకాలు వచ్చే అవకాశం కూడా చాలావరకు తగ్గుతాయి. నిరంతర పరిశ్రమ మనిషిని కర్తవ్యం వైపు నడిపిస్తుంది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. ఇటువంటి దుస్థితి మనిషికి రాకూడదనే, వినాయకుడు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు.
అంత పెద్ద శరీరం ఉన్న ఏనుగు చిన్న కండ్లతోనే ప్రపంచాన్ని గమనిస్తుంది. తనకు వచ్చే ఆపదల్ని ముందుగానే పసిగడుతుంది. కండ్లు ఎంత పరిమాణంలో ఉన్నాయనేది ముఖ్యం కాదు ఎంత నేర్పుగా, నిశితంగా పనిచేస్తున్నాయనేది ముఖ్యం అనే విషయాన్ని వినాయకుడి చిన్ని కండ్లు తెలియజేస్తాయి. అనవసరమైన విషయాల మీద దృష్టి నిల్పి, తమ కర్తవ్యాన్ని విస్మరించేవారికి వినాయకుడి నేత్రాలు.. కండ్లు తెరిపిస్తాయి. అలాగే, సమస్యల్లో ఉన్నప్పుడు మనల్ని అనేక విషయాలు ఆకర్షించి, మన దృష్టిని సమస్య నుంచి దారి మళ్లిస్తాయి. దీంతో, మనం పక్కదోవ పడతాం. ఇది సరైన పద్ధతి కాదని, మన దృష్టి ఎప్పుడూ లక్ష్యం మీదే నిలవాలని వినాయకుడి కండ్లు సూచిస్తాయి. వ్యక్తి నుంచి వ్యవస్థ వరకు ప్రతి ఒక్కరూ సమస్యలోని కీలకాంశాలపైన మాత్రమే దృష్టి నిలపాలని ఇవి ప్రకటిస్తాయి.
వినాయకుడి ఆకారాన్ని పరిశీలిస్తే నోరు కనిపించదు. పొడవైన తొండం మాత్రమే కనిపిస్తుంది. అంటే, ఆశయ సాధనకు చేతలే తప్ప మాటలు అవసరం లేదనే సందేశాన్ని వినాయకుడు తన కనిపించని నోరు ద్వారా సందేశం ఇస్తున్నాడని గ్రహించాలి. ముఖ్యంగా సమస్యలు ఎదురైన సందర్భంలో, అయోమయానికి గురై చేయాల్సిన పని మర్చిపోయి, మాటలతో కాలం గడిపేస్తూ, తనతోపాటు తోటివారిని, కుటుంబసభ్యులను కూడా మరింత ప్రమాదంలోకి పడేస్తుంటారు కొందరు.
వీరందరికీ వినాయకుడు గుణపాఠం చెబుతాడు. ఎక్కువగా మాట్లాడటం మానవుడిలోని బలహీన స్వభావానికి ప్రతీక. ఈ బలహీనతను మన శత్రువులు పూర్తిగా వినియోగించుకుని, మనల్ని మరింతగా సమస్యల్లోకి నెడుతారు. ఇలాంటి సందర్భాల్లో వినాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలి. గణపతికి తొండం వెనుక నోరు ఉంటుంది. అంటే, మాటల వల్ల ప్రయోజనం లేదు… చేతల వల్ల మాత్రమే నీ సమస్య పరిష్కారం అవుతుందనే సందేశం వినాయకుడి స్వరూపం నుంచి మనకు అందుతుంది.
ఇతర జంతువులకు కొమ్ములు ఎలాగో, ఏనుగుకు దంతాలు అటువంటివి. ఏనుగు తనను తాను రక్షించుకోవటానికి మాత్రమే కాదు.. దంతాలు ఏనుగుకు అదనపు అందాన్నిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఏనుగు తన దంతాలతోనే పెద్దపెద్ద బరువులు మోస్తుంది. ఇవి మనిషికి ఉండాల్సిన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తాయి. ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి కష్టానైన్నా ఎదుర్కోవచ్చనే సందేశాన్ని అందిస్తాయి. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.
ఏనుగుకు ఏ కొమ్ములైతే అందాన్నిస్తాయో, ఏ కొమ్ములైతే బరువులు మోయడంలో సహాయపడతాయో, అవే కొమ్ములు ఒక్కోసారి అడ్డంగా మారి, పని చేయనీయవు. అంటే, ఆత్మవిశ్వాసం ఎక్కువైతే పని చెయ్యలేం సరికదా… ఆ ఆత్మవిశ్వాసమే అహంకారంగా మారి, మన అభివృద్ధికి ఆటంకంగా తయారవుతుంది. అందుకే వినాయకుడు ఒక కొమ్ము తగ్గించుకున్నాడు. అంటే, అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచన ప్రాయంగా చెప్పాడు. మనిషి కూడా ఈ ఆదర్శాన్ని పాటించాలి. ఆత్మవిశ్వాసం ఆయుధంగా ఉండాలే కానీ, అహంకారంగా మారకూడదనే విషయాన్ని ప్రతి మనిషీ ప్రతి క్షణం గుర్తుచేసుకుంటూ ఉండాలి.
వినాయకుడికి పెద్ద పొట్ట ఉంటుంది. ఎదురయ్యే ప్రతి పరిణామాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించాలనే సందేశం ఇందులో ఉంది. తిన్న వస్తువును జీర్ణం చేసుకోవాలంటే, ముందుగా దాన్ని కడుపులోకి పంపించాలి. అక్కడ జీర్ణవ్యవస్థకు తగిన ప్రక్రియ జరుగుతుంది. పెద్దపొట్ట అపారమైన జీర్ణశక్తికి సంకేంతం. ఆశయ సాధనలోఎదరయ్యే ప్రతి కష్టాన్నీ జీర్ణించుకోవాలని వినాయకుడి లంబోదరం సంకేతాన్నిస్తుంది. జీర్ణం చేసుకోవడం అంటే ప్రతి విషయానికి ప్రతిస్పందించకుండా ఉండటం అని అర్థం కాదు. సంఘటనను అర్థం చేసుకుని, దాని ద్వారా అనుభవసారాన్ని గ్రహించి, భవిష్యత్తుకు పాఠంగా మార్చుకోవాలనే సూచన ఇందులో ఉంది. వ్యక్తిగతంగా మెరుగైన జీవితం పొందడానికి కూడా ఈ లక్షణం ఎంతో అవసరం.
వినాయకుడంటే ప్రకృతికి ప్రతీక. మహాగణాధిపతి మట్టితో పుట్టినవాడు. భూమిని, ప్రకృతి సంపదను కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనేది వినాయక చవితి సందేశం. గణపతిని 21 రకాల పత్రితో పూజించాలంటారు. ఎందుకంటే పంచేద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిస్తే మొత్తం పది. వీటికి ప్రవృత్తి, నివృత్తి కలిపితే 21 అవుతాయి. ఇవే 21 రకాల పత్రి. అవన్నీ సిద్ధి, బుద్ధి చేకూర్చాలని కోరుకోవడమే పత్రి పూజ అంతరార్థం. అంతేకాదు, పూజించే ప్రతి పత్రిలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. అవి కుటుంబసభ్యుల ఆరోగ్యానికి, ఆనందానికి దోహదం చేస్తాయి.
వినాయక చవితినాడు వివిధ రకాల పండ్ల వాడకం ఎంతో ప్రతీతి. పాలవెల్లికి కట్టడానికి, భక్తితో గణపతికి నివేదన చేయడానికి వాటిని ఉపయోగిస్తారు. వాటిలో చాలావరకు మహిళల ఆరోగ్యానికి దోహదం చేసేవే. మక్కజొన్న పొత్తుల్లో పీచు అధికం. దీనివల్ల అనవసరపు కొవ్వు చేరుకోదు. వాటిలోని ఫొలేట్ కణాలు గర్భధారణ సమయంలో కొత్త కణాల ఉత్పత్తికి సహకరిస్తాయి. సీతాఫలంలో క్యాన్సర్ రాకుండా చూసే యాంటిఆక్సిడెంట్లు అధికం. బత్తాయిలు, నారింజల్లో విటమిన్ ‘సి’ ఉంటుంది. గర్భిణులకు అవసరమైన ఫోలికామ్లం, పీచు, పొటాషియం పెద్దమొత్తంలో వీటినుంచి అందుతాయి. చింతకాయలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.