Yadadri Temple | బ్రాహ్మీ ముహూర్తంలో బ్రహ్మాండనాయకుడి మేలుకొలుపు మొదలు అర్చనలు, అభిషేకాలు, పూలంగి సేవలు, మహా నివేదనలు.. ఇలా ప్రతీ కైంకర్యం యాదాద్రీశుడి వైభవాన్ని రెట్టింపు చేసేదే. ఈ పుణ్య క్షేత్రంలో 300 ఏండ్ల కిందట శ్రీమత్ వానమామలై జీయర్ స్వామి వారు లక్ష్మీనరసింహుడికి నిర్వహించాల్సిన సేవలను క్రమబద్ధీకరించారు. అప్పటి నుంచి ఆగమోక్తంగా, పాంచరాత్ర ఆగమశాస్త్ర విధానంగా, భగవత్ రామానుజ సంప్రదాయ సిద్ధంగా లోకోత్తర విశేషాలతో స్వామివారికి నిత్య సేవలను నిర్వహిస్తున్నారు అర్చకులు.
యాదాద్రి ఆలయం పాంచరాత్ర ఆగమ శాస్త్రానికి ఒక గొప్ప ప్రయోగశాల. చతుర్దశ భువనాలను పాలించే స్వామివారికి అన్ని సేవలనూ శాస్త్రానుసారంగా జరుపుతారు. రోజూ బ్రాహ్మీ సమయంలో స్వామివారి సుప్రభాత సేవ నిర్వహిస్తారు అర్చకులు. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. ఆళ్వారుల మంగళా శాసనాలు చదువుతూ స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. ఆదమరచి నిద్రపోతున్న స్వామిని ‘కౌసల్యా సుప్రజా రామ..’ అంటూ స్థాన సుప్రభాతాన్ని రాగయుక్తంగాఆలపిస్తూ మేల్కొలుపుతారు.
సుప్రభాత సేవ తర్వాత ఉదయం 4.00 నుంచి 4.30 వరకు యాదాద్రీశుడికి తిరువారాధన కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత బాలభోగం (ఆరగింపు) నివేదన సమర్పిస్తారు. నిత్యబలి ప్రదానం, మంగళాశాసనంతో ప్రాభాతిక సేవలకు ముగింపు పలికి.. భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉదయం 5.30 గంటలకు స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు. పంచసూక్తాలు, సున్నాల పన్నం పఠిస్తూ గంటపాటు తిరుమంజనం (అభిషేకం) కొనసాగిస్తారు. ఉదయం 8.15 గంటలకు సహస్ర నామార్చన చేస్తారు. నిజాభిషేకం, సహస్ర నామార్చన ఆర్జిత సేవల్లో భక్తులు సైతం పాలుపంచుకుంటారు. ప్రతి ఉదయం 8.00 గంటల నుంచి 10.00 గంటల వరకు సుదర్శన నరసింహ హోమం నిర్వహిస్తారు. ఈ హోమంలో పాల్గొంటే భూతప్రేత పిశాచాల బాధలు తొలగిపోతాయనీ, ఆరోగ్యం-ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.
ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు నిత్య తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. లక్ష్మీదేవితో నరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సశాస్త్రీయంగా జరిగే ఈ కల్యాణ క్రతువులో పాల్గొన్నవారికి సకల అరిష్టాలు తొలగిపోతాయి. అవివాహితులకు కల్యాణ యోగం కలుగుతుంది. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, నూతన వస్త్ర సమర్పణ, మహా సంకల్పం, చూర్ణిక, లగ్నాష్టకాలు, కన్యాదానం, మంగళసూత్ర ధారణ, బ్రహ్మముడి, అక్షతారోపణ (తలంబ్రాలు) తదితర క్రతువులు కన్నుల పండువగా జరుగుతాయి. కల్యాణ కైంకర్య సమయంలో ఆస్థానంలో కల్యాణం, మూలస్థానంలో స్వామివారిని భక్తులందరు దర్శించుకుంటారు.
మధ్యాహ్నం 11.30 గంటలకు మహారాజభోగం నివేదిస్తారు. ఈ నివేదనలో పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, వడలు, సొండెలు, దోశలు తదితర భక్ష్యభోజ్యాలు స్వామి వారికి సమర్పిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళాశాసనం తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి గంటపాటు దర్శనాలు నిలిపివేస్తారు. స్వామివారికి విశ్రాంతి ఇస్తారు. నాలుగు గంటలకు మళ్లీ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 6.30 గంటల నుంచి ఆర్జిత సేవలో భాగంగా భక్తులు స్వామివారికి నిత్యసేవ, అష్టోత్తర కైంకర్యాలు చేయించుకునే వీలు ఉంటుంది.
సాయంత్రం జరిగే దర్బార్ సేవలో నాలుగు వేదాలు పారాయణం చేస్తారు. స్వస్తి మంత్రాలతో స్వామిని శాంతింపజేస్తారు. తర్వాత ఉత్సవమూర్తిని గర్భాలయానికి తరలిస్తారు. ఉత్సవమూర్తికి ప్రత్యేక సేవలను నిర్వహిస్తారు. తర్వాత నరసింహస్వామికి గరుడ వాహన సేవ, లక్ష్మీదేవికి తిరుచ్చి సేవ చేస్తారు. రాత్రి 7 నుంచి 7.30 మధ్య సాయంకాలం తిరువారాధన జరుగుతుంది. దీనికి కొనసాగింపుగా సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు. రాత్రి 8.15 గంటల నుంచి 9 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత రాత్రి నివేదన సమర్పిస్తారు. నివేదన సమయంలో భక్తులకు స్వామివారి ప్రసాద వితరణ జరుగుతుంది. ఆరగింపు అనంతరం స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు పవళింపు సేవ కార్యక్రమాన్ని ఆర్జిత సేవగా ఎంచుకునే వీలుంది. పవళింపు సేవ తర్వాత రాత్రి 9.45 గంటలకు ద్వార బంధనం కార్యక్రమాన్ని చేపట్టి ఆలయాన్ని మూసివేస్తారు. ఇలా ప్రతిరోజూ యాదాద్రీశుడికి విశేష సేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు, స్వాతి నక్షత్రం, ఇతర ప్రత్యేక రోజుల్లో మరికొన్ని సేవలు ఉంటాయి.