‘ప్రకృతిః త్రిగుణావలంబినీ’ అంటుంది యోగసారోపనిషత్తు. అంటే ప్రకృతి త్రిగుణాలను ఆధారంగా చేసుకొని సంచరిస్తున్నదని భావం. ప్రకృతి అంటే లోకాన్ని నడిపించే మాయ. ఇదీ పరబ్రహ్మంలో ఒక భాగమే! మాయతోనే మనసు లేదా మాయే మనసు.. అనుకోవచ్చు. మనసనేది త్రిగుణాలతో కూడి ఉంటుంది. మనుషుల నడుమ వ్యవహారాలలో అనేక భేదాలు గోచరించడానికి ఇవే కారణం. సత్వరజస్తమో గుణాలే త్రిగుణాలు. వీటి నిష్పత్తులలోని భేదాలే ఒక్కొక్కరి ప్రత్యేక వ్యక్తిత్వాలు.
ఒకసారి ఒకతను దట్టమైన అరణ్యంలో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ముగ్గురు దొంగలు అటకాయించి అతణ్ని నిలువుదోపిడీ చేశారు. ఒక దొంగ కత్తి దూసి నరకబోయాడు. మరొకడు అడ్డుకొని ‘అంత పని చేయకు. వీడి కాళ్లు చేతులు కట్టి పారవేస్తే సరి. మనం పారిపోవచ్చు’ అన్నాడు. అలాగే చేసి అక్కడినుంచి వెళ్లిపోయారు దొంగలు. కాసేపటికి ఇద్దరు దొంగల కళ్లుగప్పి మూడో దొంగ తాము బంధించిన బాటసారి దగ్గరికి వచ్చాడు. అతని కట్లు విప్పాడు. ‘బాధపడకు. నాతో రా!’ అన్నాడు. వెంటబెట్టుకుని అడవి దాటించి అతని ఊరు వెళ్లే దారి మీద వదిలేశాడు. ‘తిన్నగా వెళ్తే మీ ఊరు చేరుకుంటావు’ అన్నాడు. బాటసారి అతనికి కృతజ్ఞతలు చెప్పాడు.
‘మీరు ఎంతో దయామయులు. మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తే చాలా సంతోషిస్తాం’ అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ దొంగ ‘అమ్మ బాబోయ్! నేను రాకూడదు. వస్తే రక్షకభటులు పట్టుకుంటారు కదా!’ అన్నాడు. రామకృష్ణ పరమహంస ఒకసారి మహేంద్రనాథ దత్తకు ఈ కథ చెప్పి ‘సంసారమే మహారణ్యం. సత్వ రజ స్తమో గుణాలే ముగ్గురు దొంగలు. తమో గుణం నాశనం చేస్తుంది. రజో గుణం బంధిస్తుంది. సత్వ గుణం మాత్రం వీటన్నిటి నుంచి తప్పిస్తుంది. అయినా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించజాలదు. ‘అదిగో పరబ్రహ్మం’ అని దూరం నుంచి చూపించి నిష్క్రమిస్తుంది’ అని వివరించాడు.
– డా.వెలుదండ సత్యనారాయణ