ఉపనిషత్ వాక్యం
శివాయ విష్ణురూపాయ
శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణు
ర్విష్ణుశ్చ హృదయం శివః॥
(స్కందోపనిషత్తు)
‘విష్ణు స్వరూపుడైన శివుడికి, శివ స్వరూపుడైన విష్ణువుకు నమస్కారం. శివుడి హృదయం విష్ణువు. విష్ణువు హృదయం శివుడు…’ అని ఈ ప్రసిద్ధమైన శ్లోకం భావం.ఉన్నది ఒకటే పరతత్వం. కనిపించేవి మాత్రం రెండు రూపాలు. శివ భక్తులలో చాలామందికి విష్ణువు అంటే అదో రకమైన భావన! విష్ణు భక్తులకూ శివుడంటే అంతే! భక్తి అనేది పరాకాష్ఠకు చేరితే ఈ భేదభావాలు ఉండవు. భేదం కనిపిస్తున్నదంటే భక్తి అనేది పరిణతి చెందలేదనుకోవాలి.
శివ కేశవులలో ఎవరు గొప్ప అనే విషయం మీద ఒకసారి ఒక పండిత సభ ఏర్పాటైంది. ఎందరో వచ్చారు. వాదోపవాదాలు జరిగాయి. ఎటూ తేల్చలేకపోయారు. బరద్వాన్ మహారాజా ఆస్థాన విద్వాంసులు మహాపండితులైన పద్మలోచన తర్కాలంకార్ దగ్గరికి వెళ్లి దీనిని పరిష్కరించమని ప్రార్థించారు. దానికి ‘నేను గాని, నా వంశంలో అటు ఏడు, ఇటు ఏడు తరాల వాళ్లు గానీ శివుణ్నీ చూడలేదు, విష్ణువునీ చూడలేదు’ అని ఆయన బదులిచ్చారు. ఈ విషయాన్ని శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులకు చెబుతూ.. ‘ఒకరితో ఒకరు ఇలా తగవులాడుతూనే ఉంటారు.
ఇది వివేకవంతుల పని కాదు. భగవంతుడి కోసం ఆర్తి చెందేవారు అన్ని మార్గాలూ అతణ్ని చేర్చేవే అని తెలుసుకుంటారు. ఏదేమైనా ఏకాంకిత నిష్ఠ కావాలి’ అని బోధించారు. చూసినవాళ్లు ఉన్నట్లయితే వాగ్వివాదాలకు తావు ఉండదని, వాదించే వారిలో భగవత్ సాక్షాత్కారం చేసుకున్న వాళ్లు లేరని, వారి భక్తి అంతవరకు చేరుకోలేదని తర్కాలంకార్ మాటల్లోని సారాంశం. శివకేశవులలో ఒకరిని నిష్ఠగా సేవిస్తే మరొకరిని ద్వేషించాలని ఎవరూ చెప్పలేదు. అలాంటి వారికోసమే ప్రత్యేకంగా ఉపనిషత్తు ‘శివాయ విష్ణురూపాయ..’ అనే శ్లోకాన్ని ప్రవచించిందా! అనిపిస్తుంది.
…?డా.వెలుదండ సత్యనారాయణ