శుక మహర్షి రాజర్షి పరీక్షిత్తుతో- భారతా! కృష్ణుని వలెనే వేష భూషలు, భాష గల ఉద్ధవుని చూచి గోప యోషిత- స్త్రీలు ఆయన చుట్టూ మూగి శిరసా నమస్కరించి ఇలా పలికారు.. ‘అయ్యా, ఉద్ధవా! నీవెవరివో మాకు తెలుసు. ఇద్ధ- ప్రకాశించు సచ్చరిత్రగల అనిరుద్ధుని- కృష్ణుని నెచ్చెలివి. రమారమణుడు తల్లిదండ్రులకు తన క్షేమ సమాచారాన్ని తెలిపి రమ్మని పంపగా పొలుపారు- తళుకొత్తు భక్తితో ఇచ్చటికి వచ్చావు. యదుపతి కనీసం తన జననీ జనకులనైనా మరువలేదు, ఎంతో నయం కదూ! మరి ఈ వ్రేపల్లెలో ఆ కన్నయ్యకు మన్నన చేయదగు వారూ, కన్నవారి కన్నా ఎన్నదగిన వారూ మరెవరున్నారో మాకు తెలియదు.
క॥ ‘మునివరులైనను బంధుల
ఘన సఖ్యము విడువ లేరు గాక విడువరే
సనిమిత్త సఖ్యమాకటి
పని దీరిన నళులు విరుల బాయునొ లేదో’
– సంగ రహితులైన ముని పుంగవులు కూడా చుట్టాలతోటి ప్రేమానుబంధాన్ని ఒక పట్టాన విడిచి పెట్టలేరు కదా! అట్టిది, అనంగ జనకుడు, శేషానుజుడు కృష్ణుడు తన మాతాపితరులకు అశేషమైన ప్రియమాచరించడంలో విశేషమేముంది? మాన్యా (ఆదరణీయా)! లోకంలో సామాన్యంగా స్నేహం- చెలిమి స్వార్థమూలకంగానే ఉంటుంది. అక్కర తీరగానే ఆ ప్రేమబంధం ఎంత చిక్కనిదైనా చటుక్కున తెగిపోతుంది. ఆకలి తీరగానే అలి బృందాలు- తుమ్మెదలు పూలను వదిలేయడం లేదా!
మిళిందా (భ్రమరా)న్ని అడ్డుగా పెట్టుకొని పరోక్షంగా ‘భ్రమరగీతలు’ ఆలపించింది గోపికా బృందం. ‘రాధా భక్తిః హరిః జ్ఞానం’- రాధ భక్తి స్వరూపిణి, కృష్ణుడు జ్ఞాన స్వరూపుడు. భాగవతం రాధా మాధవుల యుగళరూపం. భాగవతంలోని ఈ ప్రసంగం భక్తి జ్ఞానాల ప్రణయ కలహానికి పట్టం కట్టిన ఘట్టం! ‘పలికించు విభుండు రామభద్రుండట!’- శ్రీరామచంద్రుని అపార కృపాలభ్యమైన సహజ పాండిత్య ప్రకర్షతో బమ్మెర వారు ఉపాలంభ (ఎత్తిపొడుపు, దెప్పుటతో కూడిన దూషణ భాషణం) లక్షణం కల ఈ ‘భ్రమరగీత’లలో ముద్దుగుమ్మలు (మనోజ్ఞురాళ్లు) గోపెమ్మల కమ్మని మధుర భక్తిని భావుక హృదయమ్ములు చెమ్మగిల్లగా ఇమ్ముగ కుమ్మరించారు.
శుకుడు- రాజా! ఇలాగని పల్లవాధరలు- గొల్లపడతులు పలుకుతుండగా వారిలో ఒక ఇందువదన- గోపిక (రాధాదేవి) నల్లనయ్య- గోవిందుని పదారవింద ధ్యానంలో పరవశించింది. ఆమె తన చేరువ- సమీపంలో దైవికంగా, చురుకైనదీ, కరుకైన- పదునైన బుద్ధి కలదీ, విరుల- పూల తేనె గ్రోలి మత్తిల్లినదీ, తన మృదు మధుర ఝంకార నాదంతో కాముకుల ఎదలను కలవరపరచేదీ అయిన ఒక గండుతుమ్మెదను చూచింది. తన్ను వేడుకోడానికి ప్రియుడు కన్నయ్య పంపిన దూతగా కల్పించుకొని అన్యాపదేశంగా- ఉద్ధవునికి తాకునట్లు ఆమె ఆ భ్రమరంతో ఇలా అన్నది…
మ॥ ‘భ్రమరా! దుర్జన మిత్ర! ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర
ప్రమదాళీ కుచ కుంకుమాంకిత లసత్ప్రాణేశ దామ ప్రసూ
న మరందారుణితాననుండ వగుటన్ నాథుండు మన్నించుగా
క మమున్నేపుచు బౌర కాంతల శుభాగారంబులన్ నిత్యమున్’
… ధూర్తులకు మిత్రుడవైన ఓ షట్పదా (భ్రమరా)! పూదేనె కోరి మా పాద పద్మాలు ముట్టకు. మధురాపుర కాంతల స్తన కుంకుమం అంటుకొన్న మా ప్రాణేశ్వరుని కంఠమాలికల కుసుమాలలోని మకరందాలు గ్రోలి నీ ముఖం కెందామర (రక్తకమలం) వలె ఎర్రబారి ఉంది. మమ్ము విరహ బారి పడవేసి- వేదనకు గురిచేసి తాను మాత్రం పౌర కాంతల మందిరాలలో అవ్వారిగా (అధికంగా) కులుకుతున్న మీ ప్రభువు వారిజాక్షుడు నిన్ను మన్నిస్తాడేమో కాని, ఓ మిళిందా! మేము మాత్రం ఎన్నటికీ క్షమించం.
మ॥ ‘ఒక పువ్వందలి తేనె ద్రావి మధుపా! యుత్సాహివై నీవు వే
ఱొకటిం బొందెడు భంగి మమ్మధర పీయూషంబునం దేల్చి మా
యకలంకోజ్జల యౌవనంబు గొని యన్యాసక్తుడయ్యెన్ విభుం
డకటా! యాతనికెట్లు దక్కె సిరి? మిథ్యా కీర్తి నమ్మెం జుమీ’
– ఓ భృంగరాజా! ఒక పువ్వులోని తేనె త్రాగి దానిని దిగవిడిచి ఉబలాటంతో నీవు మరో పువ్వును ఆశ్రయిస్తావు. అలాగే, మా విభుడు శ్రీధరుడు తన అధరామృతాన్ని ఒక్కసారి మమ్ము గ్రోలనిచ్చి, పొంగులువారే మా అచ్చమైన పచ్చి యౌవనం దోచుకొని ఇప్పుడు ఇతర కాంతలయందు ఆసక్తుడై మమ్మిలా వెతల పాలు గావించాడు. అయ్యో! తాను స్వచ్ఛమైన కీర్తి గలవాడని ఆ చపలచిత్తుడు హరి తన ఇచ్చకపు మాటలతో నమ్మించి, సిరి- లక్ష్మీదేవి తనను కోరి వరించునట్లు చేసుకున్నాడు కాబోలు!
ఓ మధుపమా! యదునాథుడు మంచివాడని అతనిని ఎంతో సంతోషంతో హెచ్చుగా మెచ్చుకుంటున్నావు. మమ్ములను బుజ్జగించడానికే కదా ఇదంతా? నీ గానం విని మేము సొక్కి సోలిపోతామనుకున్నావా? మీ నాథుని కథలు మాకు క్రొత్తవి గావు. నీ సంగీతం మేము ఆలకించం. నీ ఇచ్చకాలిచ్చట పనికిరావు. నీ చెలికాని తప్పులను ఒప్పులుగా కప్పిపుచ్చే నీ నేర్పు పప్పులిక్కడ ఉడకవు. నీ గాంధర్వ విద్యను మథురలోని మగువల ముందు ప్రదర్శించి వారి మెప్పును పొందు.
వారు మెచ్చుకొని నీకిష్టమైన పదార్థాలు ఇస్తారు. రోలంబేశ్వర (ఓ గండుతుమ్మెదా)! రాయబారం సలపడంలో నీకు చాతుర్యం మెండు. అది నీకు కొట్టినపిండి. నువ్వు గడుసరివే. అయినా నీ నేర్పులను ఇక చాలించు. మా ఓర్పును పరీక్షించక మా పాదపద్మాలను త్యజించు. మా పతి పుత్రాదులను అతి చులకనగా విడిచి, సద్గతి- ముక్తి మాట కూడా ఎత్తక తనతోనే హత్తుకుపోయి- లీనమై ఉన్న మమ్ము అతడేల పరిత్యజించాడు? యదు సత్తముడు, ‘ధర్మో ధర్మ విదుత్తమః’ (విష్ణు సహస్ర నామం)- ధర్మ స్వరూపుడే కాదు, ధర్మవేత్తలలో ఉత్తముడు కూడా కదా! ధర్మం తెలిసిన వారు ఇలాంటి ప్రవర్తనను ప్రశంసిస్తారా?
శా॥ ‘వాలిం జంపెను వేటకాని పగిదిన్ వంచించి; దైత్యానుజన్
లోలంబట్టి విరూప జేసెను; బలిం లోభంబుతో గట్టి యీ
త్రైలోక్యంబు మొరంగి పుచ్చుకొనియెన్; ధర్మజ్ఞుడే మాధవుం
డేలా షట్పద! యెగ్గు మా వలన నీ కెగ్గింపగా నేటికిన్?’
– ఓ అళీశ్వర (తేటిరాజా)! రామావతారంలో ఈ వనమాలే- రామానుజుడే వానర రాజైన వాలిని వేటకాని వలె వంచించి- పొంచి ఉండి, చెట్టు చాటున మాటు కాసి వధించాడు. అంతేకాక, తనపై మరులుగొన్న- మోజుపడ్డ రావణ సోదరి శూర్పణఖను, ఆడదని కూడా చూడకుండా ముక్కుచెవులు కోసి విరూపను గావించాడు. ఈ వాసుదేవుడే వామనావతారంలో అతిలోభం- పేరాసతో దానవ చక్రవర్తి, దాతృశిరోమణి బలిని దాన వ్యసనంలో ముంచి, బంధించి, మోసపుచ్చి విక్రమించి, ముల్లోకాలను ఆక్రమించి పుచ్చుకున్నాడు. ఇట్టి మాధవుడు ధర్మజ్ఞుడా? నీవు విజ్ఞుడవా? మాలో తప్పేముంది? అతనిని ఒప్పుకొని కొనియాడుతూ మమ్ము దెప్పడమెందుకని?
శుకుడు- రాజా! ఇలా ఇంకా అనేక విధాలుగా కృష్ణ సందర్శనానికి ఆరాటపడుతున్న గోప భామినుల మాటలు విని ఉద్ధవుడు తియ్యని పలుకులతో వారిని ఊరడిస్తూ ఇలా అన్నాడు… జప తప దాన హోమ యమ నియమాది విధానాలు, తపస్సు, స్వాధ్యాయం మున్నగు సాధనలచే నిపుణులైన ఏ మహాత్ములు ప్రయత్నపరులై కూడా పరమాత్మని మనస్సులో నిలుపుకోలేక పోతున్నారో, అట్టి విరాట్పురుషుడు, మహా మహిమాన్వితుడు అయిన జగన్నాథునిపై మీకు నిరంతర నిశ్చల ధ్యానం నెలకొనడం చాల ఆశ్చర్యకరం. ‘భవచ్చారిత్రముల్ చిత్రముల్’- ఆహా! మీ చరిత్రలు అతి విచిత్రాలు! అద్భుతాలు! మానవతులారా! మాధవుడు పంపిన సందేశాన్ని మీకు వినిపిస్తాను.
శోకం మాని సావధానంగా ఆలకించండి- రమణులారా! నేనే అంతటికి ఉపాదాన- ప్రధాన కారణం కనుక, అందరి ఆత్మను నేనే. నేను అన్నింటా అనుగతుైణ్ణె- అనుసరించి ఉన్నాను కాన, మీకు నాతోటి వియోగమెప్పుడూ లేదు. మట్టికీ కుండలకు ఎన్నడైనా వియోగముంటుందా? మీరు నా హృదయంలోనే ఉన్నారు. ‘న వినా విప్రలంభేన సంయోగః పుష్టి మశ్నుతే’- సంయోగంలో కన్నా వియోగంలో రసపుష్టి ఎక్కువ. నా నిరంతర స్మరణ కొరకే నేను మీకు ఎడమయ్యాను. భయాన్ని వీడండి. నిరంతర ధ్యాన పరాయణలై మీరు నన్నే పొందగలరు. హృదయంలో ఉన్నవాడు దూరస్థుడైనా సమీపస్థుడే. హృదయంలో లేనివాడు ఎంత సమీపస్థుడైనా దూరస్థుడే.
ఉత్సవరూపుడైన ఉద్ధవుని ద్వారా సిద్ధ సంకల్పుడు కృష్ణుని నిత్య సత్య సందేశం విని, మదిలో నెమ్మదిగా ఉత్సాహం నింపుకొని, సంతసించి గోప వనితలు ఆయనతో ఇలా అన్నారు… ‘హరి ఇమ్ముగ- సుఖంగా ఉన్నాడా? ఆయన మరి ఇక్కడికెప్పుడు వస్తాడు? కనికరించి వచ్చి మా ఉమ్మలికాన్ని- పరితాపాన్ని హరిస్తాడా? మా ప్రాణపతి, రతిపతి శతకోటి సుందరాంగుడు ఇచటికి వద్దామనుకున్నా మధురాపురి గద్దరి- గడుసు అతివలు ఆయనను అడ్డగిస్తారే, కాని దొడ్డ- గొప్ప మనసుతో సహిస్తారా? అయ్యయ్యో! దయమాలిన అరవింద భవుడు బ్రహ్మ మమ్ము మన్మథ వేదనలకు గురిచేశాడు గదా! ఉద్ధవుని సన్నిధిలో శ్రీకృష్ణుని ఉద్దేశించి గోపికలు ‘హే గోవిందా! దుఃఖ సాగరంలో మునిగి ఆకుల- కలతపడుతున్న గోకులాన్ని ఉద్ధరించు’ అని విన్నవిస్తూ మిగుల శోకించారు.
అయినా కృష్ణ సందేశాన్ని మననం చేసుకుంటూ వేదనల నుంచి విముక్తి పొంది ఉద్ధవుని పూజించారు. మా కన్నయ్యకు… వెన్న, మీగడ, నెమలి కన్ను, పిల్లనగ్రోవి, కొమ్ముబూర.. ఇవన్నీ చాలా ఇష్టమని తలా ఒకటి ఇచ్చారట! కృష్ణలీలలు వర్ణించి పాడుతూ ఉద్ధవుడు కొన్ని నెలలు వ్రేపల్లెలోనే ఉండి, మథురకు ప్రయాణమవుతూ గోపికలతో ‘ఓ పూజ్యలారా! కృష్ణ వియోగం వలన మీకు ‘సర్వమూ అతడే’ అను భావం- ‘ఏకాంత భక్తి’ లభించింది. మీ భగవత్ప్రేమను దర్శించడం వలన, మీ అనుగ్రహంతో నాలో కూడా భక్తి ఇబ్బడి-ముబ్బడిగా పెంపొందింది’ అని విన్నవించుకున్నాడు. గోపీ సన్నిధిలో ఉద్ధవునికి దివ్యానందానుభూతి కలిగింది. భగవత్సన్నిధిలో కూడా లభించనిది భక్త సన్నిధిలో లభిస్తుంది. ఇది భాగవత సిద్ధాంతం. ఉద్ధవుడు బయటికి ఉద్ధవుడిగా కనిపిస్తున్నా అంతరంగంలో- హృదయతః గోపీత్వం- గోపీ భావం పొందాడు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006