కురుక్షేత్ర సంగ్రామం జోరుగా సాగుతున్నది. భీష్ముడు అంపశయ్యను చేరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం కౌరవుల విడిది నిశ్శబ్దంగా మారింది. మర్నాడు సమరంలో సర్వసైన్యాన్ని ముందుండి నడిపించాల్సిందిగా ద్రోణాచార్యుడిని కోరుతాడు దుర్యోధనుడు. ఆ సమయంలో ‘నీకు ఏం కావాలో కోరుకో!’ అని దుర్యోధనుడ్ని అడుగుతాడు ద్రోణుడు. ‘పాండవాగ్రజుడైన ధర్మరాజును బందీగా పట్టుకొని, ప్రాణాలతో నా సమక్షంలో నిలబెడితే చాలు’ అని కోరుతాడు గాంధారీ సుతుడు. ప్రాణాలు తీయమనకుండా బందీగా పట్టుకోమని చెప్పడం ద్రోణుడికి ఆశ్చర్యం కలిగించింది. ‘అలాగే నాయనా! ధర్మరాజును నీ ముందు నిలబెడతాను. అప్పుడైనా వారి రాజ్యం వారికి ఇచ్చి ఈ యుద్ధానికి ముగింపు పలుకుతావు కదా!’ అని అడుగుతాడు ద్రోణుడు. అప్పుడు దుర్యోధనుడు హేళనగా నవ్వుతూ ‘ఇంత యుద్ధం సాగించింది, వారి రాజ్యం వారికి ఇవ్వడానికి కాదు గురుదేవా! ఈ రాజ్యం మా సొత్తు. దాన్ని దాయాదుల పరం కానిచ్చే ప్రశ్నే లేదు. ధర్మరాజు జూదరి. మళ్లీ తనను జూదానికి పురిగొల్పి, శకుని చేతిలో ఓడించి మళ్లీ పన్నెండేండ్ల వనవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసానికి పంపుతాం’ అంటాడు. ఆ మాటలకు ద్రోణుడు హతాశుడవుతాడు.
మనసులో ‘పోగాలం దాపురించిన వారికి హితవాక్యాలు చెవికి ఎక్కవు’ అనుకుంటాడు. ‘దుర్యోధన నా ధర్మం నేను పాటిస్తాను. అర్జునుడు దగ్గర ఉండగా ధర్మరాజును బంధించడం ఎవరి తరం కాదు! పాండవ మధ్యముణ్ని రణక్షేత్రానికి దూరంగా తీసుకువెళ్తే.. నీ కోరిక తీరుస్తాన’ని చెబుతాడు. ఈ సన్నివేశం దుర్యోధనుడి దుష్టబుద్ధిని తెలియజేస్తుంది. ఇతరులకు హింస తలపెట్టాలని అనుకునేవారికి అంతిమంగా దక్కేది అపజయమే అని మహాభారత కథ తెలియజేస్తుంది.