సత్యం, శాంతి, దయ, జ్ఞాన ప్రసారం, నియమబద్ధ జీవనం, ధ్యానం వంటివి బౌద్ధధర్మంలో ప్రధానాంశాలు. బుద్ధుడు త్రిశరణాలు ప్రతిపాదించాడు. శరణం అంటే ఆశ్రయించడం. బుద్ధం, దమ్మం, సంఘం.. ఈ మూడూ మనిషి జీవితంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. బుద్ధం (జ్ఞానం)తోనే మనిషి మాయ నుంచి, ప్రాపంచిక భ్రమల నుంచి తనను తాను వేరు చేసుకోగలుగుతాడు. దమ్మ సూత్రాలు పాటించి పరిపూర్ణ మానవుడు అవుతాడు. అలా చేయడమే జీవన సాఫల్యం.
ప్రపంచంలో ప్రతిదీ కారణం నుంచి పుడుతుంది. కారణ రహితంగా ఏదీ ఉండదు. దుఃఖం ఉందంటే, అందుకు కారణం ఉండి తీరుతుంది. అకారణంగా ఏదీ ఉండదు కదా! ఆ కారణాన్ని తెలుసుకొని నిరోధించగలిగితే దుఃఖమనే ప్రశ్నే ఉండదు. కారణాన్ని తెలుసుకొని, దానిని అధిగమించడానికి బుద్ధుడు సూచించినదే అష్టాంగ మార్గం. మనిషి మహోన్నతుడిగా మారడానికి పంచశీల సూత్రాలను ఉపదేశించాడు. వీటిని ఆచరించడం అంటే తథాగతుడు సూచించిన దమ్మపథంలో సాగడమే!
…? శ్రీ