ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః॥
(భగవద్గీత 12-1)
ఓ కృష్ణా! నీ సగుణ రూపాన్ని నిరంతరం అనన్య భక్తితో విధివిధానంగా ఆరాధిస్తూ ధ్యానించేవారున్నారు. అలాగే కేవలం అక్షరుడవని.. సచ్చిదానంద నిరాకార పరబ్రహ్మంగా భావించి ఉపాసించే వారూ ఉన్నారు. ఈ రెండు మార్గాలలో ఉపాసించే వారిలో అత్యుత్తమ యోగులు ఎవరు? అంటూ ప్రశ్నిస్తున్నాడు, అర్జునుడు.
భగవంతుడు ఒక్కడే.. అతణ్నే సాకారంగానూ, నిరాకారంగానూ ఆరాధిస్తారు. కాబట్టి సగుణ నిర్గుణ రూపాలలో దేనిని భావించి చిత్తశుద్ధితో ధ్యానించినా, ఆరాధించినా ఫలితం లభిస్తుంది, లక్ష్యం చేరుకోగలం. భగవత్ ఆరాధన అంటే.. బాధ్యతలను పక్కనపెట్టి గుడులు గోపురాలు తిరగడమో, తీర్థయాత్రలు చేయడమో, గంటల కొద్దీ పూజా గృహంలో గడపడమో కాదు. అట్టహాసంగా, ఆర్భాటంగా పూజాదికాలు నిర్వహించడం అంతకన్నా కాదు. చేసే ప్రతి పనీ భగవదారాధనగా భావిస్తూ.. కర్తవ్యాన్ని పాలించడమే.. నిజమైన ఆరాధన.
‘రామోరాజ్య ముపాసిత్వా’ అన్నారు. అంటే రాముడు రాజ్యాన్ని పాలించలేదు.. ఉపాసించాడట. హక్కుగా భావించడం పాలించడం.. బాధ్యతగా భావించడం ఉపాసించడం. ప్రతిజీవిలోనూ అంతర్లీనంగా భౌతిక ఆకృతికి అతీతమైన దైవత్వాన్ని గుర్తించడం. దానిపట్ల గౌరవ భావనతో వ్యవహరించడమే ఉపాసన. భగవంతుడిని భజించే సమూహానికి అవసరమైన వసతులు, వనరులు సమకూరుస్తూ.. బయట తిరుగుతూ ఉన్నా మనసును మాత్రం భజనపై, భగవంతునిపై కేంద్రీకరించడామూ ఉపాసనే.
మనసులో పరమాత్మను నిలుపుకోవడం, దైవ చింతనాపరులై ఉండటం, శ్రద్ధతో ఆరాధించడం.. ఈ మూడు ఆచరించడమే ముఖ్యం! కాని అది సగుణోపాసనా, నిర్గుణోపాసనా అనేది విచారణీయాంశం కాదు. భౌతిక జీవితానికి సంబంధించిన కర్తవ్యాలను నిర్వహించే క్రమంలో భక్తి, శ్రద్ధలు, ఏకాగ్రతలు ప్రధానమైనవి. ఆ క్రమంలో న్యాయంగా ప్రవర్తించడం, త్యాగభావనతో వర్తించడం, సంపదను సృష్టించడం, పెంచుకోవడం, పంచుకోవడం, ఇతరుల కష్టాలపట్ల సహానుభూతిని ప్రకటించడం.. అన్నిటినీ భగవత్ ఉపాసనగానే భావించాలి. ‘పానీయంబులు ద్రావుచున్, గుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేస్తున్నా’ కూడా దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించడమే అన్యన్య భక్తి. చిత్తశుద్ధితో రెండిటిలో దేనిని ఉపాసించినా అవ్యక్తమైన ఆ పరబ్రహ్మకే చెందుతుంది. అయితే సాధన ఆరంభంలో సాధకుని మనసు నిశ్చలంగా నిలవడానికి అవ్యక్తానికన్న వ్యక్తమే ఉపకరిస్తుంది.
నిత్య జీవితంలో ఒక కార్యాన్ని సాధించేందుకు వివిధ మార్గాలు ఉండవచ్చు.. ఏ మార్గంలో ముందుకు సాగినా కావలసింది.. లక్ష్యంపై చెదరని దృష్టి, భక్తిశ్రద్ధలు, అంకితభావన, నిరంతర సాధన. సంస్థ లక్ష్యాలను, చేరుకునేందుకు విలువలను కాపాడుతూ.. అనుచరులను, ఉద్యోగులను ఒక్కతాటిపై నడిపే సామర్ధ్యం అవసరం. ప్రక్రియల ఆధారంగా పద్ధతులను ఏర్పరచడం, సరైన పనిని ఎన్నుకొని సరైన విధానంలో నిర్వహించడం.. నిబద్ధత. అంకిత భావనలతో నైతికతతో కూడిన పని సంస్కృతిని సంస్థలో నెలకొల్పడం.. దానిని ఆచరణలో చూపడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.
సమస్యల పరిష్కారానికి వివిధ మార్గాలను అన్వేషించడం, ఉత్తమ మార్గంలో అనుచరులను నడిపించడమే కాక వారిలోని అత్యుత్తమ శక్తిసామర్థ్యాలను వెలికి తీసుకొని సంస్థ పురోగతికి వినియోగించేందుకు అవసరమైన ప్రేరణను ఇవ్వడం అవసరం. ఈ విలువలు పాటిస్తూ.. వినియోగదారుని అభిమానాన్ని చూరగొనే నాయకుడు.. అనుచరులకు ప్రేరణగా నిలవడమే కాక ఉత్పాదకతతో కూడిన మానవ వనరులను సమర్ధవంతంగా వినియోగించుకో గలుగుతాడు.లక్ష్యం ఉన్నతమైన సమయంలో సగుణమైనా నిర్గుణమైనా అంకితభావనతో ఫలితాన్ని పరమాత్మకు అర్పిస్తూ.. కర్తవ్యాన్ని పాలించడమే.. ఉపాసన.. అంటాడు, పరమాత్మ.
– పాలకుర్తి రామమూర్తి