ఎవరైనా ఇహలోకంలో కొంచెం దౌర్జన్యానికి పాల్పడినా.. పరలోకంలో అది పెద్ద శిక్షకు కారణమవుతుందని ఇస్లాం చెబుతుంది. దౌర్జన్యకారుల పాపం పండిన తర్వాత అల్లాహ్ వారిని శిక్షించకుండా వదలిపెట్టరు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు జకాత్ వసూళ్లలో దౌర్జన్యానికి పాల్పడకూడదు. దేవుడి ఖజానాను (ప్రజాధనాన్ని) అక్రమంగా ఖర్చు పెట్టినవారు ప్రళయ దినాన నరకాగ్నిలో పడి హాహాకారాలు చేయాల్సి వస్తుంది. దుర్మార్గమైన పనుల్లో పిసినారితనం ముఖ్యమైనది. మితిమీరిన ధన వ్యామోహంతో ఉన్నవాడు లేనివాడిని దోచుకుంటున్నాడు. అయితే లేనివారికి దైవం అండగా నిలుస్తారని దైవ ప్రవక్త (సల్లం) భరోసా ఇచ్చారు.
వారికి జరిగిన నష్టాన్ని దైవం తిరిగి చెల్లిస్తారని తెలిపారు. ‘ప్రళయదినాన ఆఖరికి కొమ్ముల్లేని మేకకు కూడా కొమ్ములున్న మేక నుంచి పరిహారం ఇప్పించబడుతుంది’ అని దైవ ప్రవక్త (సల్లం) ప్రవచించారు. ముస్లింలు అవిశ్వాసులు కాకూడదని… తమలో తాము ఒకరినొకరు చంపుకోవడం మహా పాపమని ఆయన తెలిపారు. తోటి ముస్లింల ధన, మాన ప్రాణాలను పరిరక్షించాలని ఆదేశించారు. తన నోటితో కాని, చేత్తో కాని ఇతర ముస్లింలకు బాధ కలగకుండా మసలుకునేవాడే నిజమైన ముస్లిం అని ప్రవచించారు. హిజ్రత్ (దైవ మార్గంలో పయనించేవారు) ఉన్నవారు దైవం పట్ల అవిధేయతను విడనాడాలని హితవు పలికారు.