ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టకముందే తండ్రిని, తొమ్మిదేండ్ల ప్రాయంలో తల్లిని కోల్పోయారు. అనాథగా ప్రారంభమైన ఆయన జీవితం కష్టాల కడలిలో ఎదురీతలాగా సాగింది. ఎంతో సాధన చేసి స్వయంకృషితో ప్రవక్తగా రాణించారు. చక్రవర్తిగా ఉన్నా నిరాడంబరంగా జీవించారు. ప్రవక్త (స) తుదిశ్వాస వరకూ ఎన్నో ఆదర్శాలను ఆచరించి చూపారు. దేవుడొక్కడే, మనుషులంతా ఒక్కటేనని చాటి చెప్పి అరబ్బు సమాజాన్ని సమూలంగా మార్చేశారు. హిరా గుహలో దైవవాణి ఆదేశం మేరకు ప్రవక్త బాధ్యతను స్వీకరించారు. కత్తితో సాధించలేనిది కరుణతో సాధించారు. మానవాళికి నైతిక జీవిత పాఠాలు బోధించారు. అందుకే ఆయన ఈ లోకం వీడి 1500 సంవత్సరాలైనా ప్రపంచం నలుమూలలా ప్రవక్తను స్మరించుకుంటూనే ఉన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘటనలు మనకు
మార్గదర్శనం చేస్తాయి.
ఒకసారి ఒక గ్రామీణుడు ప్రవక్త (స) దర్బారుకు వచ్చాడు. ఆ సమయంలో మహాప్రవక్త (స) తన మనుమడు హసన్ (రజి)ని ముద్దాడుతున్నారు. గ్రామీణుడికి అది ఓ వింతగానూ, పరువు ప్రతిష్ఠలకు విఘాతం కలిగించే విషయంగానూ తోచింది. ‘మీరు పిల్లల్ని ముద్దాడుతారా?! నాకు పదిమంది పిల్లలున్నారు. వారిలో ఏ ఒక్కరినీ ఇంతవరకు ముద్దాడలేదు’ అని ప్రవక్తతో అన్నాడు. ప్రవక్త (స) ఆ వ్యక్తిని తేరిపార చూసి, ‘దయ చూపనివాడు దయకు నోచుకోడు’ అని బదులిచ్చారు.
ఒకసారి హజ్రత్ ఆయిషా సిద్దీఖా దగ్గరకు ఒక నిరుపేద యాచకురాలు వచ్చింది. ఆమె వెంట ఇద్దరు ఆడ పిల్లలున్నారు. ఆ సమయంలో ప్రవక్త (స) కుటీరంలో ఒక్క ఖర్జూరపు పండు తప్ప మరేమీ లేదు. అప్పుడు హజ్రత్ ఆయిషా ఆ ఒక్క ఖర్జూరాన్నే యాచకురాలికి దానం చేశారు. అప్పుడు ఆమె ఆ ఖర్జూరాన్ని రెండు ముక్కలుగా చేసి తన ఇద్దరు పిల్లలకు సమంగా పంచిపెట్టింది. ఆ తల్లి మమకారం హజ్రత్ ఆయిషాకు ఆశ్చర్యం కలిగించింది. ఆయిషా ఆ ఘటనను ప్రవక్త (స)కు వివరించింది. ‘ఆడపిల్లల పట్ల మంచిగా ప్రవర్తిస్తే వాళ్లు నరకాగ్నికి అడ్డు తెరగా నిలుస్తారు’ అని ప్రవక్త(స) అన్నారు.
ప్రవక్త (స) కాలంలో ఇద్దరు మహిళలు విరుద్ధ భావాలు కలిగి ఉండేవారు. వారిలో ఒకామె రాత్రంతా నమాజులో లీనమై ఉండేది. పగటిపూట ఉపవాస వ్రతాలు పాటించేది. విస్తృతంగా దానధర్మాలు చేసేది. కానీ ఆమె తన నోటి దురుసుతనం వల్ల ఇరుగుపొరుగు వారిని ప్రశాంతంగా బతకనిచ్చేది కాదు. రెండో మహిళ కేవలం ఫర్జ్ నమాజులు చేసేది. మాటలు, చేతలతో ఎవరినీ నొప్పించేది కాదు. ఆ ఇద్దరు మహిళల గురించి ప్రవక్త (స) దగ్గర ప్రస్తావించగా.. ‘మొదటి మహిళలో మంచితనం లేదు. తన దుష్ప్రవర్తనకు శిక్షను అనుభవిస్తుంది. రెండో మహిళ మంచితనంతో స్వర్గంలో స్థానం సంపాదిస్తుంది’ అని అన్నారు.
ఒకసారి ఒకతను దుప్పటి కప్పుకొని నిద్రపోతుండగా, మరో వ్యక్తి వచ్చి నెమ్మదిగా ఆ దుప్పటిని దొంగలించాడు. బాధితుడు న్యాయం కోరుతూ ప్రవక్త (స)కు జరిగిన ఉదంతం వివరించాడు. అప్పుడు ప్రవక్త (స).. దుప్పటి దొంగతనం చేసిన వ్యక్తి చేతులు నరికివేయాలని తీర్పునిచ్చారు. ఆ తీర్పునకు కక్షిదారు హతాశుడయ్యాడు. దొంగపై జాలి కలిగింది. ‘కేవలం దుప్పటి కోసం ఒక మనిషి చేతులు నరికివేస్తారా? నేను ఈ దుప్పటిని ఈ దొంగకు అప్పుగా ఇస్తున్నాను. అతడిని వదలిపెట్టండి’ అని విన్నవించాడు. ‘ఇంతకుముందే ఈ పని ఎందుకు చేయలేదు’ అని ప్రవక్త (స) ఫిర్యాదుదారును మందలించారు.
ఒకసారి ప్రవక్త (స) తన సహచరులను ఉద్దేశించి ‘దరిద్రుడు ఎవరో మీకు తెలుసా?’ అని అడిగారు. దానికి వారు ‘డబ్బు, ఖరీదైన వస్తువులు లేనివారే దరిద్రులు అని మేము భావిస్తున్నాం’ అని అన్నారు. ‘వారు కాదు దరిద్రులు. ప్రళయ దినం నాటికి తన ఖాతాలో దుష్కర్మలు కలిగినవారే అసలైన దరిద్రులు’ అని ప్రవక్త (స) వారికి బదులిచ్చారు. తర్వాత పహిల్వాన్ ఎవరో మీకు తెలుసా? అంటూ ప్రవక్త (స) తన సహచరులను అడిగారు. ‘కుస్తీలో పైచేయి సాధించేవాడే పహిల్వాన్’ అన్నారు వారు. ‘అసలు పహల్వాన్ అతను కాదు. కోపం, ఆవేశం వచ్చినప్పుడు తనను తాను నిగ్రహించుకున్నవాడే అసలైన పహిల్వాన్’ అని ప్రవక్త (స) తెలిపారు.
ఒకసారి ప్రవక్త (స) స్వర్గం గురించి చెప్తూ దానిలోని భోగభాగ్యాలను వివరించారు. ఒక పల్లెటూరి సహచరుడు ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరై, ‘దైవప్రవక్తా, ఇంతకీ ఈ స్వర్గంలో ఎవరికి ప్రవేశం లభిస్తుంది’ అని ప్రశ్నించాడు. ‘మృదుభాషికి, ఆకలితో ఉన్నవారికి అన్నంపెట్టేవారికి, ఎక్కువగా ఉపవాసాలు పాటించే వారికి, లోకమంతా నిద్రిస్తున్న సమయంలో నమాజులు చేసేవారికి’ అని ప్రవక్త సమాధానమిచ్చారు. ఒక మంచి మాట కూడా దానంతో సరి సమానమని మరో సందర్బంలో చెప్పారు.
ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త (స) దగ్గరికి బాగా ఆకలితో వచ్చాడు. ఆ సమయంలో ప్రవక్త కుటీరంలో మంచినీళ్లు తప్ప మరేమీ లేదు. అందువల్ల ఆయన తన సహచరులను ఉద్దేశించి, ఈ రోజు రాత్రి ఈ వ్యక్తికి ఆతిథ్యమిచ్చే వారిపై అల్లాహ్ దయ చూపుతాడని అన్నారు. అన్సార్ సహాబీ అనే వ్యక్తి ఆ అతిథిని తన ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇంట్లో పిల్లలకు సరిపడా అన్నం మాత్రమే ఉందని అతని భార్య చెప్పింది. ‘పిల్లల్ని ఎలాగో బుజ్జగించి నిద్రపుచ్చు. ఇంట్లోని దీపం ఆర్పివేయి. మనమిద్దరమూ భోజనం చేస్తున్నట్లుగా నటిద్దాం. మనం పస్తులున్న విషయం అతిథికి తెలియకూడదు’ అని తన ఇల్లాలికి చెప్పారు. ఆమె భర్త చెప్పినట్లే చేసింది. ఈ విషయం ప్రవక్త (స)కు దైవవాణి ద్వారా తెలిసి ఆ సహచరుడిని ఎంతగానో మెచ్చుకున్నారు.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076