తిరుమల : కొవిడ్ వ్యాప్తి తగ్గడం, వేసవి సెలవులు మొదలుకావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. రెండేళ్ల తర్వాత తిరుమలలో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. కోవిడ్ సమయంలో వివిధ విభాగాల్లో సిబ్బందిని కుదించి ఇతర విభాగాలకు పంపగా తిరిగి ఆయా విభాగాలకు రప్పించి భక్తులకు సేవలు అందిస్తున్నారు. నిన్న శ్రీవారిని 68,299 మంది భక్తులు దర్శించుకోగా 26,421 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.90 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. పిఎసి-2, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో కలిపి 185 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు సేవలందిస్తున్నారు. ప్రధాన కల్యాణకట్టతో పాటు మినీ కల్యాణకట్టల్లో క్షురకులు 24 గంటల పాటు భక్తులకు సేవలు అందిస్తున్నారు.
కొవిడ్ సమయంలో 400 మంది క్షురకులు సేవలు అందిస్తుండగా, ప్రస్తుతం పీస్ రేట్ క్షురకులతో కలిపి మొత్తం 1200 మంది సిబ్బంది భక్తులకు తలనీలాలు తీస్తున్నారు. తిరుమలలో రోజుకు 1700 మంది, తిరుపతిలో మరో 300 మంది శ్రీవారి సేవకులు, వీరితో పాటు మరో 200 మంది పరకామణి సేవకులు వివిధ విభాగాల్లో భక్తులకు సేవలు అందిస్తున్నారు.