స ఏవాధస్తాత్స ఉపరిష్టాత్స పశ్చాత్స పురస్తాత్స
దక్షిణతః స ఉత్తరతః స ఏవేదగ్ం
సర్వమిత్యథాతోహంకారాదేశ
ఏవాహమేవాధస్తా దహముపరిష్టాదహం
పశ్చాదహం పురస్తాదహం
దక్షిణతోహ ముత్తరతోహమేవేదం సర్వమితి
(చాందోగ్య ఉపనిషత్తు 7-25-1)
‘ఆత్మ (భూమా) కింద పైన వెనుక ముందు పక్కల అంతటా నిండి ఉంది. ఈ కనిపించే జగత్తు అంతా ఆత్మే! అదే నేను. నేనే కిందా, పైనా అంతటా ఉన్నాను. అంతా నేనుగా ఉన్నాను’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. ఎంతటి ఉదాత్తమైన భావాన్ని తెలియజేసిందో కదా ఈ శ్లోకం. దీన్ని బలపరిచే కథే ఇది.. మహారాష్ట్రలో పండరీపురం అనే పుణ్యక్షేత్రం ఉన్నది. అక్కడ దైవం పాండురంగ విఠలుడు. ఏడు వందల ఏండ్ల క్రితం అక్కడ ఒక భక్తుడు ఉండేవాడు. చిన్నప్పటినుంచీ అతనికి రంగడంటే ప్రాణం. ఎప్పుడూ స్వామి ధ్యాసలోనే ఉండేవాడు. ఒకరోజు సాయంకాలం అతను ఓ చెట్టుకింద కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఎక్కడినుంచో ఒక కుక్క అక్కడికి వచ్చింది. పళ్లెంలోని రొట్టెలను లొట్టలు వేసుకుంటూ చూసింది. భక్తుణ్నీ పరిశీలించింది. ఆ వచ్చిన కుక్కను అతను గమనించలేదు. అది గబుక్కున రొట్టెను నోట కరచుకొని పరుగెత్తింది.
పరధ్యానం నుంచి తేరుకున్న ఆ భక్తుడు ఆ కుక్క వెంటపడ్డాడు. ‘భగవాన్ కేవలం రొట్టెలు తినకు. కడుపు నొప్పి లేస్తుంది. ఇదిగో ఈ నెయ్యి వేసుకో!’ అంటూ కుక్కను పట్టుకున్నాడు. రొట్టె మీద నేతి వేసి కుక్కకు ఇచ్చాడు. అది ఆవురావురుమంటూ తిన్నది. భక్తుడు తృప్తిగా నవ్వాడు. అతనెవరో కాదు పాండురంగనిపై ఎన్నో కీర్తనలు రచించి, పాడి ధన్యుడు అనిపించుకున్న భక్తాగ్రేసరుడు నామదేవ్! ఆత్మ అనంతమైనది. ఆ భూమా తత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్న మహాత్ముడు కాబట్టి అతను జంతువుల్లోనూ దైవాన్ని దర్శించాడు. ఈ తత్వంలోని వాళ్లు సర్వజీవులందు ఆత్మ దర్శనం చేస్తారు. అక్కడ కుక్క, పిల్లి అనేవి సామాన్యులకు కనిపిస్తాయి. కానీ, భూమా తత్వంలో స్థిరపడిన వాళ్లు అంతటా తమను తామే దర్శనం చేసుకుంటారు. తాము ఏ విధంగానైతే అనుభూతి చెందుతారో, అవి కూడా అలాగే అనుభూతి చెందుతాయని భావిస్తారు.