TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం నుంచి కొత్త నిబంధనను టీటీడీ అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై కొండపై శ్రీవారి దర్శనం, గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదం, రీఫండ్ చెల్లింపులు వంటి అంశాల్లో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని అమలు చేయనున్నది. సేవల్లో పారదర్శకత పెంచేందుకు దేవస్థానం ఈ నిర్ణయం తీసుకున్నది. తిరుమలలోని గదుల కేటాయింపు కేంద్రాల దగ్గర ప్రయోగాత్మకంగా ఈ సాంకేతికతను పరిశీలించారు.
భక్తులు తిరిగి మళ్లీ వసతి గదిని ఖాళీ చేసే సమయంలోనూ గదులు పొందినవారే వచ్చి మళ్లీ ఫేస్ రికగ్నేషన్ చేయిస్తే డిపాజిట్ చెల్లిస్తారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఈ సాంకేతికత సాయంతో లడ్డూలు అందించనున్నారు. ఏడు కొండలపై దళారి వ్యవస్థకు చెక్ పెట్టడంలో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని టీటీడీ భావిస్తున్నది. ప్రస్తుతం ఈ టెక్నాలజీని ప్రయోగాత్మంగా పరిశీలిస్తుండగా.. సత్ఫలితాలు వస్తే.. పూర్తిస్థాయిలో అమలుకు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు భక్తులకు గమనించి, సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.