Vinayaka Chavithi | భాద్రపద మాసం వచ్చిదంటే చాలు దేశవ్యాప్తంగా వినాయక పండగ సందడి మొదలవుతుంది. నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఊరువాడ అంతా ఎంతో ఉత్సాహంగా విగ్రహాలను ప్రతిష్టించి.. పూజలు చేస్తారు. చాలామంది తమ ఇండ్లల్లోనూ వినాయకుడి విగ్రహాలను తీసుకువచ్చి పూజలు చేస్తుంటారు. అయితే, చాలామంది విగ్రహాల రూపం, ఆకారం చూస్తూ అందంగా ఉంటేనే సరిపోతుందని భావిస్తుంటారు. ఇలా అనుకోవడం పొరపాటే. వినాయకుడి విగ్రహం శాస్త్ర ప్రకారం ఉండాలి. రూపం, భంగిమ, రంగు, అలాగే దిశ వంటి అంశాలు పూజలో ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయి. కానీ, వీటిపై సరైన అవగాహన లేకుండా వింత వింత ఆకారాలు, ఎత్తైన, విచిత్రమైన రూపాలు కొనుగోలు చేసి పూజ చేస్తున్న విగ్రహాలు కనిపిస్తుంటారు. అయితే, గణపతికి సంబంధించి శాస్త్ర ప్రమాణాలు పాటించడం ఉత్తమమని పండితులు పేర్కొంటున్నారు.
విగ్రహం అందంగా ఉండటం తప్ప కాదు. కానీ ముఖ్యంగా, వినాయకుడు కూర్చున్న భంగిమలో ఉండాలి. అతని తొండం ఎడమ వైపుకి వంగి ఉండటం పవిత్రతకు సంకేతం. ఇలాంటి విగ్రహం అత్యంత శుభకరంగా పరిగణించబడుతుంది. ఇలాంటి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పూజించగా, ఆధ్యాత్మిక శక్తి, ఆనందం, శ్రేయస్సు, స్థిరత్వం కలుగుతాయని నమ్మకం ఉంది. ఇంటి లోపల విగ్రహాన్ని ఈశాన్య దిశలో ప్రతిష్టించడం శుభమని భావిస్తారు. ఆ దిశలో ప్రతిష్టించడం సాధ్యం కానప్పుడు, ఉత్తర దిశలో ఉంచవచ్చు. అది కూడా కుదరనిపక్షంలో తూర్పు దిశలో కూడా ఉంచుకోవచ్చు. సరైన దిశలో విగ్రహం ప్రతిష్టించడం గృహసుఖానికి, శాంతికి దోహదం చేస్తుందని పండితులు పేర్కొంటున్నారు.
వినాయకుడి విగ్రహ రంగు కూడా చాలా ముఖ్యం. ఎరుపు, సింధూరం రంగు విగ్రహాలు శక్తి, ఉత్సాహానికి ప్రతీకగా భావిస్తారు. తెలుపు రంగు విగ్రహాలు ఇంట్లో శాంతి, ప్రశాంతతను కలిగిస్తాయని నమ్మకం. అందుకే, పూజకు తీసుకునే విగ్రహం రంగు కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి. వినాయక చవితి సందర్భంగా పూజ కోసం విగ్రహం ఎంచుకునేటప్పుడు, అతని రూపం, భంగిమ, రంగు, దిశ అన్ని శాస్త్రసమ్మతంగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని.. పొరపాటున అశుభల సంకేతాలు కలిగిన విగ్రహాలు ఇంట్లోకి తీసుకురావద్దని పండితులు పేర్కొంటున్నారు. జాగ్రత్తలు పాటిస్తే, పూజా విధానాలు మరింత ఫలప్రదమవుతాయి, కుటుంబానికి శాంతి, ఐక్యత, శ్రేయస్సు అందుతుందని చెబుతున్నారు.