Govindarajaswamy Temple | తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతకుముందు గోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగుమాడ వీధుల్లో విహరించారు. ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ట , రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశం.
అనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవర్లకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. ఇక సాయంత్రం సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహన సేవ జరుగనున్నది.