Vinayaka Chavithi | వినాయక చవితి వేడుకలకు యావత్ భారతదేశం సిద్ధమైంది. దేశంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో వినాయక చవితికి ప్రత్యేక స్థానం ఉన్నది. శివపార్వతుల కుమారుడైన గణేశుడి జన్మదినంగా భావించే ఈ పండుగను దేశవ్యాప్తంగా సందడిగా జరుపుకుంటారు. నవరాత్రుల పాటు వినాయకుడి భక్తిశ్రద్ధలతో పూజాలు చేస్తారు. తాము చేపట్టబోయే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ జనం గణపతిని ఇంటికి ఆహ్వానిస్తుంటారు. వినాయక చవితి రోజున మట్టి విగ్రహాలను ఇంటికి తీసుకొచ్చి ప్రతిష్టించి పూజలు చేయడం ఒక సంప్రదాయం. అయితే గణపతిని ఇంటికి ఆహ్వానించే ముందు కొన్ని చేయాల్సిన, చేయకూడని ముఖ్యమైన విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది.
విగ్రహం ఎంపిక విషయంలో జాగ్రత్త అవసరం. ఎత్తైన విగ్రహం కన్నా చిన్నదైనది తీసుకోవడం మంచిది. మట్టితో చేసిన, పర్యావరణ అనుకూలమైన విగ్రహాన్ని ఎంపిక చేసుకోవాలి. పగుళ్లు లేకుండా, విరిగిన భాగాలు లేని విగ్రహాన్ని ఎంచుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP) తో తయారైన విగ్రహాలకు దూరంగా ఉంచడం మంచిది. ఇవి నీటి కాలుష్యానికి కారణమవుతాయి.
విగ్రహ ప్రతిష్టాపనకు ముందే ఇంట్లో సరైన స్థలాన్ని ఎంపిక చేసుకుని.. టేబుల్‌పై శుభ్రమైన వస్త్రం పరచాలి. విగ్రహాన్ని ఇంటికితీసుకొచ్చే సమయంలో ‘గణపతి బప్పా మోరియా’ వంటి మంత్రాలను జపిస్తూ భక్తిశ్రద్ధలతో తీసుకురావాలి. విగ్రహాన్ని నేలపై ఉంచకుండా ఉండాలి. పూజా సామగ్రి, పువ్వులు, స్వీట్లు మొదలైనవి ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
విగ్రహాన్ని పూజ గదికి సమీపంలో ఉంచడం ఉత్తమం. కుటుంబసభ్యులు, మిత్రులు ఇంటికి వచ్చినప్పుడు గణపతి దర్శనం కలగడం శుభంగా భావిస్తారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తాజా పువ్వులు, ధూపదీపాలతో పూజ చేయాలి. మోదకం, ఇతర నైవేద్యాలను సమర్పించాలి. విగ్రహం శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. వంటగది, షూ ర్యాక్, వాష్ రూమ్ వద్ద ప్రతిష్టించకూడదు. నాయకుడిని ఐదు, ఏడు, తొమ్మిది రోజులు ఇంట్లో ఉంచుకోవచ్చు. ప్రతి రోజూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజ నిర్వహించాలి. ఎండిపోయిన పువ్వులను తొలగిస్తూ, పూజాస్థలాన్ని శుభ్రంగా ఉంచాలి.
వినాయక చవితి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. విగ్రహం ఇంట్లో ఉన్నంత కాలం సాత్విక ఆహారమే తీసుకోవాలి. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటివి పూర్తిగా దూరం ఉండాలి. ఇంట్లో శుభ వాతావరణం ఉండేలా చూడాలి. విగ్రహ ప్రతిష్ట చేసిన ఇంట్లో ఎప్పుడూ ఒక్కరైనా ఉండాలి. తలుపులు మూసివేయరాదు. నిమజ్జనానికి ముందు హారతులు ఇచ్చి, గణపతిని సాదరంగా వీడ్కోలు చెప్పాలి. ఎందుకంటే మళ్లీ వచ్చే ఏడాది ఆనందం, ప్రేమ, శక్తి, ఆశీర్వాదాలను పుష్కలంగా తీసుకువస్తాడని ఆకాంక్షిస్తూ.. వినాయకుడికి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేయాలి.
Read More :
“Vinayaka Chavithi | వినాయక చవితికి ఇంట్లోకి విగ్రహాన్ని తెస్తున్నారా? ఈ పొరపాట్లు అసలు చేయకండి..!”
Famous Ganesha Temples | భారతదేశంలోనే కాదు.. ఈ దేశాల్లోనూ వినాయకుడికి ఆలయాలు ఉన్నయ్..!