ఓ గ్రామీణ యువకుడు గురువు దగ్గరికి వచ్చాడు. తనకు పెద్దపెద్ద వ్యాపారాలు చేయాలని ఉన్నానని చెప్పాడు. అయితే, ‘నేను వ్యాపారం చేయలేనని కొందరు నిరుత్సాహ పరుస్తున్నార’ని బాధపడ్డాడు. గురువు చిన్నగా నవ్వి ‘మీ ఇంట్లో కుక్క మొరిగితే ఏమి చేస్తావు?’ అని అడిగాడు. ‘దానికి ఆకలైతే ఆహారం పెడతాను . కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఉంటే దాన్ని సముదాయించి గొలుసుతో కట్టేస్తాను’ అని బదులిచ్చాడు.
‘అదే… ఎవరి ఇంట్లోని కుక్కో మొరిగితే ఏమి చేస్తావు?’ అని మళ్లీ ప్రశ్నించాడు గురువు.
‘ఎవరి ఇంట్లోని కుక్కో మొరిగితే నేనెందుకు పట్టించుకుంటాను. ఏ మాత్రం పట్టించుకోను’ అన్నాడు. ‘అదే పని ఇక్కడ కూడా చేయ్. ‘లోకో భిన్న రుచిః’ అని తెలిసిందే కదా. వారివారి అనుభవాలనుబట్టి వారు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. నీకు నచ్చితే స్వీకరించు. లేకుంటే వాటిని పక్కన పెట్టు. నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు. అదే పదివేలు.
ఎప్పుడు కానీ ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించకు. నిన్ను నీవు మార్చుకోవడానికి ప్రయత్నించు’ అన్నాడు గురువు. ‘మరి వారు చెప్పినట్లు సమస్యలు వస్తే…’ రాగాలు తీస్తూ ప్రశ్నించాడు యువకుడు. వెంటనే గురువు ‘నువ్వు దారిలో పోతూ ఉంటే, నీకు ఎదురైన కుక్క ఏమి చేస్తుంది?’ అని అడిగాడు. ‘కొద్దిసేపు మొరిగి తన దారిన తాను పోతుంది’ అని నెమ్మదిగా చెప్పాడు ఆ యువకుడు.
‘కుక్క మాత్రమే వెళ్తుందా, లేక దాని తోక కూడా వెళ్తుందా?’ అని అడిగాడు గురువు. ‘కుక్కతో పాటు దాని తోక కూడా వెళ్తుంది’ అని వెంటనే బదులిచ్చాడు ఆ యువకుడు. ‘సమస్య కుక్క అయితే తోక దాని పరిష్కారం లాంటిది. కుక్క వెనుకే తోక ఉన్నట్లు సమస్య వెనుకే పరిష్కారం ఉంటుంది’ అని ధైర్యం చెప్పాడు గురువు. ‘తల అంటూ ఉంటే తలనొప్పి, మెడ అంటూ ఉంటే మెడ నొప్పి ఉంటాయి’ అని గ్రహించిన ఆ యువకుడు ఆత్మ విశ్వాసంతో అక్కడినుంచి కదిలాడు.
…? ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821